Site icon NTV Telugu

Off The Record : త్వరలోనే జగన్ దగ్గర పంచాయితీ పెట్టాలనుకుంటున్నారా?

Ycp

Ycp

వాడుకోండి…. నా సేవల్ని బాగా ఉపయోగించుకోండి…. నా అనుభవాన్నంతా రంగరించి పార్టీని పైకి తెస్తానని ఆ వైసీపీ ఎంపీ చెబుతున్నా అస్సలు రెస్పాన్స్‌ ఉండటం లేదట. నువ్వు ఉండవయ్యా బాబూ…. అవసరమైనప్పుడు వాడతాంలే. టైమ్‌ వచ్చినప్పుడు మా వాడకం మామూలుగా ఉండదని అంటున్నా ఆ ఎంపీ మాత్రం అస్సలు తగ్గడం లేదట. హిట్‌ మీ హార్డ్‌ యార్‌ అంటున్న ఆ రాజ్యసభ సభ్యుడు ఎవరు? ఏంటా కథ? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద పొలిటికల్‌ రాశి, వాసిలో ఇంకా చెప్పాలంటే పార్టీ అధ్యక్షుడు జగన్‌ కన్నా అదృష్టవంతుడు రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు. పార్టీని నిలబెట్టడానికి, సీఎం సీట్లో కూర్చోవడానికి చాలా కష్టపడ్డారు జగన్‌. కానీ… బాబూరావుకు మాత్రం అలాంటిదేం లేకుండానే ఎంపీ సీటు వచ్చి ఒళ్ళో వాలిపోయింది. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ రాలేదని అలిగి కూర్చున్న నాయకుడిని పిలిచి… పైసా ఖర్చు లేకుండా ఎంపీగా రాజ్యసభకు పంపి అందర్నీ ఆశ్చర్యపరిచారు జగన్‌. కానీ… ఎంపీసాబ్‌కు ఇప్పుడా ఆనందం లేదట. ఇంకా చెప్పాలంటే… కుదురుగా తినలేకపోతున్నారు, కంటి నిండా నిద్రపోలేకపోతున్నారన్నది ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. కాస్త కునుకు పట్టినా…. ప్రయారిటీ, ప్రయారిటీ అంటూ కలవరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంతకీ… మేటర్‌ ఏంటంటే… నాకు చాలా అనుభవం ఉంది. రాజ్యసభ సభ్యుడి హోదా ఉంది. కానీ… పార్టీ మాత్రం నా సేవల్ని సరిగా వాడుకోలేకపోతోందన్నది బాబూరావు బాధగా తెలుస్తోంది.

హోదా ప్రకారం ప్రోటోకాల్‌ ఇచ్చి రాష్ట్ర అధికారులు గౌరవిస్తున్నా… పార్టీ వేదికల మీద మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. ఈ ఫ్రస్ట్రేషన్‌ మెల్లిగా పీక్స్‌కు చేరుతూ త్వరలో పార్టీ అధ్యక్షుడు జగన్‌ దగ్గరే పంచాయితీ పెట్టుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. అలాగే… తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వమని అడగాలనుకుంటున్నారట. తనను దెబ్బతీయడంతో పాటు అధిష్టానానికి దూరం చేసేలా కుట్రలు జరుగుతున్నాయన్నది ఎంపీ సాబ్‌ డౌట్‌గా తెలుస్తోంది. గ్రూప్ వన్ ఉద్యోగం నుంచి పొలిటికల్ టర్న్‌ తీసుకున్న బాబూరావు 2009లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరపున పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం మొదలెట్టి…. 2012 బై ఎలక్షన్, 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఫ్యాన్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. సీనియార్టీ, సిన్సియార్టీ ఆధారంగా వైసీపీ హయాంలో మంత్రి పదవి ఆశించిన గొల్లకు భంగపాటు తప్పలేదు. దీంతో ఆయనలో అసంత్రుప్తి బద్ధలవ్వగా… హైకమాండ్ పై చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. కొందరు పార్టీ పెద్దలు తన మంత్రి అవకాశాలకు అడ్డుపడ్డారని, సందర్భం వచ్చినప్పుడు తనలో విప్లవకారుడిని చూస్తారంటూ చేసిన హెచ్చరికలు ఫ్యాన్ పార్టీలో అంతర్గతంగా దుమారం రేపాయి. ఆయన నేరుగా ఎవరి పేర్లు ప్రస్తావించకపోయినా… అప్పటి రీజనల్ కో-ఆర్డినేటర్లు, పార్టీలోని వ్యతిరేక వర్గాన్ని ఉద్దేశించేనన్న చర్చ జరిగింది. 2024 ఎన్నికల సమీపించే నాటికి పాయకరావుపేటలో అంతర్గత రాజకీయాలు అదుపు తప్పి ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూరా వుకు వ్యతిరేకంగా నిరసనలు పుట్టాయి. కొందరు మండల స్ధాయి నాయకులు లీడ్ తీసుకుని చేసిన ఈ ప్రయత్నం కారణంగా కేడర్ అయోమయానికి గురవ్వడంతో హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

టిక్కెట్లు కేటాయించే సమయానికి సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కనబెట్టి పొరుగు జిల్లాకు చెందిన కంబాలజోగులును బరిలోకి దించింది వైసీపీ. ఇది విఫల ప్రయోగంగా మిగిలిపోయింది. అలాగే అంతకు ముందు అనకాపల్లి, అమలాపురం ప్రయోగాలు కూడా వికటించాయి. ఈ పరిణామాల తర్వాత గొల్లబాబూరావు రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపించాయి. కానీ… అదృష్టం ఏ రూపంలో వ‌స్తుందో ఎవ‌రూ ఊహించ‌లేరన్నట్టు రాజ్యసభ సీటు బాబూరావుని వెదుక్కుంటూ వచ్చి ఒళ్ళో వాలిపోయింది. సీనియర్ ఎమ్మెల్యేగా ఇటు ప్రజల్లోనూ… అటు సామాజిక వర్గ ప‌రంగా ఉన్న పేరు…హై కమాండ్ పట్ల విధేయత కలగలిసి ఆయనకు ఛాన్స్‌ దక్కినట్టు చెప్పుకున్నారు. అయితే… ఒక దశలో పార్టీ మారే నేతల లిస్ట్‌లో ఆయన పేరు గురించి కూడా బాగా ప్రచారం జరిగింది. గొల్ల మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించడంతో పాటు తాను నిఖార్సయిన వైసీపీ కార్యకర్తనని ప్రకటించుకున్నారు. అక్కడే అసలు తేడా కొడుతోందట. నేను ఇంత నిబద్ధతగా, పార్టీని అంటిపెట్టుకుని ఉంటుంటే… అధిష్టానం మాత్రం సరిగా పట్టించుకోవడం లేదని, అసలు నేనున్నానని గుర్తించడం లేదంటూ ఫ్రస్ట్రేట్‌ అవుతున్నారట ఎంపీ. మేటర్‌ని డైరెక్ట్‌గా పార్టీ అధ్యక్షుడితోనే తేల్చుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. తనకు గౌరవం, కొడుకు రాజకీయ భవిష్యత్‌కు భరోసా అడుగుతున్న గొల్ల డిమాండ్స్‌ ఏ మేరకు నెరవేరతాయో చూడాలి.

Exit mobile version