OTR : వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా.?

Ycp

Ycp

ఆ మాజీ ఎమ్మెల్యే వ్యవహారం పిలవని పెళ్ళికి వెళ్ళి… టిపినీలు చేశారా? కాపీలు తాగారా…? అంటూ నానా హంగామా చేసే వాళ్లలాగా ఉందా? ఏపీ స్థానిక ఎన్నికల్లో… అడిగిన వాళ్ళకు, అడగని వాళ్లకు ఫోన్లు చేసిమరీ…నా మద్దతు మీకేనని చెబుతున్నారా? కానీ…. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థులకు ఎందుకు అడక్కపోయినా మద్దతిస్తున్నారు? సొంత పార్టీ వాళ్ళను ఎందుకు పట్టించుకోవడం లేదు? సందట్లో సడేమియాలాగా లోకల్‌ ఫ్లేవర్‌తో ఆ గట్టుకు చేరిపోయారా? ఎవరా ఎక్స్‌ ఎమ్మెల్యే? ఏమా కథ? పర్వత పూర్ణచంద్ర ప్రసాద్….. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. ఆ తర్వాత 2024లో ఆయనకు టిక్కెట్‌ నిరాకరించాక అలిగి…. ఫ్యాన్ కింది నుంచి కాస్త పక్కకు జరిగి కూర్చున్నారాయన. అలాగని పూర్తిగా స్విచాఫ్‌ చేయలేదు. ఎటూ కాకుండా, ఏమీ చేయకుండా సోలో సాంగ్స్‌ పాడుకుంటూ ఇన్నాళ్లు టైంపాస్‌ చేశారు మాజీ ఎమ్మెల్యే. ప్రత్తిపాడు నియోజకవర్గంలో సాధారణంగా… పార్టీలతో సంబంధం లేకుండా పర్వత, వరుపుల ఫ్యామిలీలు రాజకీయం చేస్తుంటాయి. ఎమ్మెల్యేలు కూడా ఆయా కుటుంబాల నుంచే ఉంటారు.

అలాంటిది… ఇన్నాళ్లు కామ్‌గా ఉన్న పర్వత ప్రసాద్‌ స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలయ్యాక తాను కూడా యాక్టివిటీ పెంచారు. ఇప్పుడు కూడా జోక్యం చేసుకోకుండా…. ఖాళీగా ఉంటే…. మరీ…. గోళ్లు గిల్లుకుంటున్నానని భావించారో, లేక గత ఎన్నికల్లో తనకు టిక్కెట్‌ ఇవ్వని వైసీపీ అధిష్టానానికి ఝలక్‌ ఇవ్వాలకున్నారోగానీ… ప్రస్తుతం కూటమికి కన్నుగీటుతున్నారు పర్వత. కూటమి భాగస్వామ్య పార్టీలు వేటిలో డైరెక్ట్‌గా చేరలేదుగానీ… నా మద్దతు మీదే అంటూ…. అడిగినా, అడక్కున్నా చెప్పేస్తున్నారట. అక్కడితో ఆగకుండా తనకు తెలిసిన నాయకులు కూటమి అభ్యర్థులుగా బరిలో ఉన్న కొన్ని గ్రామాల్లో ప్రచారం కూడా చేసేస్తున్నారట. సాధారణంగా… ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయి నేత ఏదైనా ఇతర పార్టీకి గాని, అభ్యర్థికిగాని మద్దతు తెలపాలంటే… దానికో స్థాయి, కొన్ని లెక్కలు ఉంటాయి. కనీసం ఒక ఎమ్మెల్యే లేదా జిల్లాకు చెందిన ముఖ్య నేత ఆయన దగ్గరకు వెళ్ళి పార్టీలోకి ఆహ్వానిస్తారు. లేదా మద్దతివ్వమని కోరతారు. అది పద్దతి. కానీ… పర్వత ప్రసాద్‌ విషయంలో అలాంటి ప్రోటోకాల్స్‌ ఏవీ లేవట. లోకల్ లీడర్లు ఒకరిద్దరు అలా ఇన్వాల్వ్ అయిపోవడం, మీకోసమే… ఆ పిలుపు కోసమే నేను ఆవురావురుమంటున్నానన్నట్టుగా…. ఇచ్చేస్తాను రండి, నా మద్దతు మీకే ఇచ్చేశాను పొండి అని అంటున్నారట. ప్రస్తుతం ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా టిడిపి తరఫున వరుపుల సత్యప్రభ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అన్నా మీ మద్దతు కావాలని ఆమె మాట మాత్రంగా అడిగింది లేదుగానీ…మాజీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మాత్రం తెగ అడ్వాన్స్ అయిపోతున్నారట.

తాను లేకపోతే ఏదో జరిగిపోతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. మీకెందుకు నేనున్నాను కదా…. అంటూ గొప్పలు పోతున్నారట. పర్వత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొందరు స్థానిక నేతలు ఆయనతో వివేధించి పసుపు కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఈయనగారి హడావిడితో వాళ్ళంతా ఇబ్బందిగా ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆ నేతలంగా డైరెక్ట్‌గానే కామెంట్‌ చేస్తున్నట్టు సమాచారం. ప్రసాద్ ఎంట్రీ వల్ల మైలేజ్ మైనస్ తప్ప ప్లస్ అయ్యేది ఏమీ ఉండదని గుర్తు చేస్తున్నట్టు తెలిసింది. ఆయన్ని అతిగా ఊహించుకుంటే రిజల్ట్‌లో చూస్తారు కదా అంటూ నిర్మొహమాటంగానే అంటున్నట్టు సమాచారం. మరోవైపు ప్రత్తిపాడు వైసిపి నేతలు మాత్రం… ఈ సరిగమపా…లను జాగ్రత్తగా గమనిస్తూ డూ ఫెస్టివల్‌ అంటున్నారట. ఆయన వల్ల అయ్యేది లేదు, పొయ్యేది లేదనే…మేం పక్కన పెట్టాం. అలాంటి వాళ్ళందరినీ పోగుచేసుకుని మీరు బాగానే రాజకీయాలు చేస్తారులే అంటూ టీడీపీ నేతలను ఉద్దేశించి సెటైర్స్‌ వేస్తున్నారట. మరోవైపు పర్వత ప్రసాద్ మాత్రం…. ప్రభుత్వం ఉంది. రెండేళ్లు పనులు అవుతాయి, వాళ్ళు అవునన్నా, కాదన్నా… ఈ రెండేళ్లు కూటమి వాళ్ళకు దగ్గరగా ఉంటే… తర్వాతి సంగతి తర్వాత చూద్దాంలే అనుకుంటున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో ఏ మూలన ఏముందో అంతా మనకు తెలుసు వాటిని అలా కంటిన్యూ చేసుకుంటే చాలని సన్నిహితులకు చెప్తున్నారట. అటు కూటమి కార్యకర్తలు మాత్రం ఈ కొత్త కలయికల వల్ల మనం ఓడిపోం కదా అంటూ కంగారు పడుతున్నట్టు తెలుస్తోంది. అయినా అంతా వాళ్ళ ఇష్టం. పెద్దోళ్ళకు లేనిది మనకెందుకొచ్చిన తంటా అని వదిలేస్తున్నారట. మొత్తం మీద ప్రస్తుతానికి పొలిటికల్‌గా తాడు- బొంగరం లేని ప్రసాద్ లోకల్ వార్‌లో అలా అడ్వాన్స్ అయ్యారు. పిలవని పేరంటానికి వెళ్తూ…. లోకల్‌ తమ్ముళ్ళకు మై హునా అని భరోసా ఇవ్వడం కాస్త కామెడీగానే ఉందంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. మరోవైపు ఈ పరిణామాలపై టీడీపీ కీలక నేతలు మాత్రం కామ్ గా ఉంటున్నారు… ఏం జరుగుతుందో చూద్దాం… అప్పుడే ఆయనకు మరీ… అంత ప్రయారిటీ అవసరం లేదన్నది వాళ్ల అభిప్రాయంగా తెలుస్తోంది.