ఆ ఇద్దరు తెలంగాణ మంత్రుల మధ్య అస్సలు సఖ్యత లేదా? అందుకే ఇన్ఛార్జ్ మంత్రి నిర్వహించిన రివ్యూ మీటింగ్‌కు జిల్లా మినిస్టర్ వెళ్ళలేదా? ఎవరా ఇద్దరు? వేర్వేరు జిల్లాలకు చెందిన కేబినెట్ సహచరుల మధ్య ఏ విషయంలో బెడిసి కొట్టింది? పార్టీ పెద్దలు ప్రయత్నించినా ప్యాచ్ అవకపోవడం వెనకున్న బలమైన కారణాలేంటి? పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తున్నా…. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య మాత్రం కుదరడం లేదు. ఎప్పుడూ ఏదో విషయంలో ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టు మొన్నటిదాకా సాగిన పోరు ఆ మధ్య డిన్నర్ మీటింగ్‌తో తగ్గిందని అనుకున్నారు. కానీ… అంత లేదన్నట్టు ఆ మధ్య దేవాదాయ శాఖ రివ్యూల రూపంలో కడియం శ్రీహరి, కొండా మధ్య వివాదం రేగింది. దాన్ని మర్చిపోక ముందే… జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన రివ్యూ మీటింగ్‌కు జిల్లా మంత్రిగా సురేఖ హాజరవకపోవడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో ఆ మరునాడే… ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వరంగల్‌లోనే నిర్వహించిన కార్యక్రమంలో కొండా పాల్గొనడంతో పొంగులేటి కొండా మధ్య విభేదాలున్నాయన్న డిస్కషన్స్ పెరిగిపోతున్నాయి. వరంగల్ జిల్లాలో ఇన్చార్జ్ మంత్రి పెత్తనం పెరుగుతోందని గతంలో ఆరోపించిన కొండా… ఆ తర్వాత కొద్దిగా వెనక్కి తగ్గారు. మేడారం మహా జాతర పనులతో పాటు జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో కలిసి పాల్గొన్నారు. మళ్ళీ ఏమైందో ఏమోగానీ… ఇటీవల ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్టు ప్రచారం మొదలైంది. తాజాగా ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఇన్చార్జ్ మంత్రి హోదాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హనుమకొండ కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు సురేఖ హాజరవకపోవడంతో… గ్యాప్ ప్రచారం నిజమేనా అంటూ క్వశ్చన్‌మార్క్ ఫేస్ పెడుతున్నాయి జిల్లా రాజకీయవర్గాలు. ఈ మీటింగ్‌లో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పాల్గొనలేదు. అయితే… సీతక్క అమెరికా పర్యటనలో ఉండటంతో… ఆమెకు మినహాయింపు ఉంటుంది. మరి కొండా సురేఖ ఎందుకు అటెండ్ అవలేదన్నదే బిగ్ క్వశ్చన్.
అలాగే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కూడా అటెండ్ అవలేదు. ఆమె తిరుపతి వెళ్ళే క్రమంలో అటెండ్ అవలేకపోయినట్టు చెబుతున్నాయి సన్నిహిత వర్గాలు. సురేఖ కూడా హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం కారణంగా రాలేకుపోయారని మొదట ప్రచారం జరిగినా….. ఆ తర్వాతి పరిణామాలతో…. ఆమె కావాలనే రాలేదని అనిపిస్తోందంటూ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. కళ్యాణ మహోత్సవంలో కొండాతో పాటు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. అయినా… పొన్నం అక్కడి నుండి వచ్చి వరంగల్ మీటింగ్‌కు అటెండ్ అయ్యారు. సురేఖ కూడా రావాలనుకుంటే వచ్చేవారని, కావాలనే డుమ్మా కొట్టారంటూ చర్చలు మొదలయ్యాయి. మంగళవారం జరిగిన రివ్యూ మీటింగ్‌కు దూరంగా ఉన్న సురేఖ… మరుసటి రోజే… డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ టూర్‌లో పాల్గొన్నారు. కొన్ని రివ్యూ మీటింగ్స్ నిర్వహించారు. దీంతో… పొంగులేటి పాల్గొన్న కార్యక్రమానికి కావాలనే వెళ్ళలేదన్న వాదన బలపడుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అందుకు కారణాలు కూడా బలంగానే ఉండవచ్చన్నది వాళ్ళ మాట. మేడారం జాతర అభివృద్ధి పనుల నుంచి మొదలైన విభేదాలు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలోను, నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లోను బాగా పెరిగాయంటున్నారు. ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని, అందుకే కొండా దంపతులు అసంతృప్తితో రగిలిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే పొంగులేటి మిగిలిన నాయకులకు ప్రాధాన్యం ఇస్తూ…తమను విస్మరిస్తున్నారన్న అసంతృప్తి కూడా ఉందట. తాను దేవాదాయ శాఖ మంత్రి అయినా…. మేడారం జాతర పనుల విషయంలో సంప్రదించకుండానే నేరుగా నిర్ణయం తీసుకున్నారన్న అసహనం సురేఖకు ఉందట. అలాగే… భద్రకాళి ఆలయ అభివృద్ధి పనుల కేటాయింపు, భద్రకాళి చెరువు పనుల్లో పొంగులేటి సంస్థలు పని చేస్తున్న క్రమంలో విభేదాలు పెరిగినట్టు కూడా చెప్పుకుంటున్నారు. ఆ రకంగా ఇవన్నీ కలగలిసే…. పొంగులేటి నిర్వహించిన రివ్యూ మీటింగ్‌కు సురేఖ వెళ్ళలేదన్నది పొలిటికల్ టాక్.

