Site icon NTV Telugu

Off The Record : బీసీ బంద్‎కు అన్ని పార్టీల సహకారం..అంతా సహకరిస్తే బిల్లు అడ్డుకుంటున్నదెవరు ?

Congress Otr

Congress Otr

బీసీ రిజర్వేషన్ల ఎపిసోడ్‌లో కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తందా..? ఎవర్ని ఇరుకున పెట్టాలనుకున్నామో వాళ్ళని పెట్టేశామని భావిస్తోందా? బంద్‌ తర్వాత తెర మీదికి వచ్చిన లెక్కలేంటి? బీసీల ముందు ఎవర్ని దోషిగా నిలబెట్టాలనుకుంది కాంగ్రెస్‌ పార్టీ? ఆ విషయంలో సక్సెస్ అయిందా? తెలంగాణ రాజకీయం మొత్తం ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల చుట్టే తిరుగుతోంది. ఇవాళ నిర్వహించిన బీసీ సంఘాల రాష్ట్ర బంద్‌కు అన్ని పార్టీలు సహకరించాయి. దీంతో… ఇక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలైంది. అంతా శాఖాహారులేగానీ… బుట్టలో రొయ్యలు మాత్రం మాయమయ్యాయన్న సామెతను గుర్తు చేసుకుంటున్నారు జనం. బీసీలు కోరుకుంటున్న రిజర్వేషన్‌ను అన్ని పార్టీలు సమర్ధిస్తుంటే… సమస్య ఎక్కడుంది? ఆపింది ఎవరు? బీసీ బంద్‌, ధర్నాల్లో పాల్గొనడం వెనక రాజకీయ పార్టీల వ్యూహం ఏంటన్న చర్చలు నడుస్తున్నాయి. ఈ విషయంలో మొదట్నుంచి సీరియస్‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేసేసింది. సర్వే నిర్వహించడం, దానికి అనుగుణంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, దాన్ని గవర్నర్‌కు పంపించడం లాంటివన్నీ నిర్ణీత కాలం ప్రకారం చక చక పూర్తయ్యాయి. కానీ… ఆ తర్వాతే అసలు సమస్య మొదలైందట. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉంది. దానికి సంబంధించి ఇటు గవర్నర్ నుంచి కానీ… అటు రాష్ట్రపతి నుంచి గానీ… ఎలాంటి రియాక్షన్‌ లేదు. బిల్లును ఆమోదించామనిగాని, వ్యతిరేకించామనిగానీ ఎలాంటి సమాచారం లేదు. కేంద్రానికి పంపించిన ప్రతిపాదనలు కూడా అలాగే ఉండిపోయాయి. ఈ పరిస్థితుల్లో…స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నంబర్‌ 9ని తీసుకువచ్చింది. దాన్ని కొందరు కోర్టులో సవాల్ చేయడంతో బ్రేకులు పడ్డాయి. ఇక ఆ తర్వాతి నుంచి కథ మరో మలుపు తిరిగింది.

తెలంగాణ బంద్‌లో అన్ని పార్టీలు పాల్గొని రిజర్వేషన్‌ను మేం వ్యతిరేకం కాదని చెప్పకనే చెప్పాయి. ఇక్కడ ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన కసరత్తుని పూర్తి చేసేశామన్న ఇండికేషన్ ఈ బంద్‌ ద్వారా గ్రామ స్థాయి వరకు వెళ్ళిందని, దాని మీద చర్చ జరుగుతోందన్నది ప్రభుత్వ పెద్దల అభిప్రాయంగా తెలుస్తోంది. చైతన్యవంతులైన బీసీ వర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందేంటి..? చేసిందేంటి..? పరిధి ఎంతవరకు, ప్రభుత్వం పంపిన బిల్లులు ఎక్కడ పెండింగ్‌లో ఉన్నాయన్న పాయింట్స్‌ మీద చర్చ జరుగుతోందని, దాంతో మేం సేఫ్‌జోన్‌ ఉన్నామన్న క్లారిటీకి కాంగ్రెస్‌ వచ్చిందట. ఇదే సందర్భంలో… గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఎదుర్కొన్న ఒక ఇబ్బందికర పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటున్నారు కాంగ్రెస్‌ లీడర్స్‌. అప్పట్లో అధికారంలో ఉన్న ఆనాటి కాంగ్రెస్ ఎంపీలకు నిరసన సెగలతో ఇబ్బంది వచ్చిందని, అప్పుడు వాళ్ళు కూడా ఉద్యమంలోకి వచ్చేశారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ విషయంలో కూడా బిల్లులు ఆగింది ఎక్కడ? అందుకు అడ్డుగా ఉన్నదెవరన్న విషయంలో ప్రజలకు క్లారిటీ వస్తే…ఇప్పుడు బీజేపీ ఎంపీలకు కూడా అలాంటి ఇబ్బందే వస్తుందని, వాళ్ళే డిఫెన్స్‌లో పడతారని లెక్కలేస్తున్నారట కాంగ్రెస్‌ లీడర్స్‌.

 

బిల్లును కేంద్రంలో పెండింగ్‌ పెట్టడం, ఇక్కడ మాత్రం బీజేపీ ఎంపీలు ధర్నా చేయడాన్ని అప్పటి పరిస్థితులతో పోల్చి అడ్వాంటేజ్‌ లెక్కలేసుకుంటోందట కాంగ్రెస్‌. ప్రస్తుతానికి…. కలిసి వచ్చే అన్ని పార్టీలకు ఓకే చెప్పాలని బీసీ సంఘాలు డిసైడ్ అయ్యాయి కాబట్టి ఇలా నడుస్తోంది. కానీ… రేపు ఉద్యమం తీవ్రరూపం దాల్చి.. రాజకీయంగా ఎక్కడ అడ్డు తగులుతోందో అక్కడే ఫోకస్‌ పెట్టాలని డిసైడైన రోజున ఆటోమేటిక్‌గా బీజేపీ ఇరుకున పడుతుందన్నది గాంధీభవన్‌ లెక్క. కోర్టుల్లో పోరాటాన్ని కూడా తాము సీరియస్‌గా తీసుకుంటున్నామన్న విషయం సంఘాలకు అర్ధమైంది కాబట్టి…కాషాయ పార్టీని ఇరుకున పెట్టడంలో సక్సెస్‌ అయ్యామని భావిస్తున్నారట కాంగ్రెస్‌ నేతలు. రాహుల్ గాంధీ చెప్పినట్టు… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..దేశ వ్యాప్తంగా ఎవరు ఎంతో..వారికి అంత వాటా అమలు చేస్తామన్న నినాదం కూడా తమకు కలిసి వస్తుందన్నది కాంగ్రెస్‌ కేలిక్యులేషన్‌ అట.

Exit mobile version