Site icon NTV Telugu

Off The Record : కౌశిక్ రెడ్డి మాటను కమిషనర్ ఖాతరు చేయలేదా..?

Kaushik Reddy

Kaushik Reddy

మిన్ను విరిగి మీద పడుతోంది, భూమి బద్దలవుతోందన్న రేంజ్‌లో బిల్డప్‌ ఇచ్చిన ఆ ఎమ్మెల్యే ఒక్కసారిగా ఎందుకు సైలెంట్‌ అయ్యారు? ఏకంగా ఐపీఎస్‌ ఆఫీసర్‌ మీదే తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన నేత ఆధారాల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? అదే సమయంలో ఎమ్మెల్యే చేసినవి నిరాధార ఆరోపణలైతే పోలీసులు ఎందుకు కామ్‌గా ఉన్నారు? ఎవరా ఎమ్మెల్యే అండ్‌ ఆఫీసర్‌? మధ్యలో కాంగ్రెస్‌ అసమ్మతి నేతలు కూడా కాస్త ఎగదోశారన్నది నిజమేనా? కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి… ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో హడావుడి చేస్తారనే పేరుంది. ఆయన నోటికి హద్దు అదుపు ఉండదన్నది ప్రత్యర్థుల మాట. గతంలో ఏకంగా గవర్నర్‌ మీదే నోరుజారి తర్వాత క్షమాపణలు చెప్పడం పరాకాష్ట కాగా….కింది స్థాయి అధికారుల మీద వాడే బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక తాజాగా వీణవంక సమ్మక్కసారక్క జాతర విషయంలో కరీంనగర్ పోలీస్‌ కమిషనర్‌ మీద మత పరమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. ఐపీఎస్‌ అసోసియేషన్ రంగంలోకి దిగడంతో మరోసారి సారీ అనాల్సి వచ్చింది.

వివాదం సమసిపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో సడన్‌గా రీఎంట్రీ ఇచ్చిసీపీ గౌష్ఆలంపై సంచలన ఆరోపణలు చేశారు కౌశిక్‌రెడ్డి. కొందరు అధికారులను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆరోపించారాయన.కొందరు పోలీసు అధికారుల పేర్లను ప్రస్తావించి.. ఎవరెవరి దగ్గర లంచాలు తీసుకున్నారో కూడా చెప్పేసి త్వరలో ఆధారాలు బయటపెడతానని చెప్పారు కౌశిక్. దీంతో ఏం జరుగుతోందో అర్దం కాక ఖాకీల్లో చిన్న ఉలికిపాటు మొదలైంది…అసలు ఎమ్మెల్యేకి అలాంటి సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందని తేల్చే పనిలో పడ్డారట. తమ శాఖలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు ఓ ఎమ్మెల్యేకి, అదీ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతకు ఎలా తెలిశాయంటూ తమదైన శైలిలో ఎంక్వైరీ చేస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో కౌశిక్‌రెడ్డికి, పోలీసులకు ఎక్కడ చెడిందనే విశ్లేషణలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ఇసుక క్వారీలు, రవాణా విషయంలో సీపీ కాస్త కటువుగా వ్యవరించారు.. అంతకు ముందు కొన్ని విషయాల్లో కౌశిక్‌ సీపీకి ఫోన్ చేశారట.

వాటిని విన్నట్టే విని ఖాతరు చేయకపోయేసరికి నొచ్చుకున్నారట ఎమ్మెల్యే. ఇక అప్పటి నుంచి ఛాన్స్‌ దొరికిన ప్రతీసారి సీపీని టార్గెట్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అది రగులుతూ ఇప్పుడు పీక్స్‌ చేరినట్టు అంచనా వేస్తున్నారు ఎక్స్‌పర్ట్స్‌. అయితే సీపీపై ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు అక్కసుతో కూడుకున్నవే తప్ప వాస్తవం లేదంటున్నారు పోలీసు అధికారులు. హోం గార్డుల జీతాలెంత, బదిలీల కోసం వాళ్ళు కోట్లలో లంచాలు ఇస్తారా అంటూ లాజిక్‌ లాగుతున్నారు పోలీస్‌ ఆఫీసర్స్‌. అంతర్గతంగా అలా చెబుతున్నారు గానీ… ఎమ్మెల్యే ఆరోపణలకు సంబంధించి పోలీసుల వైపు నుంచి ఉలుకు పలుకు లేదు. దీంతో… వారి మౌనానికి అర్దం ఏంటి…? మౌనం అర్ధాంగీకారమా లేక వ్యూహాత్మకమా అన్న చర్చలు హాట్‌ హాట్‌గా నడుస్తున్నాయి. మరోవైపు కౌశిక్ కూడా మూడ్రోజుల్లో మరిన్ని వివరాలు, ఆధారాలకు సంబంధించిన వీడియోలు బయటపెడతానని చెప్పినా… అట్నుంచి కూడా నో రియాక్షన్‌. అటు పోలీసుల మౌనం, ఇటు కౌశిక్ సడన్‌ సైలెంట్….ఈ నిశ్శబ్దానికి కారణం ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కౌశిక్ వ్యవహారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి వెళ్లిందని, ఆయన సూచన మేరకే వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అటు కౌశిక్ చేసిన ఆరోపణలపై సీపీ సహా… ద్వితీయ శ్రేణి అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారట.. అందుకే మౌనంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.

ఆరోపణలపై స్పందించకుండా కౌశిక్ నోటి నుంచే మరోసారి క్షమాపణ చెప్పించాలనే ప్లాన్‌ ఉందన్నది డిపార్ట్‌మెంట్‌ టాక్‌. అయితే ఆరోపణలు చేయడం, యూటర్న్‌ తీసుకోవడం, ఆ తర్వాత దాని ఊసే ఎత్తకపోవడం కౌశిక్‌రెడ్డి సాధారణమేనని విశ్లేషిస్తున్నారు ఈ వ్యవహారాలను గమనిస్తున్నవాళ్ళు. ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండాలనేది ఆయన వ్యూహం కాబట్టే ఇలా ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారని కూడా మాట్లాడుకుంటున్నారు. గతంలో బూడిద లారీలు, దేవుడి గుడిలో ప్రమాణాలు లాంటి వ్యవహారాలను గుర్తు చేసుకుంటున్నారు. అయితే… ఇప్పుడు సీపీపై చేసిన ఆరోపణల వెనక అసలు ఉద్దేశ్యం వేరే ఉందన్న ఇంకో వెర్షన్‌ సైతం వినిపిస్తోంది. అధికార పార్టీకి తాను టార్గెట్‌గా ఉన్న టైంలో ఒక పోలీస్‌ ఉన్నతాధికారి మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తారా అన్నది ఆ వాదనను సమర్ధించేవాళ్ళ ప్రశ్న.

పోలీస్‌ కమిషనర్‌ చర్యలతో నారాజ్‌గా ఉన్న కొందరు కాంగ్రెస్‌ నాయకులు కూడా కౌశిక్‌కు సహకరించి ఉండవచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసంతృప్తిని వెళ్లగక్కేందుకు కౌశిక్ రూపంలో మంచి అవకాశం దొరికిందని వారు భావించారనే టాక్ కూడా వినిపిస్తోంది కరీంనగర్‌లో. రోగి కోరుకున్నది, వైద్యుడు ఇచ్చింది ఒకటే మందు అన్నట్టుగా వాళ్ళంతా…పరోక్షంగా ఎమ్మెల్యేకు సహకరిస్తుండవచ్చని భావిస్తున్నారు కొందరు. వచ్చే సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న క్రమంలో… కౌశిక్‌రెడ్డి సభలో ఆధారాలను బయటపెడతారా..? ఒకవేళ అదే జరిగితే పోలీసుల వ్యూహం ఏ విధంగా ఉండబోతోందన్నది
ఆసక్తికరంగా మారింది.

Exit mobile version