Site icon NTV Telugu

Off The Record : స్థానిక ఎన్నికల టైంలో లెఫ్ట్ వైఖరిపై చర్చ.. కారణం ఏంటంటే..?

Cpi

Cpi

సీట్ల వేటలో సిద్ధాంతాలు మరుగునపడిపోయాయా? చావో రేవో ఒకరితోనే… అనే స్థాయి నుంచి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళవైపేనంటూ ఎదురు చూసే స్థాయికి వాళ్ళ రాజకీయం దిగజారిపోయిందా? అది కూడా… ఒకే రకమైన ఎన్నికల్లో… ఒకేటైంలో మండలానికో పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఎలా చూడాలి? ఏమని పిలవాలి? ఎక్కడ జరుగుతోందా తంతు? ఏ పార్టీ చేస్తోందా పని? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు కమ్యూనిస్ట్‌ పార్టీలదే హవా. జిల్లా వరకు వాళ్ళ మాటే శాసనంగా నడిచేది. అవి జాతీయ పార్టీలైనా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళయినా… ఎర్రన్నలు తానా అంటే తందానా అనేవాళ్ళు. ఎన్నికల పొత్తులో కూడా వాళ్ళు కోరుకున్న సీట్లు ఇచ్చేవాళ్ళు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే…ఈ జిల్లా వరకు లెఫ్ట్‌ పార్టీలు ఇచ్చే పొజిషన్‌లో, మిగతా వాళ్ళు తీసుకునే స్థితిలో ఉండేవాళ్ళు. కానీ… కాలం మారిపోయింది. పరిస్థితులు తిరగబడ్డాయ్‌. జెండాల్లో ఎరుపు తప్ప… ఎవరి మీదా కన్నెర్రజేసి సీట్లు డిమాండ్‌ చేసే స్థితిలో లేకుండా పోయాయ్‌ ఆ పార్టీలు. పొత్తు కోసం ఎవరు పిలుస్తారా..? ఏ సీటు విదిలిస్తారా అనే దైన్యంలోకి వెళ్ళిపోయారు కామ్రేడ్స్‌. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సంగతి తర్వాత… చివరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పొత్తు లేకుండా సొంతగా పోటీ చేయలేని స్థితికి వెళ్ళిపోయాయట లెఫ్ట్‌ పార్టీలు. ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి నడుస్తున్న టైంలో ఈ పార్టీల వైఖరి మరోసారి చర్చనీయాంశం అవుతోంది.

సీపీఐ ఇప్పటికే ఒక స్టాండ్‌ తీసేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి అడుగులేశాం కాబట్టి… ఇప్పుడు కూడా హస్తంలో హస్తం వేసేందుకు సిద్ధమైంది. ఆ దిశగా… రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి అంతవరకు క్లియర్‌. కానీ…
ఎటొచ్చీ…. సీపీఎం పరిస్థితే క్రాస్‌రోడ్స్‌లో ఉందట. అలా ఉండటమే కాదు… ఎవరు పిలిస్తే వాళ్ళ వెంట నడుస్తాం, ఎక్కడ ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తే… వాళ్ళ వెంట నడుస్తాం, మాకు ఆ పార్టీ ఈ పార్టీ అన్న భేదాల్లేవన్నట్టు వ్యవహారం ఉండటంపై రాజకీయవర్గాల్లో గట్టి చర్చే జరుగుతోంది. వాళ్ళు మరీ ఇంతలా దిగజారిపోయారా అంటూ…గుసగుసలాడేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన సీపీఎం ఒక్కటంటే ఒక్క సీటులో కూడా గెలవలేకపోయింది. గెలుపు సంగతి తర్వాత కనీస ప్రభావం కూడా చూపలేకపోయిందన్నది ఎక్కువ మంది మాట. అయితే… అప్పట్లో వాళ్ళకు బీఆర్‌ఎస్‌తో మంచి అనుబంధం ఉందన్న ప్రచారం జరిగింది. కానీ… ఇప్పుడు స్థానిక ఎన్నికలకు వచ్చేసరికి సుత్తీ కొడవలి స్టాండ్‌ మారిందని అంటున్నారు. మాకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సమానమే. అందుకే రెండు పార్టీలతో చర్చలు జరుపుతున్నామని అంటోందట పార్టీ నాయకత్వం. ఆ రెండు పార్టీల్లో ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్ళ వెంబడి నడవడానికి సిద్ధమైపోయినట్టు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

అయితే… మొత్తం జిల్లా యూనిట్‌గా కాకుండా… ఎక్కడికక్కడ ఏ మండలంలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు ఇస్తే అక్కడ ఆ పార్టీతో కలిసి నడుస్తామనడం చర్చనీయాంశం అవుతోంది. అంటే… సీపీఎం ఏకకాలంలో, ఒకే రకమైన ఎన్నికలో రెండు భిన్నమైన నేపధ్యాలున్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా? కామ్రేడ్స్‌ మరీ ఆ స్థాయికి దిగజారిపోయారా అని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. పైగా ఈ వైఖరివల్ల… ఇప్పటికే ఒక స్టాండ్‌ తీసుకున్న సాటి కామ్రేడ్స్‌ సీపీఐకి ఇబ్బందులు వస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని ఒక మండలంలో రాత్రికి రాత్రి సీపీఎం, కాంగ్రెస్‌ మధ్య ఒప్పందం కుదిరి ఆగిపోయింది. వెంటనే అదే మండలంలో సిపిఐ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం జరిగింది. ఇక పాలేరు, మధిర నియోజకవర్గాల్లోని మెజారిటీ మండలాల్లో సీపీఎం, బీఆర్‌ఎస్‌ మధ్య సర్దుబాటు కుదిరింది. ఇటు ఖమ్మం నియోజకవర్గానికి వచ్చేసరికి సీపీఐ, సీపీఎం రెండూ కలిసి కాంగ్రెస్‌తో అలయెన్స్ కుదుర్చుకున్నట్టు సమాచారం.

ఇల్లెందులో కూడా ఇదే పరిస్థితి ఉందట. అక్కడ సీపీఎం కాంగ్రెస్‌తో వెళ్ళే దిశగా చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. అలా… జిల్లాలో తనపట్టు నిలుపుకోవడానికి సీపీఎం ఎవరితోనైనా సై అనడం చర్చనీయాంశం అవుతోంది. సిద్ధాంతాలకంటే సీట్లు ముఖ్యమన్నట్టుగా సుత్తీకొడవలి పార్టీ అడులేయడం వాళ్ళ తాజా స్థతిని తెలియజేస్తోందని అంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్‌తోనే కలిసి అంటూ సీపీఐ ఒక స్టాండ్‌కు కట్టుబడి ఉండగా… సీపీఎం మాత్రం ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్ళతోనే అనడం కాస్త ఎబ్బెట్టుగానే ఉందన్నది పొలిటికల్‌ వాయిస్‌.

 

Exit mobile version