Site icon NTV Telugu

Off The Record : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పొగడ్తల జడివాన

Revanth Reddy

Revanth Reddy

ఆ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకి ఉన్నట్టుండి సీఎం రేవంత్‌రెడ్డి మీద ఎందుకు ప్రేమ పెరిగిపోయింది? పైగా పొగడ్తల జడివాన కురిపించడం వెనకున్న రీజన్‌ ఏంటి? ఆ ప్రేమ వరద పారడానికి కారణం రాజకీయ కారణాలా? లేక వ్యక్తిగత వ్యవహారాలా? అభివృద్ధి కోసం మీతో కలిసి నడుస్తానని చెప్పడం వెనకున్న ఆంతర్యం ఏంటి? ఎవరా గులాబీ ఎమ్మెల్యే? ఏంటా ప్రశంసల పదనిసలు? ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన దృష్టిలో పడటానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు తపించిపోవడం సహజం. అందుకోసం కొంతమంది కొన్ని సందర్భాల్లో బోర్డర్స్‌ క్రాస్‌ చేస్తుంటారు కూడా. కానీ… ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే పొగడ్తలతో ముంచెత్తడం గురించి హాట్‌ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యంత కీలకమైన సెగ్మెంట్స్‌లో ఒకటైన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రేవంత్‌ను ఆకాశానికెత్తేయడం వెనకున్న ఆంతర్యం ఏంటా అని ఆరా తీస్తున్నాయి రాజకీయవర్గాలు.

ఆ మధ్య కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలో జరిగిన ఓ బహిరంగ సభలో ఎమ్మెల్యేని గట్టిగానే టార్గెట్‌ చేశారు రేవంత్‌. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావును ఉద్దేశించి విమర్శిస్తున్న క్రమంలో మాధవరంను కూడా కలిపేశారు ముఖ్యమంత్రి. అలాగే రెండు మూడు సభల్లో మాధవరం కృష్ణారావు పేరు ప్రస్తావించి మరీ… తిట్టినా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రియాక్ట్‌ అవలేదు. కానీ… అదే సమయంలో తనపై ఆరోపణలు చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మాధవరం. దాంతో ఏదో ఒక సందర్భంలో సీఎం వ్యాఖ్యల మీద కూడా రియాక్ట్‌ అవుతారని అనుకున్నారు అంతా. కానీ… ఇప్పుడాయన వ్యవహారశైలి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. గత సోమవారం కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని నల్ల చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సభకు అధ్యక్షత వహించారు కృష్ణారావు.

ఆ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారాయన. తామిద్దరం గతంలో తెలుగుదేశం పార్టీలో కలిసి పని చేసిన సంగతుల్ని గుర్తు చేశారు. అలాగే… రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఒక ప్రారభోత్సవoలో కొబ్బరికాయ కొట్టమంటే…. ముఖ్యమంత్రిగా వచ్చి కొడతానని చెప్పారంటూ ఫ్లాష్‌ బ్యాక్‌ రింగులు తిప్పేశారు ఎమ్మెల్యే. అనుకున్నది సాధించే వ్యక్తి రేవంత్ రెడ్డి అని తెగ పొగిడేశారు. అక్కడితో ఆగితే అది వేరే సంగతిగానీ… ప్రసంగం చివర్లో… అభివృద్ధి పరంగా తాను ముఖ్యమంత్రితో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నానని కొసమెరుపు మాటలు చెప్పడం చుట్టూనే ప్రస్తుతం పొలిటికల్‌ చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో అంతకు ముందు రెండు సందర్భాల్లో మాధవరం కృష్ణారావును తీవ్రంగా విమర్శించిన రేవంత్‌… ఈ మీటింగ్‌లో ఒక్క మాట కూడా అనలేదంటూ ఎమ్మెల్యే అనుచరగణం కూడా హ్యాపీగా ఉందట.

నోరు మంచిదైతే వూరు మంచిదవుతుందన్న సామెతను గుర్తు చేసుకుంటున్నారు. అది మాత్రమే కాకుండా ఈ సభలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పెద్దలు ఎవర్నీ విమర్శించలేదని గుర్తు చేస్తున్నారు. మిగతా ఏ మీటింగ్స్‌లో అయినా సరే… బీఆర్‌ఎస్‌ ముఖ్యుల మీద తీవ్రంగా విరుచుకుపడే ముఖ్యమంత్రి ఇక్కడ మాత్రం మాధవరం కృష్ణారావు తీసుకున్న జాగ్రత్తల వల్లే ఏమీ అనలేదని విశ్లేషిస్తున్నారు. అదంతా ఒక ఎత్తయితే… కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఏం తక్కువైనోడు కాదని, ప్రస్తుతం తన కొడుక్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం, కంపెనీలు దెబ్బతినకుండా ఉండటం కోసమే… సీఎం మీద పొగడ్తల వాన కురిపించారంటూ గుసగుసలాడుకుంటున్నారు కొందరు. ఎవరి వాదన ఎలా ఉన్నా… ఈ మార్పు మాత్రం పొలిటికల్‌ గాట్‌ అయింది.

Exit mobile version