Site icon NTV Telugu

Off The Record : అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చిందులు కామనా..?

Jc Prabhakar Reddy

Jc Prabhakar Reddy

తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ తీరుతో అధికార పార్టీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారా? ఎంతటి అధికారి అయినాసరే… అదేదో తమ ఇంట్లో పాలేరన్నట్టుగా ఛైర్మన్‌ ఫీలైపోతున్నారా? జిల్లా స్థాయి అధికారుల మీదికి సైతం ఒంటికాలి మీద లేస్తూ… బూతు పురాణం అందుకోవడాన్ని ఎలా చూడాలి? ఓవైపు రచ్చ అవుతున్నా… అంతా జనం కోసమేనని ప్రభాకర్‌రెడ్డి చెప్పడం దేనికి సంకేతం? ఓపెన్‌ విత్‌ స్పాట్‌ జేసీ అధికారుల మీద ఫైర్‌ అవుతున్నది ఇదే… ఈ వైఖరే… ఇప్పుడు కేవలం తాడిపత్రి నియోజకవర్గంలోనేగాక రాష్ట్రం మొత్తం హాట్‌ టాపిక్‌ అవుతోంది. మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇలా… స్థాయీ భేదాల్లేకుండా అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం.. ఒక దశలో బూతు పురాణం విప్పడం లాంటివి చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక రకంగా ఇది అధికార పార్టీకి, ప్రభుత్వానికి కూడా తలనొప్పి అవుతోందన్న విశ్లేషణలు సైతం పెరుగుతున్నాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికార పార్టీకి చెందిన మున్సిపల్‌ ఛైర్మన్‌ అవడం, ఆయన కుమారుడు లోకల్‌ ఎమ్మెల్యే కావడంతో… ఈ వ్యవహారాలు అటు సర్కార్‌ మీద కూడా ప్రభావం చూపుతున్నట్టు చెప్పుకుంటున్నారు.

మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎందుకిలా చిందులేస్తున్నారంటే… దానికి చాలా కారణాలున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి లోకల్‌ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు అధికారుల సహాయ నిరాకరణ ఉంటుందని అంటారు. కానీ… జేసీ మాత్రం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా… ఇలా చిటపటలాడుతుంటారని ఒక రేంజ్‌లో విరుచుకు పడుతుంటారన్నది లోకల్‌ వాయిస్‌. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పని చెప్పినా చేయడం లేదంటూ సాక్షాత్తూ మహిళా కలెక్టర్ మీద అందరి ముందు ఫైర్ అయ్యారు జేసీ. ఆమె టేబుల్ మీదికి ఫైళ్ళు విసిరారు. అప్పట్లో అది పెద్ద వివాదంగా మారింది. ఇక జిల్లా ఎస్పీలు, తాడిపత్రిలో పని చేసిన డీఎస్పీ మీద ఒకానొక సందర్భంలో బూతులతోనే విరుచకపడ్డారాయన. ఇక ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్ ఛైర్మన్ అయ్యాక.. తాడిపత్రి మున్సిపల్ కమిషనర్‌గా ఎవరు రావాలన్నా వణికి పోయారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోయే వారు. ఛైర్మన్ హోదాలో జేసీ మాట వినాలో లేక అప్పట్లో లోకల్‌ ఎమ్మెల్యే హోదాలో పెద్దారెడ్డి మాట వినాలో తెలియక మున్సిపల్‌ కమిషనర్లు పడే అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ తిట్లు భరించలేక ట్రాన్స్‌ఫర్స్‌ చేయించుకున్నారట కొందరు అధికారులు. అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పనులు జరగలేదనో లేక తన మాట వినలేదనో ఫ్రస్ట్రేషన్‌ ఉంటే ఉండవచ్చుగానీ…. ఇప్పుడు అధికారంలో ఉన్నారు.

అయినా సరే.. అధికారుల మీద అదే స్థాయిలో ఫైర్ అవుతుండటం, తీవ్ర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. తాజాగా జిల్లా పంచాయతీ అధికారి, తాడిపత్రి ఏఎస్పీ మీద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అధికారులను ఉద్దేశించి రాయడానికి వీల్లేని భాష వాడటంపై అధికార పార్టీ వైపు నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయట. తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో అక్రమ లే అవుట్లకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభాకర్‌రెడ్డి. జడ్పీ ఆవరణలోని డీపీఆర్సీలో డీపీవో ఉన్నారని తెలుసుకున్న మున్సిపల్‌ ఛైర్మన్‌ నేరుగా అక్కడికి వెళ్లారు. అక్రమ లేఅవుట్లపై జాయింట్‌ కలెక్టర్ చెప్పినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. రియల్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నావా? అంటూ… బూతులు లంకించుకోవడంతో మధ్యలోనే బయటికి వచ్చేశారట డీపీఓ. అక్కడితో ఆగకుండా… నువ్వు అహంకారివి, నీ కథ చూస్తా.. నాకు అంతా తెలుసు.. జాగ్రత్త.. అంటూ పదేపదే హెచ్చరించారట. వీడు ప్రతి వ్యవహారంలో అవినీతి చేశాడు.. అన్ని చోట్ల డబ్బులు తీసుకున్నాడంటూ ఏకవచనాలే వాడేశారు. ఏప్రిల్ నుంచి ఫోన్ చేస్తున్నా స్పందించలేదని అనడంతో.. బదిలీల కారణంగా తాఖీదులు ఇవ్వడం కొంత ఆలస్యమైందని అధికారి చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదట ప్రభాకర్‌రెడ్డి.

అటు తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ మీద కూడా ఇదే స్థాయిలో విరుచకుపడ్డారు జేసీ. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనంతపురం జిల్లాలో ట్రాన్స్‌మిషన్‌ టవర్లు ఏర్పాటు చేస్తోంది. ఆ కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం విషయంలో అధికారులు అన్యాయం చేస్తున్నారన్నది జేసీ ఆరోపణ. యాడికిలో టవర్లు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారు జేసీ అనుచరులు. దీంతో వాళ్ళ మీద కేసు నమోదైంది. పోలీసులను ముందుపెట్టి పవర్ గ్రిడ్ పనులు జరిపిస్తావా.. కాంట్రాక్టర్ల నుంచి ఎంత అందింది? అంటూ ఫైర్ అయ్యారు ప్రభాకర్‌రెడ్డి. ఆయన విషయంలో కూడా పరుష పదజాలమే వాడేశారు. నువ్వు ఏఎస్పీ అయితే ఏంటి? నీ మీద కూడా కేసు పెడతానంటూ ఎగిరెగిరి పడ్డారు జేసీ. వైసీపీ హయాంలో మాకు జరిగిన అన్యాయానికి నువ్వు సమాధానం చెబుతావా అంటూ మీడియా వేదికగానే దూషణలకు దిగారాయన. ఈ వ్యవహారశైలి గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. జనం కోసం మాట్లాడుతున్నానని జేసీ సమర్ధించుకోవచ్చుగానీ… పని చేయించుకోవడానికి కూడా ఒక పద్ధతంటూ ఉంటుంది కదా… ఉన్నతాధికారులేదో… మీ ఇంట్లో పాలేర్లు అన్నట్టుగా ప్రవర్తిస్తే ఎలాగన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడే ప్రతిపక్షం వైసీపీకి కూడా మంచి అస్త్రం దొరుకుతోందట. అధికారుల మీద ప్రభాకర్‌రెడ్డి విరుచుకుపడ్డ తీరు, ఆయన వాడిన బూతుల వీడియోల్ని వైరల్‌ చేస్తూ… కూటమి సర్కార్‌లో అధికారులకు దక్కుతున్న గౌరవం ఇదీ అంటూ ప్రచారం చేస్తున్నారట. పైగా… ప్రశ్నిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఇవి కనిపించడం లేదా అంటూ నిలదీస్తుండటం కూటమి సర్కార్‌కు ఇబ్బందికరంగా మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అటు జేసీ మాత్రం ఈ విషయంలో తగ్గేదే లే అంటున్నారు. నేను రౌడీని కాబట్టే నా ఊరు బాగుందంటూ… లేటెస్ట్‌ ట్విస్ట్‌ ఇచ్చారాయన. తాడిపత్రి ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని అనడంతో దీన్ని ఇక్కడితో వదిలే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో… ఆయన ఉద్దేశ్యం మంచిదైతే కావచ్చుగానీ… ప్రతిదాన్ని డీల్‌ చేయడానికో పద్ధతంటూ ఉంటుందికగా అన్నది అధికార వర్గాల మాట. ఈ వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం ఎలా సెట్‌ చేస్తుందోనని చూస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

 

Exit mobile version