Site icon NTV Telugu

Off The Record : కవిత టార్గెట్ వాళ్ళిద్దరేనా?

Harish Rao Otr

Harish Rao Otr

కవిత టార్గెట్‌ ఆ ఇద్దరేనా? ఇక ఫైనల్‌ లెక్కలు తేలిపోయినట్టేనా? తండ్రి దేవుడు, అన్నకు జాగ్రత్త అంటూ సూచనలు… హరీష్‌రావు, సంతోష్‌రావు మీద తీవ్ర ఆరోపణలు. సో… పిక్చర్‌ క్లియర్‌ అయిపోయినట్టేనా? దాని గురించి బీఆర్‌ఎస్‌ వర్గాలు ఏమంటున్నాయి? వాళ్ళిద్దర్నీ టార్గెట్‌ చేయబోయి కవిత ఏకంగా పార్టీనే ముంచేస్తున్నారన్న వాదన సంగతేంటి? ఉద్యమ పార్టీగా పుట్టినప్పటి నుంచి పదేళ్ళు అధికారంలో ఉండేదాకా…. బీఆర్‌ఎస్‌ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఉండవచ్చుగానీ…. ఇప్పుడు తగులుతున్న మాస్టర్‌ స్ట్రోక్స్‌ మాత్రం పార్టీ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటాయంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. అధినేత కేసీఆర్‌ కూతురు కవితను సస్పెండ్ చేశాక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీనే తనను వద్దనుకున్నప్పుడు దాని నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదని మాత్రం నాకెందుకంటూ ఆ పోస్ట్‌కు, బీఆర్‌ఎస్‌ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు కవిత. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. గులాబీ ముఖ్య నాయకులు హరీష్‌రావు, సంతోష్‌ టార్గెట్‌గా ఈసారి మరింత తీవ్ర ఆరోపణలు చేశారామె. అదే సమయంలో… వాళ్ళు నీకు కూడా హాని చేస్తారంటూ…. తన అన్న కేటీఆర్‌ని కూడా హెచ్చరించారామె. దాంతో… కవిత అసలు టార్గెట్‌ ఎవరో క్లారిటీ వచ్చినట్టేనన్న చర్చ జరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో.

వాళ్ళిద్దరి వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ సంచలన ఆరోపణ చేశారు కవిత. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే విమానంలో హరీష్ రావు, రేవంత్ రెడ్డి కలిసి ప్రయాణం చేశాకే పరిస్థితులు మారడం మొదలైందంటూ… కలకలం రేపారు కవిత. అయితే… వెంటనే కౌంటర్ ఇచ్చేశారు సీఎం. వాళ్ళు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు యాసిడ్‌ పోసుకుంటూ… మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతారు? మాకేం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చేశారాయన. అది వేరే సంగతి. కానీ… ఇక్కడ కవిత టార్గెట్‌ మాత్రం…. హరీష్‌, సంతోషేనన్న పూర్తి క్లారిటీ వచ్చిందని మాట్లాడుకుంటున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు. అదే సమయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. కవిత… బీఆర్‌ఎస్‌లోని ఇద్దరు కీలక నేతల మీద ఆరోపణలు చేసిందిగానీ…. ఎక్కడా కేసీఆర్‌ను పల్లెత్తు మాట అనలేదు. అలాగే అన్న కేటీఆర్‌ మీద కూడా తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శల్లాంటివేవీ చేయలేదు. ఆయన ప్రస్తావన వచ్చిన ప్రతిసారి… రామన్నా అని సంబోధిస్తూ… పరోక్షంగా మాకు మాకు ఏమీ లేవని చెప్పే ప్రయత్నం చేసినట్టు విశ్లేషిస్తున్నారు కొందరు. అంటే… ఇప్పుడు కవిత దృష్టిలో కేసీఆర్‌, కేటీఆర్‌దేం తప్పు లేదు. పాపాల భైరవులంతా హరీష్‌రావు, సంతోష్‌రావేనన్న మాట అన్న చర్చలు నడుస్తున్నాయి తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. గతంలో నేరెళ్ళ ఘటనలో సంతోష్‌రావు కేటీఆర్ ఇరికించే ప్రయత్నం చేశారని కూడా చెప్పుకొచ్చారామె. మరోవైపు కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన మొదటిసారి పోటీ చేసిన సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయనను ఓడగొట్టడానికి కొంతమందికి హరీష్ రావు డబ్బులు ఇచ్చారని కూడా ఆరోపించారు కవిత.

ఇలా హరీష్, సంతోష్‌… తనను ఎలా ఇబ్బంది పెట్టాలనుకున్నారో చెబుతూనే… అన్న కేటీఆర్‌ విషయంలో కూడా అలాగే చేశారంటూ…. తాము ఇద్దరం బాధితులమేనని చెప్పే ప్రయత్నం చేశారామె. ప్రెస్‌మీట్‌ తర్వాత మీడియా చిట్‌చాట్‌లో కూడా… కేసీఆర్‌ చుట్టూ ఉన్న దయ్యాలు ఆ ఇద్దరేనన్నట్టు చెప్పుకొచ్చారు కవిత. ఇదంతా ఒక ఎత్తయితే… ఫోన్ టాపింగ్ ఇష్యూ లో తన ఇంట్లోని వాళ్లతో పాటు కేటీఆర్ ఇంట్లో పని చేసే వాళ్ళ ఫోన్స్‌ను కూడా హరీష్ రావు సంతోష్ రావే టాప్ చేశారంటూ బాంబ్‌ పేల్చారు. అలా ఓవైపు వాళ్ళిద్దర్నీ టార్గెట్‌ చేస్తూనే… మరోవైపు కేసీఆర్‌, కేటీఆర్‌ను జాగ్రత్తగా ఉండండంటూ హెచ్చరించడం ఆసక్తికరంగా మారింది. తండ్రి కేసీఆర్ తనకు దేవుడు అంటూ… అన్న కేటీఆర్‌ని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ… వాళ్ళిద్దరి మీదే ఆరోపణలు చేశారంటే… ఇక ఫైనల్‌ టార్గెట్‌ తేలిపోయినట్టే కదా అని మాట్లాడుకుంటున్నారు పరిశీలకులు. ఇలా… కవిత వ్యాఖ్యల మీద ఇప్పటికిప్పుడు ఎవరూ బయటపడకున్నా… భవిష్యత్‌లో పార్టీని కబ్జా చేస్తారు జాగ్రత్త అని కేటీఆర్‌ని హెచ్చరించడం గురించి బీఆర్‌ఎస్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది.

Exit mobile version