Site icon NTV Telugu

Off The Record : బీఆర్ఎస్ వెంటే ఉండాలని మహిపాల్ రెడ్డి డిసైడ్ అయ్యారా?

Gudem

Gudem

ఆయన అధికార పార్టీ గూడు కోసం తపించారు. అడుగులు బలంగా వుండాలంటే పొజిషన్‌లో వుండాలని ఆలోచించారు. వుంటే వుండని ప్రాబ్లమ్ లేదు కదా అని పవర్‌ పార్టీ కూడా భావించింది. కానీ అప్పటికే సెగ్మెంట్‌లో తిష్టవేసిన గ్రూప్‌ వార్‌….నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. దీంతో ఆయన్ను ఎలా వదిలించుకోవాలా అని ఎదురుచూసిన అధికార పార్టీకి, ఆయనే అవకాశమిచ్చారు. సభలో సీఎం స్పీచ్‌తో క్లియర్‌ కట్‌ పిక్చర్ వచ్చేసింది. ఇంతకీ ఎవరాయన? ఏం జరిగింది? ఆయనే గుడ్‌ బై చెప్పారా..చెప్పాల్సి వచ్చిందా?

పటాన్‌చెరు MLA మహిపాల్ రెడ్డి వ్యవహార శైలి మళ్ళీ చర్చకి వచ్చింది. ఇన్నాళ్లూ దాగుడు మూతలు ఆడినా…అసెంబ్లీలో ఆయన వ్యవహారంతో దాదాపు ఓ క్లారిటీ వచ్చేసింది. అక్రమ మైనింగ్ మాఫియాపై సభలో రెండో రోజు చర్చ జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బిఆర్ఎస్ సభ్యులకు మద్దతుగా నిలబడ్డారు. పొంగులేటికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. దీంతో ఎమ్మెల్యే ఇక బీఆర్ఎస్ వెంటే ఉండాలని డిసైడ్ అయ్యారా…సభలోనే క్లారిటీ ఇచ్చారా అనే చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆయన ఇలాంటి చర్చకు అవకాశం ఇవ్వలేదు. కానీ సభలో మైనింగ్ ఎపిసోడ్ పై చర్చ జరుగుతున్న సమయంలో ఆయన బీఆర్ఎస్ సభ్యులకు మద్దతుగా నిలబడ్డారు.

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యవహారం ఎలా ఉన్నా… సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. తన ఎమ్మెల్యే సోదరుడి మైనింగ్‌ను కాపాడే ప్రయత్నంలో హరీష్ ఉన్నారని…అందుకు రెవెన్యూ మంత్రి సహకరించకపోవడంతో ఇలాంటి ఆందోళనలు చేస్తున్నారంటూ పటాన్‌చెరు ఎమ్మెల్యే సోదరుడిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ప్రభుత్వం వేసిన సీబీసీఐడీ విచారణలో ఆ కన్‌స్ట్రక్షన్ కంపెనీ పేరును కూడా చేర్చారు. దీంతో ఇటు ప్రభుత్వం కూడా మహిపాల్ రెడ్డిని తన ఖాతాలో వేసుకోవడం లేదనే క్లారిటీ వచ్చింది.

ఇప్పటికే పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల మధ్య పోటీ తీవ్రంగా వుంది. పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నీలం మధు ఓవైపు… పటాన్‌చెరు ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మరోవైపు యాక్టివ్‌గా వున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఎలా ఉన్నా…ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్‌లో కాంగ్రెస్ పార్టీ పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వదిలేసుకున్నట్టేనన్న చర్చ సాగుతోంది. జిహెచ్ఎంసి ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయన్న డిస్కషన్ జరుగుతున్న క్రమంలో ఆ నియోజకవర్గంలోని సుమారు 9 డివిజన్లో ఉన్నాయి. వీటిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డిదే పైచేయిగా అధికారుల వ్యవహారం సాగింది. కానీ మైనింగ్ అక్రమ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరితో మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ సొంతం చేసుకునే పరిస్థితిలో కూడా లేదు. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై హరీష్ రావు ఎందుకు స్పందించలేదని పటాన్‌చెరు ఇన్చార్జి కాటా శ్రీనివాస్ మాటలదాడిని మొదలుపెట్టారు. ఇలా పటాన్‌చెరు రాజకీయం రంజుగా మారుతోంది. ఓవైపు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జి నీలం మధు… మరోవైపు పటాన్ చెరు ఇంచార్జి కాటా శ్రీనివాస్ మధ్య కాంగ్రెస్‌లో మళ్ళీ పోటీ మొదలుకానుందన్న మాటలూ షురూ అయ్యాయి.

Exit mobile version