తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మారే అవకాశం ఉందా? ఇక్కడి నాయకుల్ని డీల్ చేయడం నా వల్ల కాదు బాబోయ్ అంటూ… మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ పెద్దలకు చెప్పేశారా? అధిష్టానం కూడా కొత్త ఇన్ఛార్జ్‌ని దింపే ప్లాన్‌లో ఉందా? అధికారం ఉన్న రాష్ట్రంలో అసలు ఎందుకా పరిస్థితి వచ్చింది? గాంధీల కుటుంబానికి అత్యంత సన్నిహితురాలని పేరున్న మీనాక్షి ఎందుకు హ్యాండ్సప్ అన్నారు? తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ ఎంటరైనప్పుడు ఆమె మీద చాలా పెద్ద అంచనాలున్నాయి. ఆమె అధిష్టానానికి, అందునా గాంధీల కుటుంబానికి అత్యంత సన్నిహితురాలని, ఆ బలంతో రాష్ట్రంలో పార్టీని టోటల్‌గా సెట్ చేస్తారని చెప్పుకున్నారు. కట్ చేస్తే… ఇప్పుడు కొత్త కొత్త మాటలు పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌గా కొనసాగడానికి ఆమే ఆసక్తిగా లేరని చెప్పుకుంటున్నారు. ఇక్కడ పరిస్థితులేవీ తనకు అనుకూలంగా లేవని, తాను నో అన్న వాళ్ళకే పదవులు ఇవ్వాలంటూ వత్తిడి పెరుగుతోందన్న అసహనం ఆమెలో పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి… ఆ స్థాయి నాయకుడినే ఇన్ఛార్జ్‌గా పంపాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. అదే నిజమైతే…ఆ విషయాన్ని మీనాక్షి ఎంపికకు ముందే పరిగణనలోకి ఎందుకు తీసుకోలేదన్న డౌట్ వస్తోంది. కారణం ఏదైనాగానీ…. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్‌ని మాత్రం మార్చబోతున్నారన్న వాసన మాత్రం పార్టీలో గుప్పుమంటోంది. దేశ వ్యాప్తంగా పార్టీని ప్రక్షాళన చేయాలని ఏఐసీసీ డిసైడైంది. అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్‌కు కూడా స్థాన చలనం కలిగించవచ్చన్నది ఇంకో వెర్షన్. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున అదే స్థాయిలో పార్టీని లీడ్ చేయడానికి మాజీ ముఖ్యమంత్రి ఒకర్ని తెలంగాణకు పంపాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
చాలా రోజులుగా దీని గురించి ప్రచారం ఉన్నా… ఇటీవల ఆ చర్చల తీవ్రత పెరిగింది. మీనాక్షి నటరాజన్ గాంధీ కుటుంబానికి దగ్గరే….. పార్టీ కోసం డెడికేటెడ్‌గా పనిచేసే వ్యక్తే….. కానీ తెలంగాణ నేతల్ని సమన్వయం చేయడానికి మాత్రం ఆమెకంటే సీనియర్ లీడర్ అవసరమని ఏఐసీసీ భావిస్తున్నట్టు సమాచారం. ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కూడా ఏఐసీసీలో చోటు కల్పించే అవకాశం ఉంది. ఇక మీనాక్షి నటరాజన్ కూడా ఒక దశలో… ఇక్కడ ఇన్ఛార్జ్‌గా చేయలేనని పెద్దలకు చెప్పారన్న ప్రచారం సైతం నడిచింది. తాను అనుకున్నట్టు, తన దగ్గరున్న నివేదికల ప్రకారం కాకుండా… ఒకరిద్దరు నాయకులకు కచ్చితంగా పదవులు ఇవ్వాలంటూ రాష్ట్ర నాయకత్వం నుంచి ఒత్తిడి రావడంతోనే ఆమె అలాంటి కామెంట్స్ చేశారన్న చర్చ జరుగుతోంది. ఓ మైనార్టీ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని రాష్ట్ర నేతలు ఒత్తిడి తేవడం ఇన్చార్జికి అస్సలు నచ్చలేదని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల భర్తీ కూడా వాయిదా పడుతూ వస్తోంది. దానికి కూడా ఇదే కారణమని చెప్పుకుంటున్నారు. ఇలాంటి అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకొని… తెలంగాణ కాంగ్రెస్ నాయకులను సమన్వయపరిచేందుకు మాజీ ముఖ్యమంత్రి స్థాయి నేతను ఇన్ఛార్జ్‌గా పెట్టాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు సరికొత్త చర్చలు మొదలయ్యాయి. ఇన్చార్జి మారతారా అన్నది ఒకటైతే… ఎందుకు మారబోతున్నారు…తెర వెనక ఇంకా ఏం జరిగిందన్నది ఇంకోటి. అధిష్టానం ఏం చేయబోతోందో చూడాలి మరి.
