తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావించాలా? ఆ విషయమై పార్టీ, ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తమ రెండేళ్ళ పరిపాలన తర్వాత జరగబోతున్న ఎలక్షన్స్‌కు అధికార పార్టీ ఏ రూపంలో సిద్ధమవుతోంది? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసొచ్చేవి, వ్యతిరేక అంశాలేంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లోనే దీన్ని అమలు చేస్తామని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా చెప్తూ వచ్చారు. ఈ క్రమంలో రిజర్వేషన్ల ప్రక్రియను సెట్ చేసేందుకు కొంత గడువు తీసుకుంది ప్రభుత్వం. మొత్తానికి సవాళ్ళన్నిటినీ అధిగమిస్తూ…ఇవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి అంటూ….బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో ఇచ్చింది రేవంత్ సర్కార్. ఈ ఎన్నికల్ని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రధానంగా అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ గెలుపు చాలా ముఖ్యమన్న అభిప్రాయం బలంగా ఉంది. అంతకు మించి ఈ ఎన్నికలు రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు గీటు రాయిగా భావించాల్సి ఉంటుందన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం హామీల అమలు విషయంలో అవకాశం ఉన్న మేరకు సీరియస్‌గా ప్రయత్నిస్తోందన్న ఫీలింగ్ ఉంది. అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు జరుగుతున్నా… వాటి అన్నిటిని అధిగమిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ పాలకులు. ఈ క్రమంలో… స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలన్న టార్గెట్ పెట్టుకుంది. అందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా కొన్ని పథకాలను అమలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఇప్పటికే మొదలైంది.
పదేళ్లపాటు కొత్త రేషన్ కార్డులు లేవన్న ఫీలింగ్‌లో ఉన్న ప్రజలకు పూర్తిస్థాయిలో కార్డులను అందిస్తోంది. ఏరివేతలు లేకుండా… దరఖాస్తు చేసుకున్న వాళ్లలో 90 శాతం మందికి రేషన్ కార్డులను ఇవ్వడంతోపాటు వాటి మీద సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇలా గ్రామీణ ఓటర్లను ప్రభావితం చేసేలా అమలు చేస్తున్న పథకాలు కలిసి వస్తాయని లెక్కలేసుకుంటున్నారు సర్కార్ పెద్దలు. వీటితోపాటు తెలంగాణలో 56 శాతం ఉన్న బీసీలకు అధికారంలో వాటా కల్పించే వీలుగా రిజర్వేషన్లను అమలు చేస్తున్న క్రమంలో ఆ వర్గాలు కూడా తమకు అండగా ఉంటాయని లెక్కలేసుకుంటున్నారు ప్రభుత్వ, పార్టీ పెద్దలు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి గ్రౌండ్ లెవల్‌లో ఏం జరుగుతోందన్న ఫీడ్ బ్యాక్ తెప్పించుకునే విషయంలో సీరియస్‌గా ఉన్నారు. ఇటీవల ప్రతిపక్షం యూరియా అంశాన్ని రేవంత్ ప్రభుత్వ వైఫల్యమే అన్నట్టు చూపించే ప్రయత్నం చేసింది. దాని ప్రభావం ప్రభుత్వం మీద ఉంటుందన్నది ప్రతిపక్షం లెక్క. అదే సమయంలో ఇప్పటివరకు జరిగిన చాలా ఎన్నికల్ని చూసుకుంటే… స్థానిక సంస్థల ఎన్నికలు… అధికారపార్టీకి అనుకూలంగానే ఉంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తే.. అభివృద్ధి జరుగుతుందన్న లెక్కల ప్రకారమే ఓటింగ్ ఉంటుందని అంటారు. మరోవైపు ఫలితాలు తేడా రాకుండా.. మంత్రులను బాధ్యులను చేయాలని పార్టీ భావిస్తోంది. పూర్తిస్థాయిలో ఫలితాలు అనుకూలంగా వచ్చినా… తేడా కొట్టినా… వాటిని మంత్రుల పనితీరుకి ప్రామాణికంగా భావించాలని అనుకుంటున్నారట. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ సర్కార్ రెండేళ్శ పాలనకు ప్రజలిచ్చే మార్కులుగా చూడాల్సి ఉంటుందన్న అభిప్రాయం బలంగా ఉంది. అందుకే ప్రభుత్వం కూడా స్థానిక ఎన్నికలను సీరియస్ గానే తీసుకుంటున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
