ఎప్పుడూ కూల్ కూల్ పాలిటిక్స్ చేసే ఆ సీనియర్ లీడర్ ఉన్నట్టుండి ఎందుకు బ్లాస్ట్ అయ్యారు? తన సహజ శైలికి భిన్నంగా మాట తూలడం యాదృచ్చికమా? లేక వ్యూహాత్మకమా? వైసీపీ అధ్యక్షుడు జగన్ విషయంలో దాదాపు మొదటిసారి హాటు ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆ టీడీపీ ఎంపీ ఎవరు? అధిష్టానం అనుమానపు చూపులకు సమాధానంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న వాదనలో నిజమెంత? హుందాగా రాజకీయం చేస్తారని పేరున్న ఏపీ పొలిటీషియన్స్‌లో ఒకరు ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. టీడీపీతో పాటు గతంలో కాంగ్రెస్, వైసీపీ తరపున కూడా ఎంపీ అయ్యారాయన. గత ఎన్నికలకు ముందు తిరిగి తెలుగుదేశం కండువా కప్పుకుని గెలిచారు. పార్టీలు మారినా… వ్యక్తిగతంగా వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరుంది ఆయనకు. రాజకీయ ప్రత్యర్థుల విషంలో కూడా ఆచితూచి మాట్లాడతారని చెబుతారు. అలాంటి వ్యక్తి…తొలిసారి కాస్త తేడాగా మాట్లాడ్డం పొలిటికల్ హాట్ అయింది. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి మాగుంట చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చను మార్చేశాయి. జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం చేశారంటూ విమర్శించారు. అంత వరకు ఓకే… అది రాజకీయం. కానీ… దానికి కొనసాగింపుగా… సొంత కులపోడని ఓట్లేసి గెలిపిస్తే ఇష్టం వచ్చినట్లు చేసిన మూర్ఖుడు అనడంతో పాటు ఇంకో ఘాటు పదాన్ని కూడా వాడటంతో ఒక్కసారిగా అటెన్షన్ మొత్తం అటువైపు మళ్లింది. రాజకీయ విమర్శలు సహజమే గానీ….. మాగుంట లాంటి నేత నోటి నుంచి ఈ స్థాయి మాటలు రావడం ఏంటంటూ కాస్త ఆశ్చర్యంగానే మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు.
వాస్తవానికి.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెలిగొండకు సంబంధించిన కార్యక్రమాల్లో మాగుంట కూడా వైసీపీ ఎంపీ హోదాలో భాగస్వామిగా ఉన్నారు. అంతకుముందు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పనులు జరిగినప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో ప్రాజెక్ట్ వర్క్స్ కొనసాగినప్పుడు టీడీపీలో ఉన్నారు. అంటే…. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ప్రాజెక్ట్ ప్రతి దశలోనూ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భాగమయ్యారు. అలాంటిది, అన్నీ తెలిసిన నాయకుడు రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా జగన్‌ను వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేశారన్నదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఉన్న ప్రధాన ప్రశ్న. అందుకు సమాధానంగా కొన్ని ఆసక్తి కరమైన అంశాలు తెర మీదికి వస్తున్నాయి. ఆ మధ్య చెన్నైలో జరిగిన జగన్ సోదరుడి కొడుకు పెళ్ళికి వెళ్ళారు మాగుంట. అక్కడ జగన్‌తో ఆయన సన్నిహితంగా మాట్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో శ్రీనివాసులురెడ్డి మళ్లీ వైసీపీకి దగ్గరవుతున్నారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు వెలిగొండ వ్యాఖ్యలు ఆ ప్రచారానికి చెక్ పెట్టడానికేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి రాజకీయవర్గాల్లో. మరోవైపు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలతో మాగుంటకు మనస్పర్థలు వచ్చాయన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. అలాగే… వెలిగొండ సభకు ముందు రోజు రాత్రి వరకు మాగుంట హాజరుపై స్పష్టత లేదట. చివరకు పార్టీ పెద్దల నుంచి సమాచారం రావడంతో… చెన్నై నుంచి నేరుగా హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పూర్తయిన వెంటనే తిరిగి వెళ్లిపోయారాయన. అయితే వేదికపై మాత్రం జగన్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో… ఎంపీ వ్యాఖ్యలు కేవలం జగన్‌పై విమర్శలా.. లేక టీడీపీ నాయకత్వానికి పరోక్షంగా పంపిన రాజకీయ సందేశమా అన్న చర్చ జరుగుతోంది. చెన్నై పెళ్ళి ఎపిసోడ్ తర్వాత వచ్చిన అనుమానాలకు తెర దించడంతోపాటు… టీడీపీతో తన అనుబంధాన్ని మరింత బలంగా చాటుకునే ప్రయత్నం చేసి ఉంటారన్నది విశ్లేషకుల అంచనా.
జగన్‌తో నాకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదని చెప్పేందుకే… అంత ఘాటుగా మాట్లాడి ఉంటారని విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ మద్యం కేసు సమయంలో మాగుంట, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు వచ్చినప్పుడు కూడా… ప్రత్యర్థుల నుంచి రాజకీయ విమర్శలు వచ్చినా పూర్తిగా ఆయన్ని ఎవరూ టార్గెట్ చేయలేదు. కానీ తాజాగా వెలిగొండ వ్యాఖ్యల తర్వాత…. వైసీపీ శ్రేణులు నేరుగా ఎంపీని లక్ష్యంగా చేసుకున్నాయి. ముఖ్యంగా మార్కాపురం ప్రాంతంలో పార్టీలకు అతీతంగా జగన్‌కు అభిమాన వర్గం ఉందన్న రాజకీయ అంచనాల నడుమ ఎంపీ మాటలు స్థానికంగా కూడా చర్చకు దారితీశాయి. ఓట్ల సంగతి అటుంచితే… మార్కాపురం ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గంలో జగన్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని రాజకీయ వర్గాలే ఒప్పుకుంటాయి.. దీంతో ఇన్నాళ్లూ వివాదాలకు దూరంగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇమేజ్‌కు ఈ కాంట్రవర్సీ కామెంట్స్ ఇబ్బందికరంగా మారవచ్చన్న అభిప్రాయం బలపడుతోంది. టీడీపీ అధినేత దగ్గర తన ఇమేజ్ పెంచుకునేందుకు చేసిన ప్రయత్నం బూమరాంగ్ అయినా కావచ్చన్న విశ్లేషణలున్నాయి.

