రెండు జాతీయ పార్టీలను అక్కడ పతంగి కలవర పెడుతోందా? గాలి వాటం ఎలా ఉంటుందో, ఎటువైపు ఎగిరి చైనా మాంజాలా ఎవరి గొంతుకు గాటు పడుతుందోనని ఇతర పార్టీలు కంగారు పడుతున్నాయా? ఎంఐఎం కింగ్ అవుతుందా? కింగ్ మేకర్‌గా మిగులుతుందా? ఎక్కడ ఉందా పరిస్థితి? అక్కడున్న ప్రత్యేక రాజకీయ వాతావరణం ఏంటి? తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకమే అయినా…. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంకాస్త ఎక్కువ అన్నట్టు మారిపోయిందట వ్యవహారం. అందుకు కారణాలు కూడా ప్రత్యేకంగానే ఉన్నాయంటున్నారు. నిజామాబాద్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండగా…. మధ్యలో మజ్లిస్ పార్టీ కీలకంగా మారింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం తన ఆధిక్యాన్ని చాటుకుంటోంది. ఈ క్రమంలోనే… నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోథన్, ఆర్మూర్ మున్సిపాలిటీల్లో కూడా కింగ్ మేకర్ అవ్వాలని ఉవ్విళ్ళూరుతోందట పతంగి పార్టీ.
సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఇటీవల ఆ పార్టీ ఊహించని విధంగా సీట్లు గెలుచుకుంది. నాందేడ్, అమరావతి, శంభాజీనగర్, అకోలా, జాల్నా, మాలేగావ్, షోలాపూర్ మున్సిపాలిటీల్లో కింగ్ మేకర్ అయ్యింది ఎంఐఎం. అదే స్పూర్తితో.. ఇప్పుడు నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్ లోనూ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునేలా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. నిజామాబాద్‌లో అయితే…. మేయర్ పీఠం లక్ష్యంగా పావులు కదుపుతున్నా…. డిప్యూటీ మేయర్ మాత్రం పక్కా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో పతంగి పార్టీ ప్రాబల్యం పెరిగినట్టు అంచనా వేస్తున్నారు.
నిజామాబాద్ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉండగా…. గత ఎన్నికల్లో 16 చోట్ల గెలిచి రెండో అతి పెద్ద పార్టీగా అవతరించి డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకుంది. అందుకే ఈసారి కనీసం 20 సీట్లలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు తమ ప్రాబల్యం పెరిగిందన్నది ఎంఐఎం పెద్దల లెక్క. దీంతో… ఈ సారి కూడా కింగ్ మేకర్ కావచ్చన్న అభిప్రాయం బలపడుతోంది. అయితే… ఇక్కడే మరో విశ్లేషణ కూడా తెర మీదికి వస్తోంది. గతంలో అంటే కాంగ్రెస్ బలహీనంగా ఉందని, కానీ… ఇప్పుడు అధికారంలో ఉన్నందున ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని, ముస్లిం మైనార్టీ డివిజన్స్‌పై కాంగ్రెస్ గట్టిగా ఫోకస్ పెడితే ఎంఐఎం ఓట్ బ్యాంక్‌కు గండిపడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు కొందరు. అటు బోధన్ మున్సిపాలిటీలోనూ ఆ పార్టీ ప్రభావం ఉంది. ఇక్కడ 38 డివిజన్లకు గాను.. 16చోట్ల ఎంఐఎం కీలకంగా ఉంది. గత ఎన్నికల్లో 11 డివిజన్స్‌ను గెలుచుకుంది. ఈ సారి మరిన్ని వార్డులు గెలుచుకుని ఇక్కడ కూడా చక్రం తిప్పాలనుకుంటున్నట్టు సమాచారం. ఇక ఆర్మూర్ మున్సిపాలిటీలోనూ ఎంఐఎం ప్రాబల్యం పెంచుకుందట.
36 వార్డులకుగాను గతంలో ఒకటి గెలుచుకోగా.. ఈ సారి రెండంకెల స్థానాలపై గురి పెట్టినట్టు తెలిసింది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల విజయంతో.. ఎంఐఎం నేతల్లో జోష్ పెరిగడం ఇక్కడ ప్లస్ కావచ్చంటున్నారు. అక్కడి ఫలితాల ఎఫెక్ట్ …. సరిహద్దులో ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మీద ఉంటుందని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. అదే సమయంలో…. కాంగ్రెస్ పార్టీ మాత్రం పట్టు కోల్పోకుండా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కింగ్ మేకర్ ఎవరైనా కావచ్చుగానీ… కింగ్ సీటు మాత్రం మాదేనన్నది కాంగ్రెస్ నేతల ధీమా. అదే సమయంలో ఎంఐఎం ఎంత బలపడ్డా కింగ్ మేకర్ వరకు అవగలదుగానీ…. మేయర్ సీట్లో మాత్రం కూర్చోలేదన్నది కొందరు కాంగ్రెస్ నాయకుల మాట. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ఇంట్రస్టింగ్‌గా మారబోతున్నాయి.
