అసలే గోరుచుట్టు… ఆపై రోకటి పోటు అన్నట్టుగా మారింది అక్కడ అధికార పార్టీ వ్యవహారం. ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో కాంగ్రెస్ పరువు బజారుకెక్కింది.డీసీసీ అధ్యక్ష ఎన్నికలో ఢీ అంటే ఢీ అంటున్నారు. చివరికి సీఎం రేవంత్‌రెడ్డి ఓకే చెప్పిన నాయకుడు కూడా… నాకేది గ్యారంటీ అని ఎందుకు మొత్తుకోవాల్సి వచ్చింది? సమన్వయ పరచాల్సిన మంత్రుల మధ్యనే సమన్వయం లేదా? ఎక్కడుందా పరిస్థితి? కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికలు చిచ్చు రేపాయి. జిల్లా అధ్యక్ష పదవికి, నగర కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్ట్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమైంది అధినాయకత్వం. రెండు పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అభిప్రాయ సేకరణ కోసం పరిశీలకులు ఎంటరయ్యాక మొదలైంది అసలు సీన్. పరిశీలకుల ముందు బలప్రదర్శన చేశారు ఆశావహులు. దాంతో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కాస్తా… సమరంగా మారింది. చివరికి అబ్జర్వర్స్ అందర్నీ బయటికి వెళ్ళమని చెప్పాల్సి వచ్చింది. అయితే పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్‌రావు బయటకు వెళ్లగానే గేటుకు తాళం వేయడంతో వివాదం మరింత ముదిరింది. అంతా బయటికి రాకుండా తాళం ఎలా వేస్తారని ఫైర్ అయ్యారాయన. తాళం పగల గొట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అయితే డీసీసీ ఆఫీసు దగ్గర జరిగిన గొడవ టార్గెట్ రాజేందర్‌రావు అన్నట్టుగానే ఉందంటూ ఆసక్తికర చర్చ నడుస్తోంది కరీంనగర్ కాంగ్రెస్ సర్కిల్స్‌లో. వెలిచాలను ఎవరు టార్గెట్ చేశారన్నది ఇప్పడు ఆసక్తికర ప్రశ్న. ఖాళీగా ఉన్న కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ పోస్టు కోసం కొంత కాలంగా భారీ పైరవీలు సాగుతున్నాయి. పార్టీ పెద్దలు మాత్రం వెలిచాల వైపు మొగ్గు చూపారట. గ్రౌండ్ వర్క్ చేసుకోమని, నెలకు రెండు సార్లు పార్టీ పరిస్థితిపై రిపోర్టు పంపించాలని సీఎం తనకు చెప్పారని వెలిచాల స్వయంగా క్యాడర్‌కు వివరించారు. జిల్లా మంత్రులు కూడా గో ఎహెడ్ అనడంతో ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారట రాజేందర్‌రావు… అయితే ఆయనకు హస్తం పార్టీ మార్క్ రాజకీయం అర్ధం కావడానికి ఎంతో సమయం పట్టలేదు.
గణేష్ నవరాత్రుల సందర్భంగా వేసిన ప్లెక్సీల్లో తన ఫోటో లేదని మానకొండూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అలగడం… దళిత సంఘాలు నిరసనలు చేయడంతో ఏం చేయాలో అర్దం కాలేదట వెలిచాలకు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్నాకే తత్వం బోధపడిందని చెబుతున్నారు. ఇద్దరు మంత్రులు తమ అనుచరులతో జిల్లా అధ్యక్షపదవికి అప్లై చేయించారని వారే వెనక ఉండి వెలిచాలకు చెక్ పెట్టేందుకు పావులు కదిపారనే టాక్ నడుస్తోంది జిల్లాలో. అధ్యక్షపదవికి దరఖాస్తు చేసుకున్న ఆశావహుల మధ్య వీధి పోరాటాలే కాకుండా…. అంతకంటే ఆసక్తికరంగా సోషల్ మీడియా వార్ సాగుతోంది… ఐదేళ్లు పార్టీలో పనిచేసి ఉండాలనే రూల్‌ను నొక్కి చెబుతూ… మంత్రుల అనుచరులు ప్రచారం చేస్తుండగా, కార్పోరేషన్ చైర్మన్లకు డీసీసీ పదవి ఇవ్వరని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో… వెలిచాలకు అసలు విషయం అర్దమయ్యేలా ఆమాత్యులే చేశారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి… ఓవరాల్‌గా చూస్తే… సీఎం ఆశీస్సులు ఉంటే సరిపోదు… తమ అండ కూడా అవసరమే అనే విషయాన్ని వెలిచాలకు అర్ధమయ్యేలా చేశారట ఆ ఇద్దరు మంత్రులు.
అయితే ఎవరో ఒక మంత్రి చుట్టూ తిరిగితే మరో మంత్రితో తంటా వస్తుందని భావించి బ్యాలన్స్‌గా ఉంటే… ఇప్పుడు రెండు వైపుల నుంచి అటాక్ మోడ్ ఆన్ అవడంతో ఎటు వైపు వెళ్లాలో పాలుపోవడం లేదట వెలిచాలకు… మొత్తానికి మంత్రులిద్దరూ… నోటితో దీవించి నొసటితో వెక్కిరించినట్టు చేశారని కరీంనగర్ కాంగ్రెస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఆ ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరే ఈ గొడవకు కారణం అన్నది ఇంకో వెర్షన్. జిల్లాలో తమ పెత్తనమే సాగాలనే ధోరణి కారణంగానే పార్టీ పరువు బజారున పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీనియర్ కార్యకర్తలు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేని దుస్థితిలో ఉన్నామని కార్యకర్తలు బాధపడుతున్న తరుణంలో నేతల మధ్య కొట్లాట కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందంటున్నారు. ఈ గొడవలకు హైకమాండ్ ఎలా చెక్ పెడుతుంది…? సీఎం ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకుంటున్న వ్యక్తి చేతికి పగ్గాలు వస్తాయా…? అనేది వేచి చూడాలి…
