OTR : గంటాకు క్లీన్ చిట్ మిషన్.. కలెక్టర్‌కు లేఖ వెనుక అసలు కథ.!

Ganta

Ganta

ఎలక్షన్‌ పాలిటిక్స్‌లో ఓటమి అంటే ఎరుగని ఆ మాజీ….ఇప్పుడు డీప్‌గా హర్ట్‌ అవుతున్నారా? ఎవరో గుడ్డ కాల్చి తన మీద వేస్తున్నట్టు ఫీలవుతున్నారా? అదంతా తన భవిష్యత్‌ అవకాశాన్ని దెబ్బ తీస్తుందని ఫీలవుతున్నారా? అందుకు విరుగుడుగా అగ్ని పరీక్షకు సిద్ధమయ్యారన్నది నిజమేనా? ఎవరా ఎక్స్‌ మినిస్టర్‌? ఏంటి ఆయనకొచ్చిన బాధ? ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోని డిఫరెంట్‌ పొలిటీషియన్స్‌లో ఒకరు గంటా శ్రీనివాసరావు. ప్రతి ఎన్నికలోనూ అయితే నియోజకవర్గమో…లేదంటే పార్టీనో మార్చేయడం ఈయన స్టైల్. సేఫ్ జోన్ పాలిటిక్స్‌ చేయడంలో ఆరితేరిన మాజీ మంత్రి… 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఓటమి అంటే తెలియదు. అనకాపల్లి ఎంపీగా…చోడవరం, అనకాపల్లి, విశాఖ నార్త్ నుంచి ఒక్కొక్కసారి…భీమిలి నుంచి రెండు విడతలు ఎమ్మెల్యేగా గెలిచారాయన. ప్రజారాజ్యం విలీనం కోటాలో తొలిసారి మంత్రి అయిన గంటా….ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో కీలకమైన HRD శాఖను నిర్వహించారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో 7 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారాయన. బలమైన కాపు సామాజిక వర్గం నేత కావడంతో 2012-19మధ్య ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రాధాన్యత బాగా ఎక్కువైంది. పార్టీ, ప్రభుత్వంలోనూ కావాల్సినంత స్వేచ్ఛ లభించడంతో పాటు రాజకీయ వైరాలు కూడా ఎక్కువయ్యాయి. అప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు., గంటా శ్రీనివాస్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తెలుగుదేశం పార్టీని చిక్కుల్లో పడేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో అధినాయకత్వంతో అలకలు, అంటీ ముట్టనట్టు వ్యవహరించడం వంటి పరిణామాలు దూరం పెంచాయి. 2019లో టీడీపీ దారుణమైన ఓటమిని ఎదుర్కొన్న సంద్భంలోనూ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి విజయం సాధించారు గంటా. ఆ తర్వాత అనేక ఊహాగానాలు పెరగడం, అప్పట్లో అసెంబ్లీ సమావేశాలకు సైతం మొక్కుబడిగా హాజరవడం వంటి చర్యలను టీడీపీ అధిష్ఠానం తీవ్రంగానే పరిగణించింది. ఫలితంగా 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో కొద్ది మంది సీనియర్ల టిక్కెట్లు పెండింగ్‌లో పెట్టగా… అందులో గంటా కూడా ఉన్నారు. ఆఖరి నిముషం వరకూ డోలాయమానం తప్పలేదు. చివరి వరకు ప్రయత్నం చేసి తాను కోరుకున్న భీమిలి సీటు దక్కించుకోవడమేగాక రాష్ట్రంలో సెకండ్ హయ్యస్ట్ మెజారిటీ సాధించడం ద్వారా రాష్ట్ర రాజకీయాలు మరోసారి తన వైపు చూసేలా చేసుకున్నారాయన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మినిస్టర్‌ బెర్త్ కన్ఫర్మ్ అని అంతా ఊహించారు.

కానీ, అధిష్ఠానం దగ్గర ఉన్న పాత లెక్కల ముందు కమ్యూనిటీ, కెపాసిటీ వంటి అంశాలు చిన్నబోయాయి. దీంతో గడిచిన రెండేళ్ళ నుంచి ఎమ్మెల్యేగా నియోజకవర్గ రాజకీయాలకే పరిమితం అయ్యరాయన.గతం కంటే ఇటీవల పార్టీ యాక్టివిటీస్ కు ప్రాధాన్యత పెంచినా….మిగిలిన ఎమ్మెల్యేలతో ఆయనకు ఉన్న సంబంధాలు బయటకు కనిపించేంత స్ట్రాంగ్ కాదన్నది జిల్లాలో చెప్పుకునే మాట. ఈ క్రమంలో వచ్చే ఆగస్ట్‌లో కేబినెట్ విస్తరణ ఉంటుందన్న ప్రచారం ఇప్పుడిక్కడ ఆసక్తి రేపుతోంది. కేబినెట్‌ రేస్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేరు చాలా కాలంగా నలుగుతోంది. అయితే… సీనియారిటీ, కమ్యూనిటీ ఆధారంగా పరిశీలించాలని గనుక హైకమాండ్ భావిస్తే… గంటాకు మరోసారి చాన్స్ రావచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో… భీమిలి నియోజకవర్గంలో వెలుగులోకి వస్తున్న వరుస ల్యాండ్ స్కాంలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఇక్కడి బాగోతాలు బయటపడుతుండటంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వీటివల్ల ప్రజల్లోకి సైతం వ్యతిరేక సంకేతాలు వెళ్ళే ప్రమాదం ఏర్పడింది. జిల్లా మొత్తంలో ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉన్న భీమిలి ప్రాంతంలో రేట్లు కూడా పరుగులు తీస్తున్నాయి. భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలన్నీ ఈ నియోజవర్గం కేంద్రంగానే జరుగుతున్నాయి. గూగుల్ వంటి సంస్థలు…ఐటీ., రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంతా ఇక్కడే కేంద్రీకృతం అయింది. అదే సమయంలో తీవ్రమైన ఆరోపణలతో పాటు రెవెన్యూ రికార్డుల వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది భీమిలి నియోజకవర్గం. ఫ్రీ హోల్డ్ భూములు, శొంఠియాం దగ్గర కొండలు, ఎండాడ దగ్గర ఎక్స్ సర్వీస్ మెన్ భూములు…తాజాగా 30 ఎకరాల గయాల్ ల్యాండ్ రికార్డుల తారుమారు ఆరోపణలు….ఒకటి రెండు కాదు అన్నీ వందల కోట్ల డీల్స్ కు సంబంధించిన వ్యవహారాలే. వీటిలో ఎవరి భాగస్వామ్యం ఎంత…? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. వీటితో గంటాకు ప్రత్యక్షంగా సంబంధం ఉందా లేదా అన్న సంగతి పక్కనబెడితే…. ఆయన పేరు వాడుకుని చక్కబెట్టే వాళ్ళ సంగతేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. భీమిలిలో భూ మాయ అనే మాట వింటేనే అందరి చూపు అటు వైపు మళ్ళడం సాధారణమైపోయింది.

మొదట్లో ఇవన్నీ ఆరోపణలంటూ లైట్‌ తీసుకున్న గంటా… ఆ తర్వాత అంతర్గత రాజకీయ ఎత్తుగడల్లో అంతర్భాగమని తెలుసుకున్నట్టు చెబుతున్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు గంటా చుట్టూ తిరిగిన రాజకీయాన్ని ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యేలు క్యాప్చర్ చేశారు. పైగా ఆయన సూచనలు, సలహాలు తీసుకుని ముందుకు వెళ్లే పరిస్థితిలో ఇప్పుడు పార్టీ నాయకత్వం లేదు. దీంతో భీమిలి రాజకీయాలకే పరిమితం అయిన ఈ మాజీమంత్రి…. లోకల్‌ ఎమ్మెల్యే తానే అయినప్పటికీ, జరుగుతున్న ల్యాండ్ డీల్స్ వెనుక రాష్ట్రంలోని చాలా మంది నేతల ప్రమేయం ఉంటుందని, వాళ్ళు సేఫ్ అవుతూ లోకల్‌ ఎమ్మెల్యేగా నా పేరు బద్నాం అవుతోందని ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. ఇది రాజకీయంగా కీలకమైన సమయం అని భావిస్తున్న తరుణంలో ఎవరో చేసిన వ్యవహారాలను తనకు ముడిపెట్టి ప్రచారం చేస్తున్నారంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట ఆయన. ఒకటికి రెండు పోగేసి చేస్తున్న ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే విచారణ జరగాలిసిందేనని భావిస్తున్న మాజీ మంత్రి….ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. స్వయంగా ఫోన్లో మాట్లాడి వాస్తవాలు బహిర్గతం చేయాలని కోరినట్టు తెలిసింది. క్లీన్ చిట్ తీసుకోవడం ద్వారా తనపై వస్తున్న ప్రచారాలకు చెక్ పెట్టడంతో పాటు… రేపు విస్తరణలో కేబినెట్‌ బెర్త్‌ ఛాన్స్‌ దెబ్బతినకుండా చూసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం.