తెలంగాణకు చెందిన ఆ ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరుతోందా? ఇన్నాళ్ళు అణుచుకుని… అణుచుకుని…. ఇప్పుడు సందు చూసుకుని ఒక్కసారిగా బరస్ట్ అయ్యారా? ఆయన మనసులోని ఆవేదనే ఎక్స్ మెసేజ్ రూపంలో ఎగదన్నుకుని వచ్చేసిందా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా ఆవేదన? ఆయన తొందరపడ్డారా? అది వ్యూహమా..వ్యూహాత్మక తప్పిదమా..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక… గడిచిన 18 నెలలుగా… ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు పార్టీ నాయకులు. అడపా దడపా సమస్యలు ఉన్నా..నేరుగా అధిష్టానానికో, దూతలకో చెప్పుకుంటున్నారు, పరిష్కరించుకుంటున్నారు తప్ప… ఎవ్వరూ బహిరంగంగా బయటపడలేదు, అసంతృప్తి వ్యక్తం చేయలేదు. కానీ… మొదటిసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేశారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఆయన తాజా ప్రకటన అందులో భాగమేనా అని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు.
అదీ కూడా… కొల్లాపూర్ నియోజకవర్గ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఎక్స్‌లో మెసేజ్ పెట్టడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉంటుంది. పాలమూరు బిడ్డనే పదేళ్ళు సీట్లో కూర్చుంటారని ఆ మీటింగ్‌లో అన్నారు రేవంత్‌రెడ్డి. బహిరంగ సభలో సీఎం చేసిన ఆ వ్యాఖ్యల ఆధారంగా… మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్‌లో మెసేజ్ పెట్టారు. పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని తన సందేశంలో రాసుకొచ్చారు రాజగోపాల్‌రెడ్డి. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు…అంటూ ట్వీట్ చేశారాయన. ఉదయాన్నే ఈ ఎక్స్ మెస్సేజ్ రావడంతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది కాంగ్రెస్ వర్గాల్లో. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే…. సడన్‌గా సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారన్న చర్చ మొదలైంది.
దీని మీద పార్టీ నాయకులు ఎవ్వరూ బాహాటంగా ఎవరు స్పందించలేదు గానీ… అంతర్గతంగా మాత్రం… వ్యవహారం విపరీతంగా నలుగుతోందట. రాజగోపాల్‌రెడ్డి ఎందుకు ఇలా స్పందించాల్సి వచ్చిందంటూ… ఇటు గాంధీ భవన్, అటు పొలిటికల్ సర్కిల్స్‌లో తెగ చెవులు కొరికేసుకుంటున్నారట. రాజగోపాల్ రెడ్డి ఉద్దేశ్యం ఏంటని ఎవరికి వారు ఆరా తీసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్‌లో బెర్త్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇటీవల విస్తరణలో ఆయనకు కన్ఫర్మ్ కాలేదు. దీంతో అలక మీదున్నారు మునుగోడు ఎమ్మెల్యే. దాన్ని మనసులో పెట్టుకునే… ఇప్పుడిలా సీఎం స్టేట్‌మెంట్‌ని బేస్ చేసుకుని ఓపెన్ అయ్యారా అన్న చర్చలు నడుస్తున్నాయి. అయితే… ఆయన తొందరపడ్డారన్న అభిప్రాయం కూడా ఉంది కాంగ్రెస్ సీనియర్స్ లీడర్స్‌లో. కేబినెట్ మలి విస్తరణ జరిగితే… రాజగోపాల్‌కు ఛాన్స్ ఇచ్చే విషయంలో సీఎం రేవంత్ సానుకూలంగానే ఉన్నారని, అప్పటిదాకా ఓపిక పడితే పోయేదానికి… ఆయన తొందరపడి అనవసరంగా సమస్యను కొని తెచ్చుకున్నారన్నది కొందరు సీనియర్స్ అభిప్రాయంగా తెలుస్తోంది. నల్గొండ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి మరో అవకాశం ఇవ్వాల్సి వస్తే ఏం చేయాలన్న ఈక్వేషన్‌పై కూడా చర్చ జరుగుతున్న క్రమంలో… రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేయడంతో… సీఎం ఇప్పుడు ఉన్నంత అనుకూలంగా రేపు ఉంటారా..? కేబినెట్‌లోకి రాకముందే ధిక్కార స్వరం వినిపిస్తే… వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటన్న ఆలోచన చేస్తారు కదా అనే చర్చ నడుస్తోంది.
అటు రాజగోపాల్‌రెడ్డి మాత్రం …తన ట్వీట్ వెనక ఎలాంటి దురుద్దేశ్యం లేదని చెబుతున్నారు. కేవలం పార్టీకి నష్టం జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే… తన అభిప్రాయం చెప్పానని సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌లో సీఎంల ఎంపిక ప్రక్రియ గురించి తెలియజేసి… పార్టీలో మిగిలిన నాయకులు డిస్ట్రబ్ కాకుండా చూడాలన్నదే ట్వీట్ ఉద్దేశ్యమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట. ఐతే… అసలు రేవంత్ రెడ్డి అలా ఎందుకన్నారన్న విషయంలో కూడా ఇంకో చర్చ నడుస్తోంది కాంగ్రెస్ వర్గాల్లో. క్యాడర్‌లో జోష్ నింపేందుకే ఆయన అలా మాట్లాడి ఉంటారన్నది ఆ చర్చల సారాంశం. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పర్యటన సందర్భంగా ఎల్బీ స్టేడియంలో కూడా … వచ్చే ప్రభుత్వం మనదే అని… ఆ బాధ్యత నాదే అంటూ కామెంట్స్ చేశారు రేవంత్‌రెడ్డి. మొత్తం మీద అంతా స్మూత్‌గా నడుస్తోందని అనుకుంటున్న టైంలో… రాజగోపాల్‌రెడ్డి ట్వీట్…తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది.
