Site icon NTV Telugu

Off The Rercord : జ్యోతుల ప్రకటన వెనక ఉద్దేశ్యాలపై కొత్త చర్చలు.. మంత్రి పదవి కోసమేనా ?

Tdp

Tdp

ఆ సీనియర్‌ ఎమ్మెల్యే టీడీపీ అధిష్టానాన్ని గట్టిగా ఇరుకున పెడుతున్నారా? ఇంకా మూడున్నరేళ్ళ టైం ఉండగానే…. వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాల గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? అది తన జీవిత కాల లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు సంధిస్తున్న అస్త్రమా? లేక అంతకు మించా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటి ఆయన లక్ష్యం? జ్యోతుల నెహ్రూ…. జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే. మూడు పార్టీల నుంచి ఆరు సార్లు పోటీ చేసి…. మూడు విడతలు విన్ అయ్యారాయన. పేరుకు సూపర్ సీనియర్ అయినా… కొన్ని పొలిటికల్‌ రాంగ్ స్టెప్స్ కారణంగా ఆయన జీవితాశయం అయిన మంత్రి పదవిని చేరుకోలేకపోయారన్నది గోదావరి వాయిస్‌. ప్రస్తుతం నెహ్రూ కుమారుడు నవీన్.. తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో నెహ్రూ వైసీపీ నుంచి టిడిపికి వచ్చినప్పుడు నవీన్‌కు జిల్లా పరిషత్ చైర్మన్‌ ఛాన్స్‌ దక్కింది. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నవీన్ గట్టి ప్రయత్నాలే చేసినా… జనసేన కోటాలోకి వెళ్లిపోవడంతో సైలెంట్ అయిపోయారు.

ఈ క్రమంలో..తాజాగా 2029 ఎన్నికల గురించి జ్యోతుల నెహ్రూ మాట్లాడ్డం టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో నవీన్ జగ్గంపేట నుంచి పోటీ చేస్తారని, తాను జిల్లాలోని మరో నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్తానని క్లియర్‌గా, క్లారిటీగా చెప్పేశారాయన. ఆ స్టేట్‌మెంట్‌ చుట్టూనే ఇప్పుడు సరికొత్త చర్చలు మొదలయ్యాయి. సీనియర్‌ లీడర్‌ ఇంత ముందుగా మాట్లాడుతున్నారంటే… లెక్కలు వేరుగా ఉండి ఉంటాయన్న సందేహాలు కూడా వస్తున్నాయి చాలా మందికి. నెహ్రూకి ఇవే చివరి ఎన్నికలని, ఇక ఆయన రిటైర్ అవుతారంటూ 2024లో జోరుగా ప్రచారం జరిగింది. దాన్ని ఆయన కన్ఫామ్‌ చేయలేదు, ఖండించనూ లేదు. ఇప్పుడు మాత్రం, రాజకీయాలంటే కొందరు ఆట అనుకుంటున్నారని, అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పడానికే తాను మళ్ళీ పోటీ చేస్తానని అంటున్నారట. దీంతో ఆయన ఇన్ డైరెక్ట్ అటాక్ సొంత పార్టీ మీదా, లేక ప్రతిపక్షం మీదనా అన్న డిస్కషన్ కూడా మొదలైపోయింది. కొడుకు కోసం జ్యోతుల ఇప్పట్నుంచే కర్చీఫ్‌ వేస్తున్నారు బాగానే ఉందిగానీ… ఆయన కోరుకుంటున్న మరో సీటు జిల్లాలో ఎక్కడుందన్నది తమ్ముళ్ళ క్వశ్చన్‌.

ఇప్పటికిప్పుడు ఆ ఫ్యామిలీ కోసం త్యాగం చేసే వాళ్ళు ఎవరున్నారని కూడా మాట్లాడుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు. కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను… ఐదు చోట్ల టిడిపి రెండు చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల లెక్కలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. ఈసారి కూడా కూటమిగానే పోటీ చేస్తే ఉన్నవాళ్లను సర్దుబాటు చేయడమే కష్టం. లేదు… ఏవైనా అనూహ్య పరిణామాలు జరిగి విడిగా పోటీ చేసినాసరే… టిడిపిలో ఆశావహుల లిస్టు మామూలుగా లేదు. అలాంటప్పుడు జ్యోతుల కుటుంబానికి ఒక ఎక్స్‌ట్రా సీటు ఎక్కడ ఇవ్వగలరంటూ తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. అయితే… ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన మాట కూడా వినిపిస్తోంది. నెహ్రూ మాటల మర్మం వేరే ఉండి ఉండవచ్చన్నది కొందరి విశ్లేషణ. త్వరలో ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ జరుగుతుందన్న వార్తలు వస్తున్న టైంలో… వ్యూహాత్మకంగానే ఆయన రెండు సీట్ల సిద్ధాంతాన్ని తెర మీదికి తెచ్చి ఉండవచ్చంటున్నారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్నారు జ్యోతుల.

 

త్వరలో ఆ పదవీ కాలం కూడా ముగుస్తుంది. ఇక మిగిలిపోయింది జీవితంలో ఒక్కసారైనా మంత్రి అవ్వాలన్న కోరికే. దాంతో… పునర్‌ వ్యవస్థీకరణలో తన పేరు పరిసీలించేలా అధిష్టానం మీద వత్తిడి చేయడానికే ఈ కొత్త పల్లవి అందుకుని ఉండవచ్చంటున్నారు విశ్లేషకులు. తనకు ఆ ఒక్క లాస్ట్‌ ఛాన్స్‌ ఇచ్చేస్తే… ఇక హ్యాపీగా రిటైర్ అయిపోతానని చెప్పడమే ఆయన ఉద్దేశ్యమని చెవులు కొరుక్కుంటున్నారు కాకినాడ తమ్ముళ్లు. జిల్లాలో ఎక్కడా ఖాళీ లేదన్న సంగతి ఆయనకు బాగా తెలుసునని, అయినా సరే తనకు, కొడుక్కి సీట్ల ప్రస్తావన తెస్తున్నారంటే… కచ్చితంగా అది వ్యూహాత్మకమేనన్న వాదన బలపడుతోంది. దీన్ని గమనిస్తున్న టీడీపీలోని ఓ వర్గం కూడా గట్టిగానే సెటైర్స్‌ వేస్తోంది. తండ్రి రిటైర్‌మెంట్‌ ఫంక్షన్‌ గ్రాండ్‌గా చేసేస్తే… కొడుక్కి ఈజీగా లైన్‌ క్లియర్‌ అవుతుంది. అదేదో… చూడండయ్యా అంటోంది ఆ వర్గం. ఫైనల్‌గా జ్యోతుల నెహ్రూ కాన్వాయ్‌ కార్‌లో రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తారో లేక అంతా భ్రాంతియేనా అని పాడుకుంటారో చూడాలి మరి.

 

Exit mobile version