Site icon NTV Telugu

Off The Record : నేనే సీఎం నుంచి.. పోటీ చేయననేదాకా ఎలా..?

Jaggareddy

Jaggareddy

రాజకీయ సంచలనాలకు కేరాఫ్‌ అయిన ఆ లీడర్‌కి ఉన్నట్టుండి ఎందుకు ప్రసూతి వైరాగ్యం కలిగింది? ఎప్పుడూ పొలిటికల్ పంచ్‌లు పేలే నోటి నుంచి బేల మాటలు ఎందుకు వచ్చాయి? వ్యూహమా? లేక అదే నిజమా? నేనే సీఎం అన్న స్థాయి నుంచి… పవర్‌ పాలిటిక్స్‌కు తాత్కాలిక విరామం ప్రకటించేదాకా వచ్చిన ఆ నాయకుడు ఎవరు? ఎందుకలా మాట్లాడుతున్నారు? తెలంగాణ పాలిటిక్స్‌లో ఎప్పుడూ ఏదోరకమైన సంచలన వ్యాఖ్యలతో జనం నోళ్ళలో నానుతుంటారు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి. ఆయన మీడియా సమావేశం పెడితే.. రాజకీయంగా ఎవరికో మూడిందని అనుకుంటారు సాధారణంగా. సంగారెడ్డిలో ఏటా పండగలు ఘనంగా నిర్వహిస్తుంటారాయన. అందులోనూ… దసరా, సంక్రాంతి అయితే చెప్పేపనేలేదు. కానీ… రెండేళ్లుగా ట్రెండ్ మార్చేశారాయన. ఓవైపు గ్రాండ్‌గా పండగ చేస్తూనే…దానికి కాస్త పొలిటికల్ మసాలా అద్దుతున్నారు. దాంతో… డూ పొలిటికల్‌ ఫెస్టివల్‌ అన్నట్టుగా మారిపోతోంది వ్యవహారం. ఒక్కో పండక్కి ఒక్కో రకమైన స్టేట్‌మెంట్‌తో పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు జగ్గారెడ్డి. సరిగ్గా ఏడాది క్రితం.. సంక్రాంతి వేడుకల వేదిక నుండి మాట్లాడుతూ…తెలంగాణ కాంగ్రెస్‌లో దాదాపు ఆటంబాంబ్‌ పేల్చినంత పనిచేశారు మాజీ ఎమ్మెల్యే. రాబోయే పదేళ్లలో తెలంగాణకు ముఖ్యమంత్రి అయి తీరతానని ప్రకటించారు జగ్గారెడ్డి. అప్పటికి ఆ కామెంట్స్ లోకల్‌గా ఖుషీ ఖబర్ అనుకున్నా… క పార్టీలో మాత్రం తీవ్ర చర్చకు దారి తీశాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే రేస్‌లో ఉంటారన్న టాక్ ఓవైపు పార్టీలో నడుస్తుండగానే…. జగ్గారెడ్డి చేసిన సీఎం కామెంట్స్ చర్చకు తెరలేపాయి.

చివరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా… ఏం జగ్గారెడ్డి… ఎప్పుడు అవుతున్నావు సిఎం? అనే స్థాయిలో చర్చ జరిగిందంటే… ఆ బాంబ్‌ అలా పేలిందన్న మాట. ఇక ఈ దసరాకి… మొత్తం సీన్ మార్చేశారు జగ్గారెడ్డి. గతానికి పూర్తి భిన్నమైన స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారాయన. నేనే సీఎం… అన్న స్థాయి నుంచి… వచ్చే పదేళ్లు నేను అస్సలు ఎన్నికల్లోనే పోటీ చేయననే స్థితికి వెళ్ళిపోయారాయన. ఇదే విషయాన్ని ఈ దసరా వేడుకల వేదిక మీదనుండి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన భార్య నిర్మలా జగ్గారెడ్డి పోటీ చేస్తారని, ఇక ఆ తర్వాత ఎవరన్నది అప్పుడు చూద్దామని చెప్పుకొచ్చారు మాజీ ఎమ్మెల్యే. దీంతో… అదేంటి సీఎం రేసు నుండి.. అసలు పోటీనే చేయను అనేదాకా ఎందుకు వెళ్లారన్న చర్చ మొదలైంది రాజకీయవర్గాల్లో. రేస్‌లో జగ్గారెడ్డి ఉన్నా, ఆయన భార్య నిర్మలా జగ్గారెడ్డి ఉన్నా… ఒకేలా రిసీవ్‌ చేసుకుంటుంది సంగారెడ్డి క్యాడర్‌. కానీ… సడన్‌గా పోటీకి విరామం ప్రకటించడం వెనకున్న మేటర్‌ ఏంటంటూ మల్లగుల్లాలు పడుతున్నారట స్థానిక నాయకులు. రాజకీయ ఎత్తుగడల్లో దిట్టగా పేరున్నజగ్గారెడ్డి… ఉత్తుత్తినే ఏదీ ప్రకటించబోరని, ప్రత్యక్ష ఎన్నికలకు పదేళ్ళు దూరంగా ఉంటానని అన్నారంటే…. ఏదో పెద్ద వ్యూహమే ఉండి ఉండవచ్చంటున్నారు. రాజకీయ సంచలనాలకు కేరాఫ్ అయిన మాజీ ఎమ్మెల్యే ఈ ప్రకటనతో ఇంకో సంచలనం దేనికో తెరతీయబోతున్నట్టు అంచనా వేస్తున్నారు పరిశీలకులు.పరిస్థితుల్ని బట్టి కూతురు జయా రెడ్డిని కూడా రాజకీయాల్లోకి తీసుకువస్తారనుకుంటే… పదేళ్ళపాటు తాత్కాలిక అస్త్ర సన్యాసం ఏంటోననంటూ ఆంతర్యం కోసం వెదుకుతున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

Exit mobile version