ఔనా….? వాళ్ళిద్దరూ కలిశారా….? సీక్రెట్ మీటింగ్ జరిగిందా? సాక్షాత్తు తెలంగాణ సీఎం చేసిన ఆరోపణల్లో నిజమెంత? పైకి ఉప్పు నిప్పులా కనిపించే ఆ రెండు పార్టీల ముఖ్య నాయకులు రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముంది? అసలు ఎవరా తెలుగు రాష్ట్రాల ముఖ్య నాయకులు? తెర వెనక సంగతులేంటి? తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తాజా ఢిల్లీ టూర్‌లో పలు అధికారిక కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించి ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన సమీక్షల్లో పాల్గొన్నారాయన. ఫైనల్‌గా… ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ చేస్తూ… అనేక అంశాలను ప్రస్తావించారు. కానీ… వాటిలో ఓ సంచలన అంశం చుట్టూనే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రకరకాల చర్చలు, విశ్లేషణలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… హైదరాబాద్‌లో ఏపీ మంత్రి లోకేష్‌ను సీక్రెట్‌గా కలిశారని చెప్పి పొలిటికల్ ప్రకంపనలు రేపారు సీఎం. ఆ వ్యాఖ్యల చుట్టూనే.. తిరుగుతున్నాయి తాజా చర్చలు. వాళ్ళిద్దరూ కలిసింది నిజమేనా? అయినా ఇప్పుడు కేటీఆర్ అంత రహస్యంగా లోకేష్‌ని కలవాల్సిన అవసరం ఏం వచ్చింది? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏమై ఉంటుంది అంటూ…ఎవరికి వారు ప్రశ్నించుకుంటూ… తమవైన శైలిలో సమాధానాలు చెప్పేసుకుంటున్నారట. ఐతే.. ఈ విషయమై… కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోందట. రెండు…మూడు నెలల క్రితం ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో కేటీఆర్… లోకేష్ కలిశారని అన్నారు కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్. అందుకు బీఆర్‌ఎస్ రియాక్ట్ అయి అసలా భేటీనే జరగలేదు. ఆధారాలు ఉంటే బయటపెట్టండని డిమాండ్ చేసింది.
అందుకు కాంగ్రెస్ కూడా తగ్గేదే లే అంటూ…ఆ మీటింగ్‌కు సంబంధించిన వివరాలు బయటపెట్టేందుకు సిద్ధమైందట. ఇంతలోనే… ఢిల్లీ వేదికగా… మీడియా చిట్‌చాట్‌లో కేటీఆర్-లోకేష్ మీటింగ్ అంటూ ప్రస్తావించారు రేవంత్‌రెడ్డి. దీంతో… ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏ ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడతారు? పైగా… అవతల ఆరోపణలు చేస్తున్నది కూడా చిన్న వ్యక్తుల మీద కాదు. కాబట్టి… లోలోపల కుఛ్‌కుఛ్ హోతాహై అన్న గుసగుసలు సైతం పెరిగిపోతున్నాయి. ఆ ఇద్దరి భేటీ తర్వాత… బీఆర్‌ఎస్ నేత ముంబై వెళ్ళారన్న టాక్స్ కూడా నడుస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున టీడీపీ మద్దతు కోరేందుకు కేటీఆర్ చంద్రబాబును కలుస్తారని కొద్ది రోజులు ప్రచారం జరిగింది. కానీ అందుకు బదులు లోకేష్‌తో… అదీ సీక్రెట్‌గా భేటీ అయ్యారన్న సంగతులు సంచలనం అవుతున్నాయి. ఓవైపు… రెండు రాష్ట్రాల మధ్య బనకచర్ల పంచాయతీ నడుస్తున్న క్రమంలో… సీఎం రేవంత్‌ని టార్గెట్ చేస్తోంది బీఆర్‌ఎస్. చంద్రబాబు శిష్యుడు… తెలంగాణ నీళ్ళను ఆంధ్రాకి తాకట్టు పెడుతున్నారని గట్టిగా ఆరోపిస్తున్నారు గులాబీ నాయకులు. అలాంటి పరిస్థితుల్లో… అదే చంద్రబాబు కొడుకు, అదే ఆంధ్రా మంత్రి లోకేష్‌ని కేటీఆర్ సీక్రెట్‌గా వెళ్ళి ఎందుకు కలిశారంటూ… ఇప్పుడు కొత్త చర్చను జనంలో పెట్టారు తెలంగాణ సీఎం.
అదే సమయంలో బీఆర్‌ఎస్ వైపు నుంచి కూడా….రేవంత్ రెడ్డి చేసిన అన్ని ఆరోపణలకు కౌంటర్స్ వచ్చాయిగానీ… లోకేష్‌తో కేటీఆర్ భేటీపై మాత్రం నో రియాక్షన్. అంటే… దీన్నిబట్టి నిజంగానే కేటీఆర్ వెళ్ళి లోకేష్‌ని కలిశారా? అదే నిజమైతే… ఎందుకన్న చర్చ మొదలైంది తెలంగాణ రాజకీయవర్గాల్లో. ఇదే సమయంలో మరికొన్ని విశ్లేషణలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. కొద్ది రోజులుగా కేటీఆర్….. సీఎం రేవంత్‌ని ఇష్టారాజ్యంగా… కామెంట్స్ చేస్తున్నారని, ఆ క్రమంలో ఆయనకు చెక్ పెట్టేందుకు ఈ బండారాన్ని బయట పెట్టి ఉండవచ్చని మాట్లాడుకుంటున్నారు కొందరు. కేటీఆర్‌కి సంబంధించిన గుట్లు ఒక్కొక్కటిగా విప్పుకుంటూ పోయి ఆయన డిఫెన్స్‌లో పడేసే ప్లాన్ ఉండి ఉండవచ్చన్నది మరి కొందరి విశ్లేషణ. ఇటీవలి కాలంలో… సీఎంని రెచ్చగొట్టేందుకు కేటీఆర్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారని, అయినా ఆయన టెంప్ట్ అవడంలేదని చెప్పుకుంటున్నారు కొందరు. అయితే… అలా ఎంతకాలం? దీనికి ఎక్కడో చోట బ్రేక్ వేయాలని డిసైడ్ అయ్యాకే ఢిల్లీలో నోరు తెరిచి ఉండవచ్చంటున్నారు. ఆయన ఉద్దేశ్యం ఏదైనాగానీ… తెలంగాణ సీఎం మీడియా చిట్‌చాట్‌లో చెప్పిన కేటీఆర్-లోకేష్ భేటీ అంశంపై మాత్రం తెలుగు రాష్ట్రాల్లో చర్చ పీక్స్‌కు చేరింది.
