కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో బీఆర్‌ఎస్ ఇంకా.. ఇంకా… ఇరుక్కుపోతోందా? పార్టీ డబుల్ స్టాండ్ తీసుకుంటోందన్న సంగతి ఆన్ రికార్డ్ తేలిపోతోందా? పైకి రాజకీయంగా ఒక మాట, లోపల కోర్ట్‌లో మరో మాట చెబుతోందా? మేడిగడ్డ పిల్లర్స్ కుంగుబాటు విషయంలో బీఆర్‌ఎస్ ఇన్నాళ్ళు బయట వాదించిందంతా ఉత్తుత్తిదేనా? అసలు విషయాన్ని కోర్ట్‌కు చెప్పేసినట్టేనా? ఇంతకీ కోర్ట్‌కు ఏం చెప్పింది గులాబీ పార్టీ? ఈ లోపల, బయట గేమ్ ఏంటి? తెలంగాణ పాలిటిక్స్‌లో కాళేశ్వరం ప్రకంపనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రాజెక్ట్ కుంగుబాటు వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది తెలంగాణ సర్కార్. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని మొదట్నుంచి ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగడంతో అదే ఎన్నికల అజెండాగా మారిపోయింది.
ఆ ప్రభావం బీఆర్‌ఎస్ విజయావకాశాల మీద గట్టిగానే పడిందన్న విశ్లేషణలున్నాయి. పిల్లర్స్ కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు ఇచ్చింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేయడంతో కారు పార్టీ బాగా ఇరకాటంలో పడింది. ఇక ఎన్నికల తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం…ప్రాజెక్ట్‌లో అవినీతి, పిల్లర్స్ కుంగుబాటుపై దృష్టి పెట్టి విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఉన్న అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ని కూడా విచారించింది. దానికి సంబంధించిన పూర్తిస్థాయి రిపోర్టుని ప్రభుత్వానికి అందజేసింది. అదంతా ఒక ఎత్తయితే….పిల్లర్స్ కుంగుబాటుపై బీఆర్‌ఎస్ బయట మరో రకమైన రాజకీయ ఎదురుదాడి మొదలుపెట్టింది. మేడిగడ్డ దగ్గర పిల్లర్స్ కుంగడంపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ కొత్త రాగం అందుకున్నారు గులాబీ నాయకులు. కొందరైతే.. ఓ అడుగు ముందుకేసి అసలు కాంగ్రెస్ నాయకులే… బాంబులు పెట్టి ఆ పిల్లర్స్‌ను కూల్చేసి ఉంటారంటూ… ఆరోపణల్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకువెళ్ళారు. కేటీఆర్‌తో పాటు మరి కొంత మంది బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. అదే సమయంలో అసలు కాళేశ్వరం కమిషన్ రిపోర్టే కరెక్ట్ కాదంటూ కోర్ట్‌కు వెళ్ళింది బీఆర్‌ఎస్. దాన్ని నిలిపేయాలని కోర్ట్‌ను కోరారు పార్టీ నాయకులు. అందుకు సంబంధించిన వాదనలు వినిపిస్తున్న సందర్భంలోనే… పార్టీ రెండో పార్శ్వం బయట పడిందని అంటున్నారు ప్రత్యర్థులు.
నిన్నటిదాకా బ్యారేజ్ పిల్లక్స్‌ని కాంగ్రెస్ నాయకులు బాంబులు పెట్టి పేల్చారని ఆరోపించి, అనుమానాలు వ్యక్తం చేసిన గులాబీ నేతలు కోర్ట్‌లో మాత్రం ఆ వాదన వినిపించలేదు. అత్యధిక నీటి ప్రవాహపు వత్తిడి వల్లే మేడిగడ్డ దగ్గర పిల్లర్ కుంగిందని వాదించారు బీఆర్‌ఎస్ లాయర్. కోర్ట్ ముంగిట అసలు బాంబుల అనుమానాలు, ఆ ప్రస్తావనలు రాలేదు. దీంతో రకరకాల డౌట్స్ వస్తున్నాయట రాజకీయ వర్గాల్లో. అంటే మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో బీఆర్‌ఎస్ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందా? బయట రాజకీయ విమర్శలు చేసేటప్పుడు బాంబుల మాటలు మాట్లాడి కోర్ట్ మందు మాత్రం హెవీ వాటర్ ఫ్లో అన్నారంటే… రాజకీయం తమను ఇరికించడానికి అబద్దాలాడినట్టే కదా అని నిలదీస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. రెండు చోట్ల రెండు రకాల మాటలు మాట్లాడ్డంపై బీఆర్‌ఎస్ మేతలు రేపు జనానికి కూడా సమాధానం చెప్పుకోవాల్సి రావచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక దశలో మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు విషయమై జనాల్లోకి వెళ్లి గట్టిగా మాట్లాడాలనుకున్న బీఆర్‌ఎస్ అధిష్టానం… నీటి ప్రవాహం వల్లే కుంగిపోయిందని కోర్ట్‌లో చెప్పడం ద్వారా… ఒక అడుగు వెనక్కి వేసిందా అన్న అనుమానం ఆ పార్టీ నాయకులకు కూడా వస్తోందట. నిన్నటిదాకా బాంబుల మాటలు మాట్లాడిన పార్టీ పెద్దలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఏం సమాధానం చెబుతారో చూడాలని గులాబీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోందట.
