వైసీపీ అధిష్టానం కఠిన నిర్ణయాలకు సిద్ధమైందా? ఆ దిశగా ఆల్రెడీ యాక్షన్ మొదలైపోయిందా? పార్టీ పెద్దల చర్యలు చూసి ఆ ఉమ్మడి జిల్లా నేతలు ఉలిక్కి పడ్డారా? ఇన్నాళ్ళు మెరుపు తీగల్లా మారిపోయిన కొందరు ఇప్పుడు కండువాలు సర్దుకుని పరుగులు పెడుతున్నారా? ఏ జిల్లాలో జరుగుతోందా వ్యవహారం? పార్టీ తీసుకుంటున్న చర్యలేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే జిల్లాల్లో ఉమ్మడి నెల్లూరు ఒకటి. కానీ… గత అసెంబ్లీ ఎన్నికల్లో తీరు పూర్తిగా మారిపోయింది. అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు.. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కారణంగా… కూటమి జిల్లాను క్లీన్ స్వీప్ చేసేసింది. బలం ఉన్న చోట ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఫ్యాన్ పెద్దలు ప్రస్తుతం పూర్తి స్థాయి రిపేర్ వర్క్స్ మొదలుపెట్టారట. జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కీలక అడుగులు పడుతున్నాయని, ఇన్ఛార్జ్‌ల మార్పు అందులో భాగమేనని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ప్రతిపక్షంలో ఉన్నాసరే… నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ… పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లని వారిపై చర్యలు మొదలయ్యాయని అంటున్నారు.
గూడూరు ఇన్ఛార్జ్‌ని మార్చడం కూడా ఇందులో భాగమేనని ఫ్యాన్ పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి ఇన్ఛార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పార్టీకి విధేయుడు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాక నియోజకవర్గ బాధ్యుడిగా విధుల్లో ఉన్నారాయన. కానీ… మేరిగ తీరుపై రెడ్డి సామాజిక వర్గం నేతల ఫిర్యాదుతో తేడా వచ్చిందట. ఆయన స్థానంలో వేరే నేత గురవయ్యకు అవకాశం ఇచ్చింది అధిష్టానం. ఇక ఇదే సమయంలో పార్టీ కార్యక్రమాలను ఆశించిన స్థాయిలో ముందుకు తీసుకెళ్లని వారిపై కూడా అధిష్టానం దృష్టి పెట్టిందట. ఆ క్రమంలోనే… వచ్చే ఎన్నికల కోసం ఇప్పట్నుంచే గెలుపు గుర్రాల వేట మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అందుకోసం 2019 నాటి సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్ని కార్యక్రమాలు చేసినా… పొలిటికల్ మైలేజీ రాని నియోజకవర్గాల్లో ఇన్చార్జ్‌లను మార్చేసి అంగ బలం, ఆర్ధిక బలం ఉన్నవారికి బాధ్యతలు అప్పగిస్తున్నారట. 2019లో కూడా ఇదే తరహా వ్యూహం అమలు చేసింది వైసీపీ.
అప్పట్లో ఇన్ఛార్జ్‌లను మార్చి ఎన్నికలకు వెళ్ళడం వర్కౌట్ అయిందన్నది వైసీపీ పెద్దల అభిప్రాయం. అందుకే… ఈసారి సేమ్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల సమయంలో ఎలాగైనా గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో జిల్లాలో టిక్కెట్స్ కేటాయించడం వల్లే క్షేత్ర స్థాయిలో సీమ్ రివర్స్ అయిందని అంటున్నారు జిల్లా నాయకులు. ఇదే అభిప్రాయం పై స్థాయిలో కూడా రావడం, ఈసారి ఎలాగైనా కొట్టాలన్న పట్టుదల పెరగడం లాంటి కారణంగా గెలుపు గుర్రాలకు మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలనికుంటున్నట్టు చెబుతున్నారు. గూడూరులో మేరిగ మురళీధర్‌ను తప్పించి గురవయ్యను నియమించడంతో సరిపెట్టకుండా…నియోజకవర్గంలోని లీడర్స్ మొత్తం ఆయనకు సహకరించాల్సిందేనన్న ఆదేశాలు వెళ్లాయట. జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్దన్‌రెడ్డి దీన్ని రెగ్యులర్‌గా మానిటర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిరంతరంగా ఇది ఇలాగే కొనసాగితే… త్వరలోనే గూడూరు సెట్ అవుతుందన్నది పార్టీ భావన.
పార్టీకి విధేయులుగా ఉన్న వారిని మార్చి వేరే వారికి టికెట్ ఇచ్చినా…. నచ్చ చెప్పొచ్చన్న అభిప్రాయంతోనే వైసీపీ పెద్దలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో బలోపేతం అవ్వాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నది పార్టీ ఇంటర్నల్ టాక్. ప్రస్తుతం జిల్లాలోని సగానికి సగం నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లు అందుబాటులో ఉండటం లేదు. ఇప్పుడు మురళి మార్పుతో వాళ్ళంతా అలర్ట్ మోడ్‌లోకి వచ్చేశారట. రేపు స్థానిక సంస్థల ఎన్నికల లోపు అంతా సెట్ చేసుకుని ఇక నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అధిష్టానం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో మెరుపుతీగ నేతల్లో దడ పుడుతోందన్న చర్చ ఇప్పటికే పార్టీ వర్గాల్లో మొదలైంది. మొత్తంగా అధిష్టానం తగ్గకుండా ఈ ఊపును ఇలాగే కొనసాగిస్తే… జిల్లాలో పార్టీ తిరిగి కోలుకోవడానికి పెద్ద టైం పట్టకపోవచ్చన్నది సింహపురి ఫ్యాన్ కేడర్ వాయిస్.

