సమస్యలు పరిష్కరించాల్సిన సంస్థే చోద్యం చూస్తోందా? పెద్దన్న పాత్రలో ఉండి కూడా పరిష్కారానికి బదులు ముదరబెట్టే వైఖరి అనుసరిస్తోందా? ఏపీ, తెలంగాణ పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నా… ఏ విషయం తేల్చకుండా నిష్క్రియాపర్వంలో ఉన్న ఆ సంస్థ ఏది? దాన్ని పోషించడానికి రెండు ప్రభుత్వాలు ఏటా కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయాలి? తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంపకాల విషయంలో వాదోపవాదాలు ఇప్పటివి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతాల వారీగా ఉన్న సమస్య…విడిపోయాక రెండు రాష్ట్రాల ఇష్యూ అయింది. ఇక కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులన్నీ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించింది కేంద్ర జలశక్తి శాఖ. నీటి పంపకాలు, ప్రాజెక్టుల స్థితిగతులు, టెలిమెట్రిల ఏర్పాటు, నీటి విడుదల…. ఇలా అన్నిటినీ కేఆర్ఎంబీ చూసుకుంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే హైదరాబాద్ జలసౌధ నుంచి బోర్డు కార్యకలాపాలు నడుస్తున్నాయి. రెండు రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు, ఉన్నతస్థాయి అధికారులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇరిగేషన్ నిపుణులు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగించడానికి రెండు రాష్ట్రాలు ఏటా కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నాయి. అంత ఖర్చు పెడుతున్నా….నీటి యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి, వాటి పరిష్కారానికి బోర్డు చొరవ చూపడం లేదన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 66:34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ నీటిని వాడుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అప్పటి రెండు ప్రభుత్వాలు నీటి కోసం తాత్కాలిక ఒప్పందాలు చేసుకుని వాటి ఆధారంగా పంపిణీ చేసుకుంటున్నాయి. అయితే 50:50 నిష్పత్తిలో వాటా కోసం డిమాండ్ చేస్తూ… తెలంగాణ కోర్ట్‌కెళ్లింది.
ఆ కేసు విచారణ కొనసాగుతుండగానే…. ఏటా ప్రాజెక్టుల వద్ద నీటి విడుదల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కేఆర్ఎంబీ అనుమతి లేకుండా… ఏపీ నీటిని విడుదల చేసుకుంటూ తమ హక్కులను హరిస్తోందని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు బోర్డుకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటి వరకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఒక్క సారి కూడా బోర్డు విచారణ జరపలేదని తెలంగాణ ఆరోపిస్తోంది. అదే సమయంలో కేఆర్ఎంబి, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా తెలంగాణ కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులు కడుతూ నీటిని నిల్వ చేస్తోందని, అనుమతి లేని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు తగవంటూ కేఆర్ఎంబీకి ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసింది. ఇవే కాక వరద జలాలు, నికర జలాల విషయంలో కూడా తెలంగాణ పై ఏపీ ఇరిగేషన్ అధికారులు బోర్డుకు కంప్లయింట్స్ ఇచ్చారు. వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏపీ ఇరిగేషన్ ఇంజనీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా నీటి కేటాయింపులు, రాష్ట్రాల ఫిర్యాదులపై స్పందించాల్సిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సమస్య మొదలై…. ముదిరి పాకాన పడి… దానంతట అది సమసిపోతే పోవాలి, లేదంటే అలాగే ఉంటాలి తప్ప…. పరిష్కారం మీద కేఆర్‌ఎంబీ దృష్టి పెట్టిన పాపాన పోలేదని అంటున్నారు ఇరిగేషన్ నిపుణులు. నీటి ఒప్పందాలు, ప్రాజెక్టుల నీటి నిల్వలు, ప్రాజెక్టుల సామర్థ్యం, పంట సీజన్‌లో ఆయా ప్రాంతాల అవసరాల గురించి పెద్దగా పట్టించుకోకుండా బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఇంజనీర్లు సైతం ఆరోపిస్తున్నారు. ఇలా ఒక రాష్ట్రం పై మరో రాష్ట్రం ఫిర్యాదులు చేసుకోవడం తప్పితే… బోర్డు చర్యలు శూన్యమని… అంతదానికి నిర్వహణ పేరిట కోట్ల రూపాయల ఖర్చు ఎందుకంటూ… రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు నిలదీస్తున్నారు. ఈ వివాదాలు పరిష్కరించడం.. కొత్త వివాదాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బోర్డు ఆ పని చేయకపోవడంతో సమస్య ముదిరిపోతోందని అంటున్నారు. కోరలు లేని కేఆర్ఎంబీ కోసం కోట్లు ఖర్చుపెడుతూ… నెత్తి మీద మోయడం అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం మీద ఒత్తిడి తెస్తాయా? లేదా ఎప్పటికీ ఇలాగే కొట్లాటలతో టైంపాస్ చేస్తాయా అన్నది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేల్చుకోవాలంటున్నారు ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్స్.

