కవిత కొత్త పార్టీకి టీఆర్‌ఎస్ టైటిల్ ఉంటుందా…? ఉండదా….? ఇప్పటికే ఒకసారి మారిన పేరును మరోసారి మార్చాల్సి వస్తుందా? లేక అలాగే కొనసాగుతుందా…? అసలిప్పుడు కొత్తగా ఆ పేరు మార్పు ప్రస్తావన ఎందుకు వచ్చింది? పార్టీని ప్రకటించి, యాక్టివిటీస్ జరుగుతున్న టైంలో మేటర్ మళ్ళీ మొదటికి రావడం వెనకున్న రీజన్స్ ఏంటి? కవిత టీఆర్‌ఎస్ విషయంలో అభ్యంతరం చెప్పింది ఎవరు? వాళ్ళ ఏమని కంప్లయింట్ రెయిజ్ చేశారు? టీఆర్‌ఎస్…. తెలంగాణ ఉద్యమానికి, ఈ పేరుకు విడదీయరాని బంధం ఉందన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. అయితే…. కాల క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా…భారత రాష్ట్ర సమితి అయ్యాక మొత్తం ఫీల్ మారిపోయిందన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ కుమార్తె కవిత తెలంగాణ రక్షణ సేన పేరుతో… షార్ట్ ఫామ్‌లో టీఆర్‌ఎస్ అర్ధం వచ్చేలా పార్టీని ప్రకటించారు. ఇక అప్పటి నుంచి రకరకాల వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో… ఇప్పుడసలు కవితకు టీఆర్‌ఎస్ టైటిల్ దక్కుతుందా లేదా అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ పార్టీ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ తర్వాతే అసలు కథ మొదలైందట. కొత్తగా ఏ పార్టీని ఏర్పాటు చేసినా…. పేరుపై అభ్యంతరాలు తెలపాలంటూ ఈసీ బహిరంగ ప్రకటన ఇవ్వడం కామన్. అందులో భాగంగానే కవిత పార్టీ విషయంలో కూడా ప్రకటించినా… గతంలో ఏ పార్టీ పేరు విషయంలో రానన్ని అభ్యంతరాలు తెలంగాణ రక్షణ సేన విషయంలో వచ్చాయట. అవి కూడా… వందల సంఖ్యలో ఉండటం ఆసక్తికరంగా మారింది. దీంతో… టీఆర్‌ఎస్ టైటిల్ వార్ మొదలైనట్టేనని చెప్పుకుంటున్నారు. కవిత పార్టీ ప్రకటన కంటే ముందే తాము ఎన్నికల సంఘం దగ్గర టీఆర్‌ఎస్ పేరు కోసం దరఖాస్తు చేసుకున్నామంటూ మహారాష్ట్ర నేతలు రంగంలోకి వచ్చారు. షోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన (TRS) కూడా అదే పేరు కోసం పట్టు పడుతోందట.
కవిత పార్టీ ప్రకటనకు ఒక రోజు ముందే.. తాము టీఆర్‌ఎస్ టైటిల్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాం కాబట్టి ఆ పేరును తమకే ఇవ్వాలన్నది షోలాపూర్ నాయకుల వాదన. TRS పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ పేపర్స్‌లో ఇచ్చిన యాడ్‌ను బేస్ చేసుకుని ఫిర్యాదులు చేశారట. మరోవైపు కవిత పార్టీ పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 14 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో TRS అనే పేరు తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు కాపీలో చెప్పారు. ఇలా మహారాష్ట్ర లోని నేతలతో పాటు బీఆర్‌ఎస్ తరపున, ఇతరత్రా అన్నీ కలిపి దాదాపు 700 కి పైగా ఫిర్యాదులు కవిత పార్టీ పేరు విషయంలో ఉన్నాయి. ఇలా వెల్లువలా ఫిర్యాదులు రావడంతో టైటిల్ వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే ఒకసారి పేరు మార్చుకున్న తెలంగాణ రక్షణసేన టిఆర్ఎస్ గా ఉంటుందా ఉండదా అంటూ…. రాజకీయ వర్గాలతో పాటు కవిత అనుచరుల్లో కూడా చర్చ మొదలైంది. ఒకవేళ కవిత తన పార్టీ పేరు మార్చాల్సి వస్తే… వేరే ఏ పేరు పెడతారన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. అయితే కవితతో పాటు ఆమె సన్నిహితులు మాత్రం తెలంగాణ రక్షణ సేనగానే ఉంటుందని కుండ బద్దలు కొడుతున్నారు. టిఆర్ఎస్ అనే షార్ట్ కట్ పిలుపు పైనే అభ్యంతరాలు వచ్చాయని ఆ విషయాన్ని ఈసీ పరిగణలోకి తీసుకోకపోవచ్చని అంటున్నారు. షార్ట్ కట్ లో ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు పిలుచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తమ తెలంగాణ రక్షణ సేన కచ్చితంగా కొనసాగుతుందన్నది వాళ్ళ అభిప్రాయం. కొద్ది రోజుల్లో ఈసీఐ నుంచి అధికారిక ప్రకటన కూడా రాబోతుందని అంటున్నారు. అయితే టైటిల్ ఉత్కంఠ మాత్రం అలాగే కొనసాగుతోంది.

