Site icon NTV Telugu

Off The Record : పదవీ కాలం ముగింపునకు దగ్గరగా కార్పొరేషన్ చైర్మైన్స్.. రెన్యువల్ అవుతుందా ?

Congress

Congress

కార్పొరేషన్‌ ఛైర్మన్స్‌గా ఇన్నాళ్ళు కూల్‌ కూల్‌గా పొజిషన్‌ ఎంజాయ్‌ చేసిన ఆ నేతలకు ఇప్పుడో కొత్త టెన్షన్‌ పట్టుకుందట. అదనంగా దక్కిన పోస్ట్‌ వాళ్ళని కంగారు పెడుతోందట. ఉన్నదానికి అదనంగా మరో పదవి దక్కితే ఇంకా హ్యాపీగా ఫీలవ్వాల్సిన నాయకులు ఎందుకు టెన్షన్‌ పడుతున్నారు? ఎవరా నాయకులు? ఎందుకా కంగారు? తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడో కొత్త టెన్షన్‌లో ఉన్నారు. అనూహ్యంగా ఓ పదవి వచ్చిందిగానీ… దాని దెబ్బకు ఉన్న పోస్ట్‌ ఊడుతుందా ఉంటుందా? అంటూ చాలామంది నాయకుల్లో కంగారు పెరుగుతున్నట్టు చెబుతున్నారు. కొత్తగా పదవి వచ్చినందుకు సంతోషపడాలో లేక… ఇప్పుడున్న ఉద్యోగం కంటిన్యూ అవుతుందో లేదోనని టెన్షన్ పడాలో తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళంతా. సాధారణంగా రాజకీయ నాయకులు ఎవరైనా… రెండు పదవులుంటే ఫుల్‌ ఖుషీ అవుతుంటారు. కానీ… ఒకరికి ఒక పదవి అన్న రూల్‌ ఎక్కడ అప్లయ్‌ అయి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయోనన్నది వాళ్ళ కంగారు. దేశ వ్యాప్తంగా డీసీసీలను క్రియాశీలకంగా మార్చాలన్న పార్టీ ప్రణాళికలో భాగంగా జిల్లా అధ్యక్షులుగా కాస్త బలవంతుల్ని నియమించాలని డిసైడయింది పార్టీ అధిష్టానం. అందులో భాగంగా కొంతమంది ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్ష పదవులు కట్టబెట్టింది.

అలాగే… కాస్త పట్టున్న కార్పొరేషన్‌ ఛైర్మన్స్‌కు కూడా డీసీసీ పీఠాలు దక్కాయి. ఎమ్మెల్యేల సంగతి ఎలా ఉన్నా… కొందరు కార్పొరేషన్‌ ఛైర్మన్స్‌కే కంగారు పెరుగుతోందట. జిల్లా అధ్యక్షుడిగా ఉండే నాయకుడు కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్‌లో ఉంటే… ప్రోటోకాల్‌తో పాటు అధికారులు ఆదేశాలు పాటిస్తారని, దాంతో పార్టీ క్యాడర్‌కి కూడా కొంత బలం చేకూరుతుందన్నది పార్టీ ఆలోచనగా కనబడుతోంది. ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్స్‌గా ఉన్న ముగ్గురు నాయకులకు జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయి. వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డికి హన్మకొండ జిల్లా అధ్యక్ష పదవి, సాట్ చైర్మన్ గా ఉన్న శివసేనా రెడ్డికి వనపర్తి జిల్లా అధ్యక్ష బాధ్యతలు, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్‌ దీపక్ జాన్‌కు సికింద్రాబాద్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది పార్టీ. వ్యూహాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయం కలిసి వస్తుందన్నది కాంగ్రెస్‌ పెద్దల లెక్క.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. కార్పొరేషన్ ఛైర్మన్స్‌ పదవీకాలం దగ్గర పడుతోంది. దాంతో రెన్యువల్‌ అవుతుందా లేదా అన్నది నాయకుల టెన్షన్‌. ప్రోటోకాల్‌, కేడర్‌లో నైతిక బలంలాంటివి ప్రస్తుతానికి చెప్పుకోవడానికి బాగున్నా… రేపు రెన్యువల్‌ టైంకి పోటీ పెరిగిపోయి… జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చాం కాబట్టి దాంతో సర్దుకోమంటే…. ప్రభుత్వ పోస్ట్‌ను త్యాగం చేయాల్సి వస్తుందన్నది నాయకుల కంగారుగా తెలుస్తోంది. ఐతే అదే సమయంలో మరో మాట కూడా వినిపిస్తోంది. సాట్ చైర్మన్‌ శివసేనారెడ్డి పనితీరు పై సీఎం రేవంత్ సంతృప్తి గానే ఉన్నారట. అటు వెంకటరామి రెడ్డి, దీపక్ జాన్ కూడా కార్పొరేషన్ చైర్మన్స్‌గా బాగానే పెర్ఫామ్‌ చేస్తున్నారన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ఈ పరిస్థితుల్లో కొనసాగింపు ఉంటుందా? పార్టీ పదవితో సర్దుకోమంటారా అన్న క్లారిటీ లేక సతమతం అవుతున్నారు నాయకులు. కొత్త చైర్మన్ల నియామకం కోసం పార్టీ కసరత్తు చేస్తోంది కాబట్టి.. కొత్త వాళ్ళకు చాన్స్ ఇస్తారా..? లేదంటే DCC అధ్యక్షులు పట్టు సాధించాలి కాబట్టి వాళ్ళనే కంటిన్యు చేస్తారా..? అనేది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏదైనా.. పార్టీ పగ్గాలు చేతికి వచ్చిన వాళ్లలో కోతలు ఉంటాయా..? కంటిన్యు అవుతారా..? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

Exit mobile version