Site icon NTV Telugu

Off The Record : జాగృతి అధ్యక్షురాలు కవిత స్వరం మార్చారా.? ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా?

Kavitha K

Kavitha K

జాగృతి అధ్యక్షురాలు కవిత స్వరం మార్చారా….ఇన్నాళ్లు పరోక్షంగా బీఆర్‌ఎస్‌ను…ప్రత్యక్షంగా అదే పార్టీ ముఖ్య నేతలను తిట్టిన కవిత…ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో కవిత చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటి? ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆదిలాబద్ టూర్‌లో మొదటి రోజు వ్యవసాయ మార్కెట్ లో పత్తి రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. తేమ నిబంధనలు రైతులకు ఇబ్బందిగా మారాయని, దానిపై జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. తమ బీఆర్ఎస్ హయాంలో రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు తలచుకుంటే రైతుల సమస్య పరిష్కారం అవుతుందని, సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖరాస్తే సరిపోతుందంటూ చెప్పుకొచ్చారామే. హరీష్ రావు,అలాగే సంతోష్ రావ్ తోపాటు బీఆర్ఎస్ ను చాలా రోజులుగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే ఆమెపైన వేటు సైతం పడింది. కానీ కవిత మాత్రం మా ప్రభుత్వ కాలంలో అలా ఉండేది..మా బీఆర్ఎస్ ఇలా చేసిందంటూ వ్యాఖ్యానించడం అలవాటులో పొరపాటా లేక ఏదైనా కారణం ఉందా అనే చర్చ రాజకీయాల్లో సాగుతోంది.

సాగునీటి ప్రాజెక్టులపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కవిత. జిల్లాలోని చనాకా కొరాట బ్యారేజీని పరిశీలించారు. బీఆర్ఎస్ కాలంలో చనాకా కొరటా ప్రాజెక్ట్ 90 శాతం పూర్తైందని చెప్పారు. 10 శాతం పనులు కూడా కాంగ్రెస్ చేయటం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టే…పక్కన పెడుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఫైరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పనులు భేష్ అంటూ కితాబిచ్చారు. తమ హయాంలోనే రాష్ట్ర ప్రజలకు మేలు జరిగిందని పదేపదే కవిత చెప్పడం దేనికి సంకేతమన్నా డిస్కషన్ జరుగుతోంది.

కేసిఆర్ చుట్టూ దయ్యాలు,కోవర్టులు అంటూ తీవ్ర విమర్శలు చేసిన కవిత…సడెన్ గా ఇలా మాట్లాడడం గులాబీ క్యాడర్‌కే అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ క్రెడిట్ ను ఓన్ చేసుకోవాలని కవిత భావిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు సైతం తనకు సహకరించేలా అలాంటి వ్యాఖ్యలు చేశారా అనే కామెంట్లు రీసౌండ్‌నిస్తున్నాయి. మా బీఆర్ఎస్ పాలన అంటూ లౌక్యంగా మాట్లాడుతున్నారా…రాజకీయ ఎత్తుగడలో భాగంగా బీఆర్ఎస్ క్యాడర్ దూరం కాకుండా ఇలా వ్యాఖ్యానిస్తున్నారా? ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని భావించి తిరిగి గులాబీ పార్టీని పొగుడుతున్నారా అనే డౌట్స్ కార్యకర్తల చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. ఇన్నాళ్లు పార్టీని లేదా తన కుటుంబ సభ్యులనే ఎందుకు విమర్శించాలనుకున్నారో ఏమోకానీ కొంత ఊగిసలాట ధోరణి మాత్రం కవితలో స్పష్టంగా కనపడుతోందన్న టాక్ వినిపిస్తోంది.

కవితలో మాత్రం మార్పు కనపడుతోంది. అప్పటిలా బీఆర్‌ఎస్ నాయకులను టార్గెట్ చెయ్యడం లేదు. కాంగ్రెస్‌, బీజేపీలపై ధాటిగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ,బీజేపీలను టార్గెట్ చేస్తే ఉమ్మడి శత్రువును వ్యతిరేకించే వారి మద్దతు లభిస్తుందనే అభిప్రాయంతో ఇలా యూటర్న్ తీసుకున్నారా డిస్కషన్ సాగుతోంది.

 

 

Exit mobile version