Site icon NTV Telugu

Off The Record : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నిక కాంగ్రెస్ కి అగ్నిపరీక్షలా మారిందా?

Congress

Congress

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విషమ పరీక్ష ఎదుర్కొంటోందా? మరీ ముఖ్యంగా… ఆ పది నియోజకవర్గాల్లో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయా? బీ ఫామ్స్‌ ఎవరు ఇస్తారన్న విషయమై లొల్లి మొదలైందా? అది విజయావకాశాల్ని సైతం దెబ్బ తీస్తుందన్న భయాలు పెరుగుతున్నాయా? ఆ విషయమై పార్టీలో ఏం జరుగుతోందసలు? స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలైంది. అందుకు సంబంధించి రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో ఈనెల ఐదు లోపు ఒక్కో సీటుకు ముగ్గురి పేర్ల చొప్పున ఎంపిక చేసి పంపాలని సంబంధిత నేతలకు దిశానిర్దేశం చేశారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. ఇంతవరకు బాగానే ఉందిగానీ…. అసలు సమస్యంతా… ఆ… నియోజకవర్గాల్లోనే వస్తోందట. బీఆర్‌ఎస్‌ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరి ఏడాది కావస్తున్నా… ఇప్పటివరకు అక్కడ అంతర్గత సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర నాయకత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ పది చోట్ల ఎప్పటికప్పుడు అవే అలకలు.. అవే అసంతృప్తులు తెరమీదికి వస్తున్నాయి. ఇక ఇప్పుడు జరగబోయేవి స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో… ఇవి అందరు నాయకులకు కీలకమే. వాళ్ళు నియోజకవర్గాల్లో భవిష్యత్తు రాజకీయాలు చేయాలంటే… సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు తమ వాళ్ళయి ఉండాలి.

సహజంగా నాయకులు కోరుకునేది కూడా అదే. అందుకే అభ్యర్థుల ఎంపికలో తమదే పైచేయిగా ఉండాలని ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన పదిచోట్ల ఇప్పుడు ఇదే ప్రధాన సమస్య అయిందట. ఈ లొల్లి ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గంలో ఓ రేంజ్‌లో నడుస్తోంది. బీఆర్‌ఎస్‌ తరపున గెలిచి కాంగ్రెస్‌లోకి జంప్‌ అయిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తమ వారినే ఎంపిక చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట. కానీ… అక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి మాత్రం… పార్టీ కోసం పనిచేసిన వాళ్లకే బీఫామ్స్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో తాజా రచ్చకు ఇదే కారణం అన్న అభిప్రాయం బలంగా ఉంది. ఒకవేళ పాత కాంగ్రెస్ నాయకులను కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తే కేడర్‌ మద్దతు ఎంత వరకు ఉంటుందన్నది క్వశ్చన్‌ మార్క్‌. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌ పెద్దలకు ఇప్పుడు ఇది తలనొప్పిగా మారిందంటున్నారు. ఇక వరంగల్‌ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో కూడా ఇదే రకం సమస్య ఉందట.

ఇక్కడ పాత కాంగ్రెస్ నాయకురాలు ఇందిర తనకు ఇప్పటివరకు ప్రాధాన్యత దక్కలేదని, పార్టీ పట్టించుకోవడంలేదన్న ఫీలింగ్ లో ఉన్నారు. తన కేడర్‌ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి… స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత నేతలకే టిక్కెట్స్‌ ఇవ్వాలన్న వత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. ఇటు పటాన్‌చెరులో కూడా సేమ్‌ సీన్‌. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వర్సెస్‌ సీనియర్‌ లీడర్‌ కాటా శ్రీనివాసరావుగా నడుస్తోంది వ్యవహారం. తన టీంకి బీఫామ్స్‌ ఇవ్వాలని, కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడ్డవాళ్ళకు ప్రాధాన్యత దక్కాలన్నది కాటా మాట. ఆవిషయంలో నో కాంప్రమైజ్‌ అంటున్నారట శ్రీనివాసరావు. నిజామాబాద్ జిల్లాలో కూడా ఇదే పంచాయతీ కొనసాగుతోంది. పైన ఎవరున్నా… గ్రామ, మండల స్థాయిలో పట్టు ముఖ్యం కాబట్టి… ఎవరికి వారు తమ సొంత కేడర్‌ని కాపాడుకునేందుకు టిక్కెట్స్‌ విషయంలో నో కాంప్రమైజ్‌ అంటుండటం సమస్యను జఠిలం చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వం కూడా.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటోందట. పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, స్థానిక నాయకత్వానికి మధ్య గ్యాప్‌ రాకుండా… ఉండాలంటే అభ్యర్థుల ఎంపిక స్థానికంగా జరక్కుండా చూడాలని భావిస్తున్నారట పెద్దలు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా జాగ్రత్తలు పాటించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌ ఇప్పటికే జిల్లాల నాయకత్వాల్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ సమన్వయం కోసం త్వరలోనే ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. అయితే… ఇలాంటి వ్యవహారాలను వీలైనంత త్వరగా తేల్చేయాల్సింది పోయి… ఎక్కువ నాన్చడం వల్ల సమస్య పెరుగుతోందన్నది కాంగ్రెస్‌ వర్గాల అభిప్రాయం.

Exit mobile version