Site icon NTV Telugu

Off The Record : జమిలి ఫిక్స్ అయితే 6 నెలలు బోనస్ వచ్చినట్టేనా?

Jamili

Jamili

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బోనస్‌ దక్కబోతోందా? కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటున్న ఓ నిర్ణయం ఆయనకు వరం కాబోతోందా? ముఖ్యమంత్రికి కూడా ఆ విషయంలో అంతో ఇంతో సమాచారం ఉన్నందునే ఈ మధ్య తరచూ దాని గురించి ప్రస్తావిస్తున్నారా? ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాంగ్రెస్‌కు ఎలా కలిసొస్తుంది? ఏంటా కథ? రేవంత్ సర్కార్‌కు ఆరు నెలలు అదనపు పరిపాలనా కాలం బోనస్‌గా రాబోతోందా? జమిలి ఎన్నికలు ఫిక్సా..? తెలంగాణ అసెంబ్లీ.. పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగితే లాభం ఎవరికి? సీఎం రేవంత్ పదే పదే జమిలి అంటున్నారంటే అది ఫిక్స్ అయినట్టేనా..? ప్రస్తుతం ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం చూస్తున్నాయి రాష్ట్ర రాజకీయవర్గాలు. షెడ్యూల్‌ ప్రకారం అయితే…. సాధారణ ఎన్నికలు… 2028లో జరగాలి. కానీ…. ఒకవేళ జమిలి ఫిక్స్‌ అయి అది 2029కి పోస్ట్‌పోన్‌ అయితే… తెలంగాణ అసెంబ్లీకి కూడా దాదాపు ఆరు నెలల ఆలస్యంగా లోక్‌సభతో పాటే ఎన్నికలు జరుగుతాయన్న అంచనాలున్నాయి. అలాగే గనుక జరిగితే… సీఎంగా రేవంత్‌రెడ్డికి ఆరు నెలల అదనపు పాలనా కాలం వచ్చినట్టేనన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి.

ఆయన కూడా ఇటీవల తరచూ ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం, నియోజక వర్గాల పునర్విభజన జరిగి పోతుందన్న ధీమాగా ఉండటం చూస్తుంటే… ఈ అంచనాలే నిజమయ్యే అవకాశాలున్నట్టు కనిపిస్తోందంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. నియోజక వర్గాల పునర్విభజన, జమిలి ఎన్నికలతో తమకు ఆరు నెలలు కలిసి వస్తుందనే లెక్కలో ఉన్నారట సర్కార్ పెద్దలు. మామూలుగా అయితే… గడువు లోపు ఎన్నికలు జరగాలి. కానీ… దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరపాలన్న విస్తృత ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్స్‌టెన్షన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకుంటే సరిపోతుంది. ఇక రాజ్యాంగ సవరణ దాకా వెళ్లాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు కొందరు పొలిటికల్‌ ఎక్స్‌పర్ట్స్‌. లోక్‌సభ లెక్క ప్రకారం అయితే… 2029 ఏప్రిల్… లేదా మే లో ఎన్నికలు జరిగాలి. ఐతే తెలంగాణలో 2028 నవంబర్‌లోనే నిర్వహించాలి. జమిలికి ఫిక్స్‌ అయితే…తెలంగాణ అసెంబ్లీ కూడా 29 ఏప్రిల్‌ దాకా ఎక్స్‌టెండ్‌ అయ్యే అవకాశం ఉందన్నది కొందరి అంచనా.

అప్పుడు తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా కాస్త అటు ఇటు ఉండవచ్చంటున్నారు. సరిపడా భద్రత, ఈవీఎంలు లాంటి అన్నిటినీ సమకూర్చుకోవాల్సి ఉంది. ఇక నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే జనాభా లెక్కలు పూర్తి చేయాల్సి ఉంటుంది. 2027 జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరుగుతుంది. దీనికి తోడు 33 శాతం మహిళా రిజర్వేషన్ కూడా వచ్చే ఎన్నికల్లో అమలులోకి రాబోతుంది. ఇలా నియోజక వర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ రెండూ జమిలితో పాటే అమల్లోకి వస్తాయి. ఈ లెక్కన చూస్తే తెలంగాణ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 153కి పెంచాలని ఏపీ పునర్విభజన చట్టంలో ఉంది. ఐతే..జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య ఇంకా పెరుగుతుందా? లేదంటే 153కే పరిమితం చేస్తారా అన్నది చూడాలంటున్నారు. పునర్విభజన జరిగితే… ఎక్కడ ఎన్ని సీట్లు పెరుగుతాయి..? గ్రేటర్‌లో పరిస్థితి ఏంటి..? మహిళా కోటాలోకి ఏయే నియోజక వర్గాలు వెళ్తాయి..? లాంటి రకరకాల లెక్కలు వేస్తోంది ప్రభుత్వం. జమిలి ఈక్వేషన్ ఎవరికి వర్కవుట్ అవుతుందన్న లెక్క ఒకటైతే…మహిళా రిజర్వేషన్లు.. నియోజక వర్గాల పెంపు లాంటివిఎవరికి కలిసి వస్తాయన్న చర్చ కూడా నడుస్తోంది రాజకీయవర్గాల్లో.

Exit mobile version