స్థానిక ఎన్నికల వేళ ఆ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైపోయారా? పార్టీ పెద్దలు కూడా… కమ్ కమ్ వెల్కమ్ అంటున్నా లోకల్ ఈక్వేషన్స్ మాత్రం రివర్స్ అవుతున్నాయా? సీఎంతో ఉన్న సాన్నిహిత్యం ఫైనల్‌గా ఆ లీడర్‌కి కలిసొస్తుందా? లేక అడ్డంకి అవుతుందా? ఎవరా మాజీ శాసనసభ్యుడు? ఏంటా జంపింగ్ జపాంగ్ కహానీ? మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజక వర్గం నుంచి టీడీపీ తరపున మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు ఎర్రశేఖర్. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉండీ లేనట్టుగా ఉన్న శేఖర్… ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం ఉన్న శేఖర్… అప్పట్లో జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. తర్వాత తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాల కారణంగా బీజేపీలో చేరిన శేఖర్… 2020 జులైలో నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల లేదా నారాయణ పేట టికెట్ ఆశించి భంగపడి, అలిగి కారు పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారడమైతే మారారుగానీ… వ్యవహారాలతో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారట. ఈ క్రమంలో… ఇటీవలే ముఖ్య మంత్రి రేవంత్‌కు టచ్ లోకి వెళ్లినట్టు ఆయన సన్నిహిత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లాలో బలమైన సామాజిక వర్గమైన ముదిరాజ్‌లలో ఎర్ర శేఖర్‌కు మంచి పట్టుండటం, మాస్ లీడర్‌గా ఉన్న గుర్తింపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు కలిసి వస్తాయని భావిస్తున్నారట హస్తం పార్టీ పెద్దలు.
మహబూబ్ నగర్ జిల్లాలోని మూడుకు మూడు నియోజకవర్గాల్లో రెడ్డి ఎమ్మెల్యేలే ఉండటం, కాంగ్రెస్ పార్టీ బీసీ వాదాన్ని ఎత్తుకొని ముందుకు పోతున్న తరుణంలో ఆ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడానికి ఎర్ర శేఖర్ ఎంట్రీ బలమైన సామాజిక వర్గం కలిసి వస్తాయని లెక్కలేసుకుంటున్నట్టు తెలిసింది. అందుకే సీఎంతోపాటు కాంగ్రెస్ ఇతర ముఖ్య నేతలు కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో… ఈసారి మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఆ పోస్ట్‌ను ఎర్ర శేఖర్ భార్యకు ప్రతిపాదించే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ అది కుదరకుంటే… ఆయనకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఏదన్నా ఇచ్చి…పార్టీలో చేర్చుకునే ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌లోకి ఎర్ర శేఖర్ రీ ఎంట్రీపై జడ్చర్ల నియోజకవర్గంతోపాటు… మహబూబ్ నగర్‌కు చెందిన నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీని వీడి… తిరిగి ఇప్పుడు చేరడమనేది ఆయన అధికార కేంద్రానికి దగ్గరవడమే తప్ప మరొకటి కాదంటున్నారు. ఇక ఇదే సమయంలో ఆయన చేరికతో పార్టీకి జరిగే మేలు కంటే , పార్టీవల్ల ఆయనకే ఎక్కువ లాభమని కొందరు విశ్లేషిస్తున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు చాన్నాళ్ళుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తూ… ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేశారని, ఇప్పుడు వాళ్ళందర్నీ పక్కకుతోసి ఎర్ర శేఖర్ ను తెరపైకి తీసుకురావడం వల్ల పెద్దగా ఒరిగేదేం లేదనే వాదన సైతం ఉంది. మొత్తం మీద బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇస్తామంటున్న కాంగ్రెస్‌లో ఆ ఫ్లేవర్ నింపేందుకు ఆ పార్టీ పెద్దలు కృషి చేయడం, లోకల్ పొలిటికల్ ఈక్వేషన్స్ అందుకు అడ్డుపడటం ఆసక్తి రేపుతోంది.
