Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్

  • కవిత పార్టీ పేరు టీఆర్‌ఎస్‌ కాదు, టీఆర్‌ఎస్‌ఏ అంటున్న బీఆర్‌ఎస్‌
  • పార్టీ పూర్తి పేరు విషయంలో తీవ్ర గందరగోళం
  • సభలో ప్రకటించిన తెలంగాణ రాష్ట్రసేన పేరును ఈసీకి పంపలేదా?
  • కవిత ఇచ్చిన ఐదు పేర్ల లిస్ట్‌ నుంచి తెలంగాణ రక్షణ సేన ఖరారు
Kavitha

Kavitha

పార్టీ పేరు విషయంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత కన్ఫ్యూజ్‌ అయ్యారా…? లేక కావాలనే అవతలి వాళ్ళని కన్ఫ్యూజ్‌ చేశారా…? ఓవరాల్‌గా టీఆర్‌ఎస్‌ అని ధ్వనిస్తున్నా… పూర్తి పేరు విషయంలో ఆ గందరగోళం ఎందుకు? అసలు తాను కేంద్ర ఎన్నికల సంఘాలని ఇవ్వని తెలంగాణ రాష్ట్ర సేన పేరును నిండు సభలో ఎందుకు ప్రకటించారామె? అది వ్యూహమా..? లేక వ్యూహాత్మక తప్పిదమా…? ఏప్రిల్‌ 25న హైదరాబాద్‌లో అట్టహాసంగా తన పార్టీని లాంఛ్‌ చేశారు కవిత. పార్టీ పేరు టీఆర్‌ఎస్‌ అని ప్రకటించారు. అంతవరకు బాగానే ఉన్నా… అసలు తిరకాలు పూర్తిపేరులోనే ఉంది. తాను అనుకున్న ముహూర్తానికి పార్టీ పేరు టీఆర్ఎస్ అంటూ ప్రకటించింది కవిత…. అప్పటిదాకా ఆ విషయంలో అత్యంత గోప్యత పాటించారు. దీంతో… ఆమె నోటి నుంచి ప్రకటన వెలువడగానే… ఇటు పార్టీ శ్రేణులతో పాటు అటు బీఆర్ఎస్‌ కూడా ఉలిక్కిపడ్డాయి. మరీ ముఖ్యంగా… కవితకు టీఆర్‌ఎస్‌ పేరు వెళ్తే తమకు డ్యామేజ్‌ గట్టిగా జరుగుతుందని లెక్కలేసుకుంటున్నారట బీఆర్‌ఎస్‌ నాయకులు. అదే సందర్భంలో కవిత ప్రకటించిన పేరులో తెలంగాణ రాష్ట్రసేనతోపాటు అసోసియేషన్ అని కూడా ఉండడంతో దాన్నే హైలైట్ చేసే ప్రయత్నంలో ఉన్నాయి గులాబీ వర్గాలు. ఆమె పార్టీ పేరు టీఆర్‌ఎస్‌ కాదని, టీఆర్‌ఎస్‌ఏ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఆ వ్యవహారం అలా జరుగుతుండగానే… అసలు పార్టీ పూర్తి పేరు విషయంలో కూడా గందరగోళం నడుస్తోంది. సభలో నాయకురాలు ప్రకటించిన తెలంగాణ రాష్ట్రసేన పేరును అసలు ఎన్నికల సంఘానికి పంపలేదట. తాను పెట్టాలనుకుంటున్న ఐదు పేర్ల లిస్ట్‌తో గతంలోనే ఈసీకి లెటర్‌ రాశారు కవిత.

అందులో ఇప్పుడు సభలో ప్రకటించిన పేరు లేదని అంటున్నారు. అందుకే…. కవిత రాసిన లేఖకు సమాధానంగా….. కొన్ని అభ్యంతరాల తర్వాత తెలంగాణ రక్షణ సేన పేరు పెట్టుకోవచ్చంటూ ఎన్నికల సంఘం నుంచి లెటర్ వచ్చింది. ఇదే సమయంలో ఎప్పటికైనా టీఆర్ఎస్ నాదే అంటూ కవిత చేసిన ట్వీట్ కూడా ఆసక్తికరంగా మారింది. అయితే… అది రాష్ట్రసేన అయినా, రక్షణ సేన అయినా… షార్ట్‌కట్‌లో టీఆర్‌ఎస్‌ అనే పలుకుతారు కాబట్టి పబ్లిక్‌లోకి అలాగే వెళ్ళాలన్నది కవిత లక్ష్యంగా అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. అందుకే ఎప్పటికైనా టీఆర్‌ఎస్‌ నాదేనని ఆమె ట్వీట్‌ చేసి ఉండవచ్చని అంటున్నారు. సభలో తాను తెలంగాణ రాష్ట్రసేన అని ప్రకటించినా… షార్ట్‌కట్‌లో టీఆర్‌ఎస్‌గా పిలుచుకునే తెలంగాణ రక్షణ సేన అన్న పేరును ఈసీ ఫైనల్‌ చేయడం కూడా కలిసి వచ్చే అంశమేనని భావిస్తున్నారట కవిత.

ఇక్కడ పూర్తి పేరు పెద్ద మేటర్‌ కాదని, షార్ట్‌కట్‌లో టీఆర్‌ఎస్‌ అని ధ్వనించే ఏదైనా ఇబ్బంది ఉండబోదని కవిత శిబిరం భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌ని నిలబెట్టిందే టీఆర్‌ఎస్‌ అని, అది కాస్తా బీఆర్ఎస్‌గా మారాకే సక్సెస్‌ గ్రాఫ్‌ పడిపోయిందంటూ విశ్లేషిస్తున్న కవిత వర్గం… ఇప్పుడిక ఆ పేరుతో మేం దూకుడుగా ఉంటామని అంటోందట. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినట్టు 30 రోజుల్లో ఎవరూ ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకుండా ఉంటే… కవిత పార్టీ పేరు టీఆర్‌ఎస్‌గానే కొనసాగుతుంది. పూర్తి పేరు ఎలా ఉన్నా… జనం పిలుకునేది మాత్రం అదే అవుతుంది. ప్రకృతి సహకరించడం వల్లే ఆ పేరు తనకు వచ్చిందని… టీఆర్ఎస్ ఇక తన సొంతమే అంటున్న కవిత భవిష్యత్‌ వ్యూహం ఎలా ఉంటుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు.