OTR : హైదరాబాద్ మెట్రో విస్తరణకు బ్రేక్ వేసిందెవరు.?

Metro

Metro

హైదరాబాద్‌ మెట్రో కేంద్రంగా తెలంగాణలో సరికొత్త రాజకీయం మొదలవుతోందా? విస్తరణకు అవసరమైన రుణం మంజూరవకుండా ఎవరైనా అడ్డుపుల్ల వేశారా? అదే నిజమైతే… ఆ పని చేసింది ఎవరు? రాష్ట్ర ప్రజల మీద మెట్రో భారం విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు స్టేట్‌ గవర్నమెంట్‌ సిద్ధమవుతోందా? కేబినెట్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు..? హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌ 2 పనులు మొదలవ్వాలంటే… రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పు ఇవ్వాల్సిందేనా….? సరిగ్గా అప్పు ఇచ్చే సమయానికి అడ్డుపుల్ల వేసింది ఎవరు..! ఎవరో ఆపినంత మాత్రాన… సీఎం ఊరుకుంటారా..? అలాగైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి..! ప్రస్తుతం ఇలాంటి చాలా సమస్యలకు సమాధానాలు వెదుకుతున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి.. సహజంగానే అందరి కళ్ళు ఆ పార్టీ నాయకులవైపే చూస్తున్నాయి. ప్రయత్నాలు ఫలించి మెట్రో విస్తరణకు అవసరమైన రుణం వచ్చిందంటే.. మెట్రో ఫేజ్‌ టూ వ్యవహారానికి సంబంధించిన క్రెడిట్ కాంగ్రెస్‌ ప్రభుత్వ ఖాతాలో పడుతుంది.

అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించిందని చెప్పుకునే అవకాశం ఉన్నా… రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నారన్నది సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. అసలు రుణానికి సంబంధించిన ఫైల్ ఎక్కడ ఆగింది..? ఎందుకు ఆగిందన్న విషయాన్ని తాజా మంత్రివర్గ సమావేశంలో సహచరులకు వివరించారట సీఎం. తనకు ఆ విషయాన్ని ఏ కేంద్ర మంత్రి చెప్పారన్నది కూడా కేబినెట్‌కు తెలియజేశారట. దానివెనక రాజకీయ కోణం ఉందన్నది రేవంత్‌ అనుమానంగా తెలుస్తోంది. పొలిటికల్‌గా తనను ఇరకాటంలోకి నెట్టడం… కాంగ్రెస్‌ సర్కార్‌కు అప్పుల భారం పెంచడం లాంటి ఎత్తుగడల్ని ప్రత్యర్ధి పార్టీలు వేస్తున్నట్టు పసిగట్టారట ముఖ్యమంత్రి. దానికి అణుగుణంగా ఇప్పటికే ఆయన ప్లాన్ bని కూడా సిద్ధం చేశారంటూ ఓ మంత్రి స్పష్టం చేశారు.

×
×
Ad

మెట్రోకు 13వేల 600 కోట్ల రుణం మంజూరు ఐతే రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి ప్రభుత్వానికి 4.2శాతం వడ్డీ పడుతుంది. తక్కువ వడ్డీ కారణంగా మెట్రో మొదటి నెల నుంచే 100 నుండి 150 కోట్ల ప్రాఫిట్‌లో నడుస్తుంది. కానీ ప్రభుత్వానికి వచ్చే రుణాన్ని అడ్డుకుంటే అంతిమంగా అది ప్రజల మీద భారం వేసినట్టేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా అని రాష్ట్ర ప్రభుత్వం అప్పుకు పోతే… కేవలం రాజకీయ కారణాలతో రుణం ఆపడం సరికాదని, ఒకవేళ ముఖ్యమంత్రి మీద రాజకీయ రక్ష ఉంటే… దాన్ని వేరేలా చూసుకోవాలేగానీ…. అప్పు పుట్టకుండా ఆపితే ప్రజల మీద భారం పడుతుందన్న లాజిక్‌ మర్చిపోతున్నారా అన్న చర్చలు నడుస్తున్నాయి. మెట్రో ఇప్పుడున్న పరిస్థితుల్లో రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చే రుణాన్ని అడ్డుకుంటే… మరో గత్యంతరం లేక బ్యాంకుల దగ్గరకు వెళ్ళాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీ వడ్డీ రేటు కేవలం 4.2శాతం మాత్రమే. అదే బ్యాంకుల దగ్గరికి వెళ్తే 8 శాతం వరకు వడ్డీ పడుతుంది. అంటే…దాదాపు డబుల్‌ అన్నమాట. తక్కువ వడ్డీకి రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రుణం తీసుకుంటే… మెట్రో మొదటి రోజునుంచే లాభాల్లో నడుస్తుంది. కానీ… బ్యాంకుల దగ్గరికి వెళ్తే…. మళ్ళీ నష్టాలు తప్పవు. పైగా వడ్డీ భారం తడిసి మోపెడవుతుంది. అంతిమంగా ఆది ప్రజల మీదే పడుతుంది. దీని గురించే ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. రాజకీయంగా సీఎం రేవంత్‌ను ఇరకాటంలోకి నెట్టడానికి ఇలాంటి ఎత్తుగడలు వర్కౌట్‌ అయితే కావచ్చుగానీ….అంతిమంగా రాష్ట్ర ప్రజల మీద భారం పడుతోందన్న వాస్తవాన్ని అడ్డుపుల్లలు వేస్తున్నవాళ్ళు గమనించలేకపోతున్నారా అంటూ కాంగ్రెస్‌ నేతలు సైతం నిలదీస్తున్నారు. అభివృద్ధిలో కూడా రాజకీయాలేంటో అంటూ నిట్టూరుస్తున్నారు.