అసలే తేడాగా ఉన్న ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ వ్యవహారం బాగా…. తేడా తేడాగా ఉందా? కాంగ్రెస్ కేడర్ ఏకంగా ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తోందా? ఆత్మీయ సమావేశాల పేరిట ఆయన సీటు కింద సెగ పెడుతోందా? మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఆ సెగ్మెంట్‌లో రాజకీయం అంత ఈజీ కాదా? ఏదా నియోజకవర్గం? ఏంటా మూడు ముక్కల కథ? భద్రాద్రి జిల్లా ఇల్లందు నియోజకవర్గం.. ఇది మూడు జిల్లాల్లో మూడు ముక్కలుగా ఉంటుంది. రెండు మండలాలు మహబూబాబాద్, రెండు మండలాలు భద్రాద్రి, ఇకపోతే ఒక మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. దీంతో… ఏ కార్యక్రమం చేయాలన్నా ఇక్కడి ప్రజా ప్రతినిధులకు కత్తిమీద సామే. ఇక అడ్మినిస్ట్రేషన్ సంగతైతే చెప్పేపనేలేదు. వీటన్నిటికి కొనసాగింపా అన్నట్టు ఏ జిల్లాకు తగ్గట్టు ఆ జిల్లాలో కుంపట్లు పెట్టుకోవడం ఇక్కడి లీడర్స్‌కు అనవాయితీగా మారిపోయింది. ఈ క్రమంలోనే… అధికార కాంగ్రెస్‌లో గ్రూప్ వార్ అప్పుడు రోడ్డెక్కింది. జిల్లాల పునర్విభజన జరక్క ముందు, విప్లవ పార్టీల ఉనికి బలంగా ఉన్న టైంలో… ఇల్లందు నుంచి గుమ్మడి నర్సయ్య గెలిచేవారు. కానీ…. పునర్విభజన తర్వాత కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇల్లందు నుంచి బీఆర్‌ఎస్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కోరం కనకయ్య ఎమ్మెల్యే అయ్యారు. 2014, 18, 23లో వరుసగా ఇక్కడి నుంచి కాంగ్రెస్ గెలిచింది. కానీ… అభ్యర్థులు మాత్రం మారిపోయారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి ఆ తరువాత బీఆర్‌ఎస్‌లో చేరి…. ఆ పార్టీ తరపున 2018 లో పోటీ చేసి ఓడిపోయారు కోరం కనకయ్య.మళ్లీ కాంగ్రెస్ గూటికి జంపైపోయి 2023లో హస్తం గుర్తు మీద ఎమ్మెల్యే అయ్యారాయన. మూడు సార్లు కోరంకు ప్రత్యర్ధిగా ఉన్న హరిప్రియ నాయక్ కూడ కాంగ్రెస్‌లో చేరినప్పుడే విజయం సాధించారు.
ఆమె కూడా బీఆర్‌ఎస్‌లో చేరాకే ఓడిపోయారు. అదంతా ఒక ఎత్తయితే… అంత బలంగా ఉన్న హస్తం పార్టీని ఇప్పుడు గ్రూప్‌వార్ బలహీనపరుస్తోందన్నది కేడర్ ఆవేదన. మరీ ముఖ్యంగా… ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైందన్న చర్చలు నడుస్తున్నాయి. కనయ్య, ఆయన అనుచరగణం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ… మహబూబాబాద్ జిల్లాలో ఉన్న రెండు మండలాల పార్టీ కేడర్, లీడర్స్ ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకున్నారు. అక్కడ ఇద్దరు నాయకులు తొలి నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వకపోగా… వేధిస్తున్నారంటూ ఈ ఆత్మీయ సమావేశంలో పలువురు కంప్లయింట్ చేశారట. పలువురు సర్పంచ్‌లు, కార్యకర్తలు, నాయకులు ఈ మీటింగ్‌కు అటెండ్ అయ్యారు. సొంత పార్టీ సర్పంచ్‌లను కూడా ఎమ్మెల్యే ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, నిధుల విషయంలో కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు.
దీంతో… ఒక రకంగా ఈ ఆత్మీయ సమావేశం ఎమ్మెల్యే మీద తిరుగుబాటేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పరిస్థితిలో మార్పు రాకపోతే పరిణామాలు సీరియస్‌గా ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడాన్ని బట్టి చూస్తుంటే ఆ రెండు మండలాల్లో ఎమ్మెల్యేకి డేంజర్ బెల్స్ మోగుతున్నట్టేనని అంటున్నారు. లోకల్‌గా ఉన్న లీడర్స్ కొంత మంది ఎమ్మెల్యేకి, తమకు మధ్య గ్యాప్ పెంచుతున్నారని, మండలాల్లో ఉన్న వర్గ విబేదాల వల్ల తాము నష్ట పోతున్నామని అంటున్నారు. ప్రస్తుతం పైకి కనిపిస్తున్నది ఒక జిల్లాలోని రెండు మండలాలే అయినా…. వీళ్ళను చూసి మరికొందరు అసంతృప్తులు కూడా గళం విప్పే ప్రమాదం లేకపోలేదని, అందుకే దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదన్న వార్నింగ్స్ కాంగ్రెస్ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేడర్ అల్టిమేటమ్ ఇచ్చింది ఎమ్మెల్యేకే అయినా… బంతి మాత్రం మంత్రి పొంగులేటి కోర్ట్‌లో ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయనకు కూడా సమస్యను వివరించారట ఆ రెండు మండలాల నాయకులు. తాజా పరిణామాలతో… మంత్రి తన ముఖ్యఅనుచరుడుగా ఉన్నకోరంను ఎలా వెనకేసుకుని వస్తారోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు.

