రెండు రాష్ట్రాల మధ్య జల జగడాలు రాజకీయ రంగు పులుముకున్నాయా? సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ వాపస్ తీసుకోవడంపై రాద్దాంతం పెరుగుతోందా? సివిల్ సూట్ దాఖలు చేస్తే తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా రిట్ పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం-నల్లమలసాగర్ అంశంపై రిట్ పిటిషన్ ద్వారా ముందుకు వెళ్లడం ప్రయోజనకరం కాదని, ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించారు. అంతర్రాష్ట్ర జల వివాదాలకు రిట్ పిటిషన్ సరైన మార్గంకాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలవరం- నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టు సీజేఐ సూర్యకాంత్ అధికారికంగా ప్రకటించారు. పిటిషన్ ఉపసంహరణ నేపథ్యంలో కేసును డిస్పోజ్డ్ ఆఫ్ చేసినట్టుగా ధర్మాసనం వెల్లడించింది.
తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ హాజరై వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండానే డీపీఆర్ పనులు చేపడుతోందని, ఇది తెలంగాణ జల ప్రయోజనాలకు విఘాతమని వాదించారు. అయితే, కోర్టు సూచనల మేరకు సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. ఈ వివాదం కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. గోదావరి జలాల పంపిణీలో కర్ణాటక, మహారాష్ర్ట రాష్ట్రాలకు కూడా సంబంధం ఉన్నందున, వారిని కూడా ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
అయితే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వెనక్కి తీసుకోవడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్రాంతి పండుగ వేళ రేవంత్ చంద్రబాబుకు ఇచ్చిన గిఫ్టే.. సుప్రీం కోర్టులో వేసిన ఈ బలహీనమైన రిట్టు అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. పోలవరం -నల్లమల సాగర్ విషయంలో ముందు నుంచి రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి పూర్తిగా సహకరిస్తున్నదని ఆరోపించారు. పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్‌కు సీఎం రేవంత్ మద్దతు ప్రకటించారని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్పజెప్పడమేనా మీ చర్చల లక్ష్యమా? అని ప్రతిపక్షం మండిపడుతోంది. చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్‌రెడ్డి.. నిన్ను తెలంగాణ సమాజం క్షమించదని మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి.. నీ గురుదక్షిణ కోసం రాష్ట్రానికి ద్రోహం చేస్తుంటే రాష్ట్రాన్ని సాధించిన బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని, తెలంగాణ నీటి హక్కుల కోసం పోరు చేస్తామని హెచ్చరించారు.
సుప్రీంకోర్టులో త్వరలోనే సివిల్ సూట్ దాఖలు చేసే ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. నల్లమలసాగర్ ప్రాజెక్టుపై తమ వాదనలు, అభ్యంతరాలను వినిపించాలంటే సివిల్ సూట్ దాఖలు చేసుకోవడమే సరైన న్యాయపరమైన మార్గమని సుప్రీం సూచించింది. మధ్యవర్తిత్వం ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ దగ్గర తెలంగాణ వాదనలు వినిపించుకోవచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో నల్లమలసాగర్ అంశం భవిష్యత్‌లో సివిల్ సూట్ రూపంలో మరోసారి కోర్టు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రాల మధ్య ఉండే జల వివాదాలను ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్‌గా కాకుండా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ ద్వారానే పరిష్కరించుకోవాలని కోర్టు సూచించడంతో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కర్ణాటక, మహారాష్ర్టలను కూడా ప్రతివాదులుగా చేర్చుతూ ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరి ఈ కేసులో పక్క రాష్ట్రాల అభిప్రాయాలు ఏవిధంగా ఉంటాయో తేలాల్సి ఉంది.
