ఆ నియోజకవర్గంలో జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే…. టీడీపీ ఇన్ఛార్జ్ పొగ బెడుతున్నారా? ఏకంగా సమాంతర రాజకీయం నడుపుతూ… నేనే ఎమ్మెల్యే అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారా? ఈసారి టిక్కెట్ నాదేనని టీడీపీ ఇన్ఛార్జ్ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? ఆమెకు టీడీపీ పెద్దలు క్లాస్ తీసుకున్నది నిజమేనా? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? ఏంటా పొగబెట్టుడు రాజకీయం? డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలకమైన ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం రాజోలు. ప్రస్తుతం ఇక్కడి నుంచి జనసేనకు చెందిన దేవా వరప్రసాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. ఇక్కడ కూటమి మూడు పార్టీల మధ్య వ్యవహారం అంత సవ్యంగా లేదని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా… టీడీపీ రాజోలు ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య వ్యవహారశైలిచర్చనీయాంశంగా మారింది. స్థానికంగా పార్టీ బలోపేతంపై ఆమె ప్రత్యేకంగా దృష్టి పెట్టారని, తానే షాడో ఎమ్మెల్యేలా ఫీలవుతున్నారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ఉన్నప్పటికీ.. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ విషయంలోఅమూల్య ముందుండటం జనసేన శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతోందట. మా ఎమ్మెల్యే ఉన్న చోట మీ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారు జనసైనికులు. అదే సమయంలో టీడీపీ వర్గాలు కూడా ఏ మాత్రం తగ్గకుండా…. ప్రజలకు సేవ చేయడంలో పార్టీ పరంగా మేము కూడా భాగస్వాములమేనని అనడంతో పంచాయితీ గట్టిగానే జరుగుతోందట. టీడీపీ ఇన్ఛార్జ్ కూటమి సమన్వయంకంటే సొంత పార్టీని బలోపేతం చేయడం మీదే దృష్టి పెట్టారన్న అసంతృప్తి ఎమ్మెల్యే వర్గంలో పెరుగుతోందట. అయితే.. ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయమా లేక టీడీపీ పెద్దల మనసులో కూడా అలాగే ఉందా అన్న సందేహాలు పెరుగుతున్నాయి నియోజకవర్గంలో. ఇటీవల రాజోలులో టీడీపీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో అమూల్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది టీడీపీ కంచుకోట అని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకే టికెట్ ఇవ్వాలని ఆమె అన్నట్టు ప్రచారం జరిగింది. అదే సమయంలో గ్లాస్ పార్టీ నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటరే పడుతోంది.
గడిచిన పాతికేళ్ళలో రాజోలులో తెలుగుదేశం పార్టీ ఒక్కసారే గెలిచిందని, అలాంటి నియోజకవర్గాన్ని పట్టుకుని కంచుకోట అని ఎలా అంటారంటూ నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లిన తర్వాత పార్టీ పెద్దలు అమూల్యకు క్లాస్ తీసుకున్నారన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక్కడే రాజోలు రాజకీయాల్లో మరో ప్రశ్న తెరపైకి వస్తోంది. టీడీపీ లక్ష్యం కేవలం పార్టీ బలోపేతమేనా..? లేక వచ్చే ఎన్నికల నాటికి రాజోలు సీటును తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నమా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యేకు సమాంతరంగా టీడీపీ ఇన్ఛార్జ్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా షాడో రాజకీయానికి తెరలేపుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వీటిపై అమూల్య వర్గం రియార్ట్ అవడంలేదు. కామ్‌గా కూటమిలో సీటు కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. రాజోలు సీటు విషయంలో ఇప్పటి నుంచే రాజకీయ లెక్కలు మొదలయ్యాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జి ఈసారి టికెట్ నాకేనన్న సంకేతాలు ఇవ్వడం… కూటమి రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయొచ్చని అంటున్నారు పరిశీలకులు. ఇదే జరిగితే..రాజోలులో టీడీపీ, జనసేన మధ్య దూరం పెరుగవచ్చని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు భాగస్వామ్య పక్షాల మధ్య బహిరంగ పోటీ మొదలైతే అది మూడు పార్టీలకూ నష్టమేనన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతానికి అమూల్య దూకుడుకు టీడీపీ పెద్దలు బ్రేకులు వేసినా…. ఇప్పుడే మొదలైన ఈ సీటు రాజకీయం వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలంటున్నారు పరిశీలకులు.

