OTR : టీడీపీ–జనసేన మధ్య ఫ్రెండ్లీ ఫైట్? కూటమి ఓట్లు చీలితే నష్టం ఎవరికీ?

Otr

Otr

ఫ్రెండ్లీ కాంటెస్ట్‌. ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రస్తుతం ఇదే హాట్‌ టాపిక్‌. ఫ్రెండ్‌ ఫ్రెండే.. ఫైట్‌ ఫైటేనని జనసేన అంటుంటే అందుకు టీడీపీ రియాక్షన్‌ ఏంటి? లోకల్ బాడీస్‌ ఎలక్షన్స్‌లో కూటమి పార్టీల మధ్య అసలు స్నేహపూర్వక పోటీ సాధ్యమవుతుందా? కూటమి ఓట్లు చీలితే అంతిమంగా నష్టపోయేది ఎవరు? పవన్‌ కళ్యాణ్‌ ఫ్రెండ్లీ ఫైట్‌ వ్యాఖ్యల వెనక వేరే ఉద్దేశ్యం కూడా ఉందా? లెట్స్‌ వాచ్‌. ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. అక్టోబర్‌లోనే మున్సిపల్ ఎలక్షన్స్‌ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో… కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఈ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ చేసిన ఫ్రెండ్లీ కంటెస్ట్ ప్రస్తావన ఉత్కంఠ పెంచుతోంది. కూటమిగా ఉంటూ ఈ తరహా పోటీ సాధ్యమా? అదే జరిగితే నష్టం ఎవరికి.. అసలు పవన్ ఈ ప్రతిపాదన ఎందుకు చేశారు? ఏం జరుగుతోందన్న చర్చలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

కూటమిలోని మూడు పార్టీలకు స్థానిక ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. 2024 ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసే పోటీ చేశాయి. అప్పుడు జనసేన 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో మాత్రమే పోటీ చేసి వంద శాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించింది. అయితే, ఇప్పుడు ఆ సీట్ల ఫార్ములా వర్కౌట్‌ అవదని తేల్చి చెబుతున్నారు జనసేన లీడర్స్‌. తొలుత 15 శాతం సీట్లు గ్లాస్‌ పార్టీకి కేటాయించే విధంగా చర్చ జరిగింది. కానీ… ఈ ప్రతిపాదన జనసేనకు నచ్చ లేదు. దీంతో.. తామకు బలం ఉన్న చోట పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దానికి కొనసాగింపుగానా అన్నట్టు తాజాగా పవన్ కల్యాణ్ స్పందించారు. పొత్తు ధర్మం పాటిస్తూనే.. జనసైనికుల ఆత్మగౌరవం తగ్గకుండా… నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. అందులో భాగంగానే
ఫ్రెండ్లీ కాంటెస్ట్ అంశం ఉప ముఖ్యమంత్రి నోటివెంట వచ్చింది. తమకు బలం ఉన్న చోట సీటు దక్కకుంటే…. మిత్రపక్షాలు పోటీలో ఉన్నాసరే.. ఫ్రెండ్లీ ఫైట్‌ చేస్తామని, తమ పార్టీ నాయకులు బరిలో నిలిచే అవకాశాలు ఉంటాయంటూ కూటమి మీటింగ్‌లో పవన్ స్పష్టం చేసినట్టు తెలిసింది. అలాగే…. క్యాడర్ కూడా ఇవే సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. ఇదే ఇప్పుడు కూటమి వర్గాల్లో చర్చగా మారింది. అసలు మూడు పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ… ఓట్ల బదిలీ చేసుకుంటూ విజయం కోసం ప్రయత్నం చేయాల్సిన ఈ సమయంలో ఈ ప్రతిపాదన ఏంటో అంతు చిక్కటం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో పోటీకి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందునా అధికారంలో ఉన్నారు కాబట్టి మూడు పార్టీల నుంచి రేసులో ఎక్కువ మందే ఉన్నారు.

ఎంతమంది ఆశించినా సీటు దక్కేది ఒక్కరికే. ఇలాంటి సమయంలో పవన్ ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని చెపితే… ప్రతి ఒక్కరు…పోటీ చేస్తారని, దీంతో లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయన్నఅభిప్రాయం బలపడుతోంది. పవన్ చెప్పిన బాటలోనే… జనసేనతో పాటు బీజేపీ కూడా ఫ్రెండ్లీ కాంటెస్ట్ పేరుతో బరిలోకి దిగితే ఎలాంటి ఫలితం ఉంటుందోనన్న ఆందోళన కూటమిలో పెరుగుతోందట. ఇంత జరిగితే టీడీపీ నాయకులు ఊరికే ఉంటారా అన్నది ఇంకో పాయింట్‌. 2024 ఎన్నికల్లో రాష్ట్రం కోసం త్యాగం చేశాని, ఇక అలాంటివి అవసరం లేదని తన పార్టీ నేతలతో పవన్‌ కళ్యాణ్‌ అన్నట్టు తెలిసింది. అదే విధంగా స్థానిక ఎన్నికలను పార్టీ బలోపేతం కోసం వినియోగించి.. కేడర్‌కు సీట్లు కేటాయించాలని నిర్దేశించారట. అయితే.. ఈ నిర్ణయంపై కూటమిలో ఎవరికీ స్పష్టత లేదు. సమన్వయం.. సహకారంతో మూడు పార్టీలకు ప్రయోజనకరం గా ఉండే నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో.. ఈ ఫ్రెండ్లీ కాంటెస్ట్ ప్రతిపాదన ఏంటనే చర్చ అంతర్గతంగా జరుగుతోందట. ఈ ప్రతిపాదనతో టీడీపీ లేదా బీజేపీ బరిలో ఉన్న చోట జనసేన నుంచి నేతలు బరిలో నిలిస్తే.. కూటమి ఓటు చీలి.. మొత్తంగా నష్టం జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే.. పరోక్షంగా ఒత్తిడి పెంచి తమ సీట్ షేరింగ్ శాతం పెంచుకునే వ్యూహంలో భాగంగానే పవన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. దీంతో.. ఎన్నికల సమయానికి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి.. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు.. నిజంగా ఫ్రెండ్లీ కంటెస్ట్ జరిగితే తుది ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలంటే ఎవరికి వారే హీరో అని…ప్రతి ఊళ్ళో ఎవరో ఒకరు పోటీలో ఉంటారని, ఇలాంటి సమయంలో ఫ్రెండ్లీ కాంటెస్ట్ అంటే… పరిణామాలు తేడాగానే ఉంటాయన్న చర్చ జరుగుతోందట కూటమి వర్గాల్లో.