ఇప్పుడు జూబ్లీహిల్స్ పరుగులో ఉన్న నాయకులు ఎవరు? కాంగ్రెస్ బీసీ వ్యక్తిని బరిలోకి దించుతుందా? లేదంటే అగ్రవర్ణాలకే టికెట్ కేటాయిస్తుందా? మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లిహిల్స్‌లో బై ఎలక్షన్ అనివార్యమైంది. త్వరలో ఎన్నికకు నోటీఫికేషన్ వెలువడనుంది. హైదరాబాద్‌లో ఒక్క కంటోన్మెంట్ మినహా…మరే నియోజకవర్గంలో అధికారికంగా కాంగ్రెస్ జెండా లేదు. దీంతో సంపన్నుల నియోజకవర్గంగా చెప్పుకునే…జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఆయన నివాసం కూడా ఈ నియోజకవర్గంలో ఉండటంతో…నెల రోజుల నుంచి జూబ్లీహిల్స్‌పై దృష్టి పెట్టారు. ఇక్కడ ఎంఐఎం బరిలోకి దిగితే…మైనార్టీ ఓట్లు చీలిపోతాయని భావించారు రేవంత్. ఆ పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని మచ్చిక చేసుకున్నారు. దీంతో జూబ్లీహిల్స్‌లో దారుస్సలాం పార్టీ పోటీ చేసే ఛాన్స్ లేదు. వ్యూహాత్మకంగా అజరుద్దీన్‌ను తప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది అభ్యర్థి. అదే ఎవరనే చర్చ పార్టీతో పాటు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు అజరుద్దీన్ భావిస్తే…ఆయన ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. దీంతో ఇపుడు రేసులో ఎవరెవరు ఉన్నారనే చర్చ నడుస్తోంది.
అభ్యర్ది విషయంలో రేవంత్ సర్‌ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అజర్ రేసు నుంచి తప్పుకుంటే సహజంగా నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు అయిన నవీన్ యాదవ్…2014లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచాడు. నవీన్ యాదవ్‌తో పాటు జీహెచ్‌ఎంసిలోని 102 డివిజన్…రహమత్‌నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో జంప్ అయిన తొలి కార్పొరేటర్ కూడా సీఎన్ రెడ్డినే. రేవంత్ కోటరీతో అంటకాగుతున్న సీఎన్‌రెడ్డి పేరును…జత చేసి సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఇక మాజీ మేయర్ బొంతు రాంమోహన్ తెరపైకి వచ్చాడు. గత ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని భావించాడు. దానం పోటీచేయడంతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు అందివచ్చిన జూబ్లిహిల్స్ నుంచి పోటీకి రెడీ అయ్యాడు. బీసీ జపం చేస్తున్న కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని రంగంలోకి దించుతుందా ? లేదంటే అగ్రవర్ణాల అభ్యర్దిని రంగంలో దించుతుందా చూడాలి. మైనార్టీ ఓట్లు అధికంగా ఈ నియోజకవర్గంలో రేవంత్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం ప్రభావితం చూపే నియోజకవర్గం కావడంతో…ఆచితూచి వ్యవహరించాలని పార్టీ భావిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పార్టీ పరిశీలిస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో మరోసారి సర్వే చేయాలని నిర్ణయించుకుంది. రేసులో ఉన్న ఇద్దరు కంటే మెరుగైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది.
