అన్న అడుగేస్తే మాస్….. అన్నట్టు ఆయన వెంచరేస్తే వివాదాస్పదం కావాల్సిందేనా? కుదురుగా ప్లాట్లు వేయడం, పద్ధతిగా అమ్మి సొమ్ము చేసుకుంటే ఆయనకు కిక్కు ఉండదా? వెంచర్ వేసిన దాదాపు ప్రతి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారుతున్నాడా? శాసనసభ్యురాలు అయిన భార్య పేరు, పరపతి గట్టిగా వాడేస్తున్నారంటున్న ఆ రియల్టర్ ఎవరు? ఏంటా వెంచర్ కహానీ? గళ్ళా రామచంద్రరావు, కేరాఫ్ కాంట్రవర్శీ. ఏపీ రియలెస్టేట్ సర్కిల్స్‌లో ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్న మాట ఇది. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గళ్ళా మాధవి భర్త రామచంద్రరావు తన కంపెనీ శ్రీ భ్రమర టౌన్‌షిప్స్ ద్వారా ఏ జిల్లాలో వెంచర్ వేసినా… ఏదో ఒక రచ్చ ఉండాల్సిందేనట. భూములు కొనే సమయంలో రైతులకు చెప్పే మాటల నుంచి ఫైనల్‌గా సదుపాయాల విషయంలో కస్టమర్స్‌కు ఇచ్చే హామీల వరకు ప్రతిచోట ఏదో ఒక వివాదం రేగుతూనే ఉందని చెప్పుకుంటున్నారు. వీటన్నిటికీ మించి స్థానిక శాసనసభ్యులు… అందునా అంతా టీడీపీ వాళ్ళే అయినా…. తీవ్ర వివాదాలు సర్వ సాధారణమైపోయాయని అంటున్నారు. రామచంద్రరావు ఎక్కడ వెంచర్ వేస్తే అక్కడి ఎమ్మెల్యేతో గొడవల గురించి తెలుగుదేశం పార్టీలో కూడా పెద్ద చర్చ జరుగుతోందట. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిడుగురాళ్ళలో వెంచర్ కోసం రైతు కమ్మ వెంకట్రావు నుంచి పొలం కొనుగోలు చేశారు గళ్ళా. అగ్రిమెంట్ రాశాక పూర్తిగా డబ్బులు ఇవ్వకుండానే తన పొలాన్ని స్వాధీనం చేసుకున్నారని, అడిగితే అనుచరులతో కొట్టించారంటూ కోర్టుకు వెళ్లారు ఆ రైతు. తర్వాత పొన్నూరు నియోజకవర్గం నారాకోడూరులో వెంచర్ కోసం పొలం కొనుగోలుకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకు, గళ్లా రామచంద్రరావుకు మధ్య వివాదం రేగిందట.
ల్యాండ్ కన్వర్షన్, రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ అప్పట్లో గుంటూరు జిల్లా రాజకీయ వర్గాలు హాట్ హాట్‌గా మాట్లాడుకున్నాయి. ఇక బాపట్ల జిల్లా లక్ష్మీపురంలో బీచ్ ఫేసింగ్‌తో వెంచర్ వేసింది రామచంద్రరావు కంపెనీ. దాని కోసం తాము పడవలను సముద్రంలోకి తీసుకెళ్ళే సీ మౌత్ కాలువను పూడ్చేశారంటూ మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎమ్మెల్యే మాధవి భర్త అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఈపూరుపాలెం స్ట్రైట్ కట్ డిజైన్ మార్చేశారంటూ మత్స్యకారులు ఆందోళనకు దిగిన వ్యవహారం హైకోర్ట్ వరకు వెళ్ళింది. బాపట్ల వివాదం సద్దుమణిగిందనుకుంటున్న టైంలోనే ఒంగోలులో వేసిన మరో లేఔట్ వివాదాస్పదమైంది. అక్కడ పొలాలకు వెళ్లే పంటకాలువలు పూడ్చేశారంటూ రైతులు ఆందోళన చేశారు. ఇదే ఎపిసోడ్‌లో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు, గళ్ళా రామచంద్రరావుకు మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయట. ఇక తాజాగా మార్కాపురంలో కూడా… స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, రామచంద్రరావు మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. మార్కాపురంలో 91 ఎకరాల్లో భారీ వెంచర్ వేసింది ఎమ్మెల్యే భర్త కంపెనీ. ఇందులో 20 ఎకరాల మునక పట్టా పొలం కూడా ఉంది. ఇది చెరువు పక్కనే ఉంటుంది. దానికి సంబంధించి ప్రస్తుతానికి గొడవ లేకున్నా… వెంచర్ కోసం వేసిన రోడ్డు వివాదాస్పదమైంది. రోడ్డు కోసం రైతుల నుంచి పొలం కొనుగోలు చేశారు. ఆ సమయంలో… తాము పొలాలకు వెళ్లేందుకు దారి ఇస్తామని హామీ ఇచ్చారట.
కానీ…. అందుకు భిన్నంగా… రోడ్డుకు రెండు వైపులా కంచె వేసి గేటు పెట్టారంటూ రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే… అక్కడ ఆందోళనకు దిగి కంచె తొలగించడంతో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకుని ఫెన్సింగ్‌ను పూర్తిగా తొలగించేశారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… టీడీపీ ఎమ్మెల్యే భర్తకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులంతా ఆ పార్టీ మద్దతుదారులేనట. దీంతో ఈ ఆందోళన వెనక స్థానిక శాసనసభ్యుడు కందుల నారాయణరెడ్డి ఉన్నారంటూ నేరుగానే ఆరోపించారు రామచంద్రరావు. ఆ రకంగా… అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్యే భర్త మధ్య వివాదం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. ఇవేకాదు….రామచంద్రరావు గతంలో వేసిన పలు లేఔట్స్ చుట్టూ చాలా వివాదాలు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో అసలు మౌలిక సదుపాయాలు కల్పించలేదంటూ… ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లంతా తరచూ ఆందోళనలకు దిగుతున్నారు. అమ్మే సమయంలో అన్ని హామీలు ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులను కలిసి తమకు న్యాయం చేయమంటూ వినతిపత్రం ఇచ్చారట సదరు బాధితులు. ఇలా రామచంద్రరావు ఎక్కడ వెంచర్ వేసినా అక్కడి స్థానిక ఎమ్మెల్యేలతో… అందునా సొంత పార్టీకే చెందిన వాళ్ళతో విబేధాలు తలెత్తడంపై టీడీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. వ్యాపారం అన్నాక ఏవో కొన్ని సమస్యలు ఉంటాయి…. ఎవరో ఒకరిద్దరితో విభేదాలంటే అర్ధం చేసుకోవచ్చుగానీ….ఇలా అడుగు పెట్టిన ప్రతిచోట గొడవలు ఎందుకు జరుగుతున్నాయంటూ టీడీపీ అధిష్టానం కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, సంబంధం లేకుండా నియోజకవర్గాల్లోని అధికారులకు రామచంద్రరావు నేరుగా ఆదేశాలిస్తున్నారని, ఏ హోదాతో ఆయన ఆ పని చేస్తున్నారంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలే గుర్రుగా ఉన్నారట. అదే సమయంలో కొన్ని చోట్ల లోకల్ ఎమ్మెల్యేలకు రియలెస్టేట్ వ్యాపారాలున్నాయి. పొలిటికల్ సపోర్ట్ చూసుకుని ఈయన ఎక్కడ పడితే అక్కడ అడుగు పెడితే మేం వ్యాపారాలు చేసుకోవద్దా అన్నది వాళ్ల ప్రశ్న. మొత్తంగా రామచంద్రరావు వ్యవహారశైలిపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలంతా కలిసి త్వరలో సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయబోతున్నట్టు సమాచారం.

