కేబినెట్ ర్యాంక్ నామినేటెడ్ పోస్ట్‌లో ఉన్న ఆ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ అధిష్టానం మీద అలిగారా? అందుకే… ప్రభుత్వం తనకిచ్చిన కారు, గన్‌మెన్‌ని తిప్పి పంపేశారా? దాని వెనక చాలా పెద్ద స్కెచ్చే ఉందా? ఎవరా సీనియర్ లీడర్? ఏంటి ఆయన స్కెచ్? వనపర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి చిన్నారెడ్డి, ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. సౌమ్యుడని పేరున్న ఈ నేత… కాంగ్రెస్ సహజశైలికి కాస్త భిన్నంగా ఉంటారని, అంత తొందరగా అసంతృప్తిని బయటపెట్టరని చెప్పుకుంటారు. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా…. పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకుండా తన వైఖరి వెల్లడిస్తుంటారు. కానీ… ఇప్పుడాయన వైఖరి మారినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. గతానికి భిన్నంగా ప్రస్తుతం పబ్లిక్‌గా ఓపెనైపోతున్నారట. తాజా వ్యవహారమై అందుకు నిదర్శనమని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ పోస్టు ద్వారా వచ్చిన ప్రోటోకాల్‌ను పక్కన పెడుతూ… ప్రభుత్వ కారు, గన్‌మెన్‌ను తిప్పి పంపించేశారాయన. ప్రస్తుతం వనపర్తి పొలిటికల్ సర్కిల్స్‌లో దీని గురించి విస్తృ చర్చ జరుగుతోంది.
ఇది దేనికి సంకేతమో ఇటు పార్టీ, అటు రాజకీయ వర్గాలకు అంతుబట్టడం లేదట. ఏ కారణం లేకుండా అలా ఎందుకు చేస్తారు? ఎవరి మీదనన్నా ఉన్న అసంతృప్తిని ఈ రూపంలో బయటపెడుతున్నారా అని మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ప్రస్తుతం ఆయనకు కేబినెట్ హోదా ఉంది. పార్టీ పరంగా ఏఐసీసీ కార్యదర్శి కూడా. అయినాసరే.. సొంత వనపర్తి నియోజక వర్గంలో ఆయన మాటే చెల్లుబాటు కావడం లేదట. పార్టీ పదవులతో పాటు అధికార యంత్రాంగాన్ని ఆపరేట్ చేసే పవర్స్ అన్నీ… సిట్టింగ్ ఎమ్మెల్యే మేఘారెడ్డి చేతిలోకి చేరిపోయినట్టు చెప్పుకుంటున్నారు. దీంతో… బయట పల్లకీ మోతలున్నా… ఇంట్లో ఈగల మోతగా ఫీలవుతున్నారట చిన్నారెడ్డి. నియోజకవర్గంలో ఇద్దరు నాయకులకు అస్సలు పొసగడం లేదన్నది ఓపెన్ టాక్. చిన్నారెడ్డి, మేఘారెడ్డి బయటకు బాగానే ఉన్నట్లు కనిపించినా…కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటారని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. గతంలోనూ పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల శంకుస్థాపనల విషయంలో విభేదాలు బహిర్గతం అయ్యాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే మేఘారెడ్డి నియోజకవర్గంతో పాటు పార్టీపై పూర్తి స్థాయి పట్టు బిగించేలా ముందుకు వెళ్తున్నారట. అదే సమయంలో మొన్నటి వరకు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా ఉన్న చిన్నారెడ్డిని ఇంకా పదవీకాలం ఉండగానే… ఆ మధ్య తప్పించేశారు. ఆ విషయంలో కూడా మాజీ మంత్రి బాగా నారాజ్ అయినట్టు సమాచారం.
ఈ పరిణామాల మధ్య అనూహ్యంగా…. ప్రభుత్వ కారు, గన్‌మెన్‌ను చిన్నారెడ్డి సరెండర్ చేయడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే… ఇదేం అంత తేలిగ్గా, తీసుకున్న నిర్ణయం అయి ఉండకపోవచ్చని, చిన్నారెడ్డి అంత ఆషామాషీగా వ్యవహరించే మనిషి కాదన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. మరి ఎందుకలా చేసి ఉంటారంటే…. దాని వెనక స్థానిక ఎన్నికల వ్యూహం ఉండి ఉండవచ్చంటున్నారు. ఆ ఎలక్షన్స్‌లో తనవారికి వీలైనంత ఎక్కువగా సీట్లు ఇప్పించేందుకు ఈ ఎత్తుగడ వేసి… అధిష్టానం మీద వత్తిడి పెంచే ఆలోచన ఉండవచ్చన్నది కొందరి మాట. ఇక ఇదే సమయంలో చిన్నారెడ్డి తన కుమారుడు ఆదిత్య రెడ్డి రాజకీయ భవిష్యత్‌ను సెట్ చేసే ప్లాన్‌లో ఉన్నారట. ఆయన ఆశించినట్టుగా పార్టీ పదవి కానీ, నామినేటెడ్ పోస్ట్‌గాని దక్కే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై… గన్‌మెన్ సరెండర్ ఎపిసోడ్‌ని తెర మీదికి తెచ్చి ఉంటారన్నది ఇంకో వెర్షన్. మొత్తం మీద చిన్నా రెడ్డి మాత్రం పెద్ద స్కెచ్‌తోనే ముందుకు పోతున్నారన్నది లోకల్ టాక్.
