ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒకరు అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నారా? తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటికంటే క్లిష్టమైన పరిస్థితుల్ని ప్రస్తుతం ఎదుర్కొంటున్నారా? మిత్రపక్షం నాయకుల్ని సంతృప్తి పరచడం, కూటమిలో సమన్వయం సాధించడమన్నది ఆయనకు కత్తి మీద సాములా మారిపోయిందా? అంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న ఆ మినిస్టర్ ఎవరు? సత్తా చాటగలరా అన్న అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా రాజకీయ తెర మీద కనిపించి….. అలా ఎంట్రీ ఇచ్చి..ఇలా ఎమ్మెల్యేగా గెలిచి… ఆ వెంటనే మంత్రి అయిపోయారు సత్యకుమార్. అలాంటి నేతకు ఇప్పుడు అసలైన అగ్ని పరీక్ష ఎదురుకాబోతోందంటున్నారు పరిశీలకులు. ఇన్ని రోజులు ఎలా గడిచినా…. ఇప్పుడు తన బలం, బలగాన్ని చూపించడంతో పాటు…. రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించాల్సిన టైం వచ్చిందని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ సత్యకుమార్ ధర్మవరం మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని ఎలా గెలిపిస్తారన్న ఆసక్తి పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి బలమైన కోటలా ఉన్న ధర్మవరంలో.. గత ఎన్నికల టైంలో.. పొత్తుల్లో భాగంగా బీజేపీ అభ్యర్థిగా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు సత్యకుమార్.
అంతకు ముందు ఐదేళ్లు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసి, విజయం ఖాయమనుకున్న టైంలో… టీడీపీ అధిష్టానం ఆదేశాలతో పరిటాల శ్రీరామ్ తప్పుకోవాల్సి వచ్చింది. కానీ… ఎన్నికల తర్వాత ధర్మవరంలో పరిస్థితులు వేగంగా మారిపోయాయట. మంత్రి సత్యకుమార్ అనుచరులు అడుగడుగునా తెలుగుదేశం శ్రేణులను ఇబ్బందులు పెడుతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళను తట్టుకుని, వేధింపులకు వ్యతిరకంగా నిలబడి… పార్టీ ప్రయోజనాల కోసం కలబడి పోరాడితే… తీరా… అధికారంలోకి వచ్చాక సొంత ప్రభుత్వంలోనే తమకు ప్రాధాన్యం లేకుండా పోతోందన్నది ధర్మవరం తెలుగు తమ్ముళ్ళ ఆవేదన అట. ఆ విషయంలో వాళ్లు తీవ్ర ఆగ్రహంగా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ధర్మవరం మున్సిపాలిటీలోని మొత్తం 48 వార్డుల కోసం మూడు పార్టీల నేతలు పంపిన లిస్టులు ఇప్పుడు సోషల్ మీడియా నుంచి అధిష్టానం కారిడార్ల వరకు హాట్ టాపిక్‌గా మారాయి.
బీజేపీ తరఫున ఏకంగా 35 మందితో అభ్యర్థుల జాబితాను ఇప్పటికే రాష్ట్ర కమిటీకి పంపినట్లు తెలుస్తోంది. తాము ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకున్నాం కాబట్టి…. మెజారిటీ స్థానాలు మాకే దక్కాలని, చైర్మన్ పీఠంపై కాషాయ జెండానే ఎగరాలంటూ మంత్రి అనుచర గణం పట్టుబడుతోందట. కానీ… అందుకు టీడీపీ ఏ మాత్రం అంగీకరించడం లేదని అంటున్నారు. మాకు క్షేత్ర స్థాయిలో ఉన్న బలం ఏ మాత్రం తగ్గలేదు, మున్సిపల్ సీటు మాకే కావాలన్నది టీడీపీ నేతల వాదన. అందులో భాగంగా వాళ్ళు కూడా 35 మందితో మరొక లిస్ట్‌ను టీడీపీ అధిష్టానానికి పంపినట్లు సమాచారం. అంతకు ముందు ఐదేళ్లుగా గ్రౌండ్ లెవల్‌లో తాము పడిన కష్టానికి గుర్తింపు ఉండాలి గానీ, మున్సిపాలిటీని పూర్తిగా బీజేపీ చేతుల్లో పెట్టేస్తే మొత్తంగా పార్టీ ఉనికికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు తమ్ముళ్ళు. ఇక అటు జనసేన కూడా…. 16 మందితో విడిగా లిస్ట్ సిద్ధం చేసి పంపినట్లు తెలుస్తోంది. అలా… ఈ మూడు పార్టీల అభ్యర్థుల సంఖ్యను కలిపితే మున్సిపాలిటీలో ఉన్న వార్డుల కంటే ఎక్కువై పోతోంది. ఈ జాబితాల యుద్ధం ఇప్పుడు మంత్రి సత్యకుమార్‌కు పెను సవాల్‌గా మారిందట. ఇన్ని ప్రాధాన్యతల నడుమ సమతుల్యత సాధించడం ఆయనకు కత్తిమీద సాములా మారిందని అంటున్నారు.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన కూడా… అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. బయటకు వస్తున్న అసమ్మతి వార్తలను కొట్టిపారేస్తూనే, తెర వెనక నష్టనివారణ చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తాను కేవలం ఒక వర్గానికో, ఒక పార్టీకో మంత్రిని కాదని.. కూటమి అంతటికీ ప్రతినిధినని చెప్పుకుంటూ సమన్వయ మంత్రాన్ని జపిస్తున్నారు. కింది స్థాయి నేతల నుంచి రాష్ట్ర అగ్రనేతల వరకు అందరితోనూ చర్చలు జరిపి, ఆమోదయోగ్యమైన ఫార్ములా తీసుకువస్తానని సన్నిహితులకు చెబుతున్నారట. వివాదాలను వీలైనంత వరకు చర్చల ద్వారా పరిష్కరించుకుని, ప్రతి సీటును ఇరు పార్టీల సమ్మతితోనే కేటాయించాలని భావిస్తున్నట్టు సమాచారం. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇస్తూనే.. చైర్మన్ స్థానాన్ని మాత్రం బీజేపీకే ఉంచుకునేలా అధిష్టానం ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇన్ని చిక్కుముడుల మధ్య ధర్మవరం మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరడం సాధ్యమేనా? ఛైర్మన్ సీటు తమకు ఇవ్వకుంటే టీడీపీ వాళ్ళు సహకరిస్తారా? అలాంటి పరిస్థితే వస్తే… మంత్రి సత్యకుమార్ ఈ ఎన్నికలను ఎలా లీడ్ చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

