అక్కడి హస్తం పార్టీలో ఐక్యత మేడిపండు చందమేనా? నాయకులు పైకి కౌగిలించుకుంటున్నట్టు కనిపిస్తున్నా… కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారా? జిల్లాలో ఉన్నదే ముగ్గురు ఎమ్మెల్యేలు. వాళ్ళలో ఇద్దరు ఒక వర్గం, ఒకాయన మరో వర్గంగా రాజకీయం చేస్తున్నారా? జిల్లా అధ్యక్షుడు తాజాగా ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకేనా? ఎవరా ముగ్గురు? ఏంటా మేడిపండు కథ? మహబూబ్ నగర్ జిల్లా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. తాజాగా పార్టీ చేపట్టిన ఓట్ చోరీ సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు జిల్లా కాంగ్రెస్‌లో చర్చనీయాంశం అవుతున్నాయి. పార్టీ కార్యక్రమాలకు ఎవరైనా డుమ్మా కొడితే పీసీసీకి రిపోర్ట్ చేస్తానని కాంగ్రెస్ తరపున లోకల్ బాడీస్ ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న వారు కార్యక్రమాలకు రాకుంటే బీ ఫామ్ ఇచ్చేది లేదని క్లారిటీగా చెప్పేశారాయన.
అంతవరకు ఓకే అనుకున్నా… ఎక్కడో కూర్చుని మేం చెబితే బీ ఫామ్స్ ఇస్తారని ఎవరైతే పగటి కలలు కంటున్నారో వారి ఆటలు సాగనివ్వమనడం మాత్రం కాక రేపుతోంది. ఆ పగటి కలలు కంటున్నది ఎవరన్న పాయింట్ చుట్టూ రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. జిల్లా పరిధిలో మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం దేవరకద్ర ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నారు. ఇక మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల నుంచి అనిరుధ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో మధుసూదన్‌రెడ్డి మాటలు బీ ఫామ్స్ ఇచ్చే అధికారం ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను ఉద్దేశించేనా అన్న సందేహాలు వస్తున్నాయట చాలామందికి.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ మూడు నియోజకవర్గాల నేతలు, ఆశావహులతో కళకళలాడిన జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అధికారం వచ్చాక సందడి తగ్గినట్లు హస్తం శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలకు మహబూబ్ నగర్, జడ్చర్ల ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా డుమ్మా కొడుతోందని, ఆ విషయంలో డీసీసీ అధ్యక్షుడు అసహనంగా ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలే చెప్పుకుంటున్నాయి. మొన్నటి ఓట్ చోరీ సంతకాల సేకరణ కార్యక్రమానికి సమాచారం ఇచ్చినా జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు, ఆయా మండలాల నాయకులు కూడా హాజరవకపోవడంతో.. డీప్‌గా హర్ట్ అయి మేటర్‌ని సీరియస్‌గా తీసుకున్నారట మధుసూదన్ రెడ్డి. అందుకే వేదిక మీది నుంచి పార్టీ కార్యక్రమాలను లైట్ తీసుకుంటే ఉపేక్షించేది లేదంటూ హాట్ కామెంట్స్ చేసి ఉంటారని విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ఈ వ్యాఖ్యలు సూటిగా మహబూబ్ నగర్ , జడ్చర్ల ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరగణాన్ని ఉద్దేశించినవేనన్న అభిప్రాయం బలంగా ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన పాలమూరులో పార్టీ కార్యక్రమాలను , సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు విపక్షాల విమర్శలను ఘాటుగా తిప్పికొట్టాల్సిన ఎమ్మెల్యేలు ఆ సంగతి మర్చిపోయి వర్గపోరుకు తెరలేపడంపై పార్టీ కేడర్‌లో కూడా అసహనం పెరుగుతున్నట్టు తెలుస్తోంది.
విపక్షానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ముగ్గురూ కలిసి నడుస్తుంటే…. అధికార పార్టీలోని వాళ్ళు మాత్రం ఎవరి దారి వారిది అన్నట్టు వ్యవహరించడం పార్టీ మనుగడకు మంచిది కాదని కార్యకర్తలే అంటున్నారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుథ్‌రెడ్డి ఒకటై వారి పనులు వారు చేసుకుంటున్నారని, దేవరకద్ర ఎమ్మెల్యే అయిన జిల్లా అధ్యక్షుడు నిర్వహించే పార్టీ ప్రోగ్రామ్స్‌ని వాళ్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన అలా బరస్ట్ అయి ఉంటారని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద పాలమూరు కాంగ్రెస్ రచ్చ వీధికెక్కింది. సీఎం సొంత జిల్లాలో పార్టీ పెద్దలు వెంటనే జోక్యం చేసుకుని వెంటనే సెట్ చేయకుంటే డ్యామేజ్ ఎక్కువ అవుతుందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్.
