Site icon NTV Telugu

Off The Record : ఈ-కార్ రేసింగ్ కేసులో ఆ ఐఏఎస్ ని విచారించకుండా అడ్డుపడుతోందెవరు?

Car

Car

సంచలనం రేపుతున్న కేసులో ఆ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిని విచారించకుండా తెలంగాణ ప్రభుత్వానికి అడ్డుపడుతున్నదెవరు? కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా ఎందుకు మోకాలడ్డుతున్నారు? కేంద్రం అనుమతి ఆలస్యం అవుతోందని సాక్షాత్తు సీఎం అనడంలో ఆంతర్యం ఏంటి? ఏ ఆఫీసర్‌ విషయంలో అలా జరుగుతోంది? అసలు దర్యాప్తు ముందుకు వెళ్తుందా? లేదా? ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కోసం అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులు విడుదల చేశారనే అభియోగం మీద తెలంగాణ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. దీంతో… ఐఎఎస్‌ కాబట్టి ఆయన మీద చర్యలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ …. డీవోపిటీకి లేఖ రాశారు చీఫ్‌​ సెక్రటరీ రామకృష్ణారావు. అక్కడి నుంచి అనుమతి వస్తేనే… ఆయన విచారణ కోసం ఏసీబీకి ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ… ఇప్పటి వరకు అట్నుంచి నో రియాక్షన్‌.

ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు ఇటీవల గవర్నర్ అనుమతించారు. ఈ క్రమంలో.. దూకుడు పెంచాలనుకుంటున్న తెలంగాణ ఏసీబీ.. అరవింద్‌ కుమార్‌ విషయంలో డీవోపీటీ గ్రీన్‌ సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తూనే ఉంది. అసలు తప్పు జరిగిందా లేదా అన్న విషయంలో ఒక అధికారిగా అరవింద్‌ను ఇప్పటికే ప్రాధమికంగా ప్రశ్నించి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసింది ఏసీబీ. కానీ… డీవోపీటీ ఓకే చెబితేనే… పూర్తి స్థాయి విచారణ సాధ్యపడుతుంది. ఈ పరిస్థితుల్లో… ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని, ఈ కేసులో ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు అనుమతి రావాల్సి ఉందని అన్నారాయన. పర్మిషన్‌ కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీవోపీటీకి రెండు సార్లు లేఖ రాశామని అక్కడి నుంచి అనుమతి రాగానే చర్యలు ఉంటాయన్నారు. ఈ కేసులో కేటీఆర్ వరకు అనుమతులు వచ్చాయని.. ప్రొసీజర్ ఫాలో అవ్వాలనేదే తమ పాలసీ అని కూడా అన్నారు సీఎం.

అయితే ప్రొసీజర్ ప్రకారం అరవింద్‌కుమార్‌ విషయంలో అనుమతులు ఎప్పటికి వస్తాయన్న విషయంలో క్లారిటీ లేదు. అసలు ఎక్కడ ఆగుతోందో కూడా అర్ధం కావడంలేదన్న చర్చ జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో. అదే సమయంలో డీఓపీటీలో అరవింద్ కుమార్ బ్యాచ్ మేట్స్ ఉన్నారని, కేసు దర్యాప్తునకు అనుమతి ఇవ్వడంలో వాళ్ళే తాత్సారం చేస్తున్నారనే గుసగుసలు సెక్రటేరియట్‌లో వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ కేసు దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని అనుమతులు కేంద్రం వెంటనే ఇచ్చేస్తుందని కాంగ్రెస్ నేతలు భావించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయే స్వయంగా డీఓపీటీని పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్ రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చాలా సందర్భాల్లో అన్నారు బండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేరుగా విచారణకు హాజరై తన దగ్గర ఉన్న ఆధారాలను, వివరాలను అప్పగించారు కేంద్ర మంత్రి. దీంతో… ఈ కార్‌ రేస్‌ గురించి కూడా ఆయనకు పూర్తిగా తెలుసు కాబట్టి… అవసరమైన అన్ని చర్యలు బండి సంజయ్ తీసుకుంటారని భావించారు కాంగ్రెస్‌ లీడర్స్‌. కానీ… ఆయన పర్యవేక్షణలోనే ఉన్న విభాగం సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ పై చర్యలకు అనుమతి ఇవ్వక పోవడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు ఎక్కువ మంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రాజకీయ నిర్ణయాలకు బ్యూరోక్రాట్స్ ఎలా బాధ్యులు అవుతారని ప్రశ్నిస్తున్నారు కొందరు ఐఏఎస్‌లు. రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో తీసుకున్న నిర్ణయాలకు ఆఫీసర్స్‌ని బలి చేయొద్దన్నది వాళ్ళ వాదన. ఆ సంగతి ఎలా ఉన్నా… ఈ కేసులో మాత్రం డీఓపీటీలో ఉన్న అరవింద్ కుమార్ సన్నిహితుల వల్లే అనుమతులు ఆలస్యం అవుతున్నాయన్న చర్చ జరుగుతోంది. అరవింద్‌ విషయంలో డీఓపీటీ అనుమతి వస్తే… కేటీఆర్‌ని, ఆయన్ని కలిపి ఓకేసారి విచారించే అవకాశం ఉందట.
అలా విచారణ చేశార ఇద్దరి అరెస్ట్‌లు ఉంటాయన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి రాజకీయవర్గాల్లో.

Exit mobile version