Site icon NTV Telugu

Off The Record : కమలం నుంచి తిరిగి కారు వైపు చూస్తున్నారా?

Saidireddy

Saidireddy

ఆ మాజీ ఎమ్మెల్యే మరోసారి పార్టీ మారేందుకు రెడీ అయ్యారా? పెట్టేబేడా సర్దుకుని మంచి ముహూర్తం, తగిన సందర్భం కోసం ఎదురు చూస్తున్నారా? లోక్‌సభ ఎన్నికల టైంలో కారు దిగేసినా…. ఇప్పుడున్న పార్టీలో ఇమడలేకపోతున్నారా? అందుకే పాత గూటికి చేరాలని తహతహలాడిపోతున్నారా? మనిషి ఒకచోట, మనసు మరోచోట అన్నట్టు ఉంటున్నారా? ఎవరా ఎక్స్‌ ఎమ్మెల్యే? ఏమా కథ? హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి పక్క చూపులు చూస్తున్నారన్న వార్తలు ఉమ్మడి నల్గొండ జిల్లా పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. ఆయన కమలం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. స్థానిక బీజేపీలో కుంపట్లకు తోడు, పంచాయితీ ఎన్నికల ఫలితాలు కూడా ఆయన్ను తన పాత పార్టీవైపు చూసేలా చేశాయంటున్నారు. 2018 ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన సైదిరెడ్డి… కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక 2019లో అనూహ్యంగా వచ్చిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో రెండోసారి బీఆర్ఎస్ నుండే పోటీ చేసి భారీ మెజారీటీతో విజయం సాధించారాయన.

ఇక 2023లో అదే హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డికి ఓటమి తప్పలేదు. ఆ తర్వాత కొద్దికాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి…. లోక్‌సభ ఎన్నికలకు ముందు కారు దిగి కాషాయ కండువా కప్పుకున్నారు. మూడు సార్లు పోటీ చేసిన అనుభవమో లేక అగ్రనేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలవల్లోగానీ… పార్టీ మారిన వెంటనే సైదిరెడ్డికి నల్గొండ బీజేపీ ఎంపీ టిక్కెట్‌ దక్కింది. ఓడిపోయినా…. ఇక్కడ అంతకు ముందు పోటీ చేసిన బీజేపీ అభ్యర్దులకంటే మెరుగైన ఓట్లు సాధించినట్టు మాత్రం చెప్పుకున్నారు. ఇక ఆ తర్వాత కూడా… బీజేపీ నేతగా పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం అప్పజెప్పిన అన్ని కార్యక్రమాలను కాదనకుండా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు. అదంతా ఒక ఎత్తయితే… ఇటీవలి కాలంలో…బీజేపీ కార్యక్రమాలకు హాజరవుతూనే గతంలో తన వెంట నడిచి గెలిపించిన పాత కేడర్‌కు టచ్‌లోకి వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది. కేవలం టచ్‌లోకి వెళ్ళడంతో సరిపెట్టకుండా…. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళ గెలుపునకు తనవంతు సహాయ సహాకారాలు అందించారట.

సైదిరెడ్డి సహకారం తీసుకున్న వాళ్లు విజయం సాధించడం, వాళ్ళంతా బీఆర్‌ఎస్‌ నాయకులు కావడంతో…. ఈ మాజీ ఎమ్మెల్యే తిరిగి గులాబీ గూటికి చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. సైదిరెడ్డి కారు దిగి బీజేపీలోకి వెళ్లినా… బీఆర్‌ఎస్‌ హుజూర్ నగర్‌లో పూర్తి స్థాయి ఇన్ఛార్జ్‌ బాధ్యతలు ఎవరికీ ఇవ్వలేదు. దాంతో చాలామంది నియోజకవర్గ గులాబీ నాయకులు ఆయనకు అప్పట్నుంచి ఇప్పటి వరకు టచ్‌లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే… అలాంటి చాలామందికి పంచాయతీ ఎన్నికల్లో సైదిరెడ్డి సహకరించడం, వాళ్ళు గెలవడంతో…. ఇక పార్టీ మార్పు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. పంచాయతీ ఎన్నికలకు పార్టీ సింబల్‌తో సంబంధం లేకపోవడం, భీఫామ్స్‌తో పని లేకపోవడంతో… తన అనుకున్నవాళ్ళందరికీ బీఆర్‌ఎస్‌లో ఉన్నాసరే… మాజీ ఎమ్మెల్యే సహకరించారన్నది లోకల్‌ టాక్‌. ఇక ఇదే సమయంలో మరో వాదన సైతం తెర మీదికి వచ్చింది. కొంతమందికి సహకారం అందించినంత మాత్రాన ఆయన పార్టీ మారతారా? అది తన సొంత క్యాడర్‌ను పెంచుకునే ప్రయత్నం కూడా అయి ఉండవచ్చుకదా అనే వాళ్ళు సైతం ఉన్నారు. అయితే ఇటీవల వచ్చిన పదవులు, బాధ్యతలు, కొందరు నేతల దూకుడు, మరికొందరితో విభేదాల్లాంటి రకరకాల కారణాలతో ఆయన కమలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. అటు గులాబీ నేతలతో టచ్‌లో ఉండటం, లోకల్ బీజేపీ నాయకులతో టచ్‌ మీ నాట్‌ అనడాన్ని చూస్తుంటే మాత్రం సైదిరెడ్డి పార్టీ మారడానికి మానసికంగా సిద్ధమైపోయినట్టు కనిపిస్తోందని రెండు పార్టీల్లో మాట్లాడుకుంటున్నారు. తన గురించి ఇంత చర్చ, రచ్చ జరుగుతున్నా మాజీ ఎమ్మెల్యే మాత్రం స్పందించకపోవడాన్ని చూస్తుంటే…. మౌనం అర్ధాంగీకారంగా భావించాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు కొందరు. ఇదే సమయంలో మరో మాట కూడా వినిపిస్తోంది. సైదిరెడ్డి పార్టీ మారే ముచ్చట సరేగానీ…. బయటికి వెళ్ళేటప్పుడు బీఆర్‌ఎస్‌ అధినేత మీద, జిల్లాకు చెందిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపైనా…. చేసిన విమర్శలు, ఆరోపణల సంగతేంటన్నది కొందరి క్వశ్చన్‌. మొత్తం మీద పార్టీ మార్పు ప్రచారంపై శానంపూడి సైలెంట్‌గా ఉన్నా…. ఆయన చుట్టూ మాత్రం రకరకాల చర్చలు, విశ్లేషణలు నడుస్తున్నాయి.

Exit mobile version