డియర్ ఫ్రెండ్…. నిన్ను నియోజకవర్గంలో లేకుండా చేస్తా…. ఇక నువ్వు ఈ జిల్లాలో అడుగు పెట్టలేవంటూ ఒకప్పుడు తనను సవాల్ చేసిన నేతకు ఏపీ సీఎం తనదైన ట్రీట్‌మెంట్ ఇచ్చారా? చేతికి మట్టి అంటకుండా… కూల్ కూల్‌గా చేయాల్సిన పని చేసేశారా? తన మీద తొడగొట్టిన నాయకుడికి గిరిగీసి ఇదీ…. నీ పరిధి అని చెప్పకనే చెప్పారన్నది నిజమేనా? అసలేం జరిగింది? జిల్లాల పునర్విభజనలో చంద్రబాబు ప్రస్తావన ఎందుకొస్తోంది? కొత్త జిల్లాల ఏర్పాటు, కొన్నిటి పునర్విభజనకు ఏపీ కేబినెట్ ఓకే చెప్పేశాక ఉమ్మడి చిత్తూరులో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దీని గురించి టీడీపీ, వైసీపీ రెండు పార్టీల నాయకులు ఇంట్రస్టింగ్ కామెంట్స్‌తో రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి బ్రేక్ పడిందన్న వ్యాఖ్యలు గరం రేపుతున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేస్తూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. కేవలం రెండు మండలాల్ని మాత్రమే చిత్తూరు జిల్లాలో చేర్చారు.
దీనివల్ల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయానికి బ్రేకులు పడ్డట్టేనని, ఇంకా చెప్పాలంటే వాళ్ళ హవాను పూర్తిగా తగ్గించేసినట్టేనన్న చర్చలు నడుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో జిల్లా విభజన జరిగినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తన కుటుంబ ప్రభావం ఉండేలా జాగ్రత్తపడ్డారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ తన పలుకుబడితో చిత్తూరు జిల్లాలో కలిపేశారన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆయన కూమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ కావడంతో పాటు సోదరుడు ద్వారక నాథ్ రెడ్డి నియోజకవర్గం తంబళ్ళపల్లి కూడా అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. మరో వైపు తన నివాసం తిరుపతిలో ఉండటంతో అక్కడ కూడా ప్రోటోకాల్ కోసం తన నియోజకవర్గంలోని పులిచెర్లను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు పంపారు పెద్దిరెడ్డి. అయితే అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పక్రియ అగిపోయింది.
అప్పట్లోనే పెద్దిరెడ్డి హవాకు చెక్ పెట్టడానికి కొందరు వైసీపీ నేతలు ప్రయత్నించి విఫలమయ్యారన్న గుసగుసలు సైతం ఉన్నాయి. ఇక సీన్ కట్ చేస్తే… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారంటూ రకరకాల విచారణలు జరుగుతున్నాయి. అటవీ, ఇతర ప్రభుత్వ భూముల ఆక్రమణ, సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం లాంటి కేసుల్లో ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా మరో షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ఒకరకంగా ఇది ఆయనకు మిగతా వాటికంటే గట్టి షాకేనని అంటున్నారు. గతంలో చంద్రబాబును కుప్పంలోనే ఓడిస్తానని, అసలు చిత్తూరు జిల్లాలో అడుగు పెట్టలేని పరిస్థితి వస్తుందంటూ సవాల్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కానీ… కాలం మారింది. పరిస్థితులు తిరగబడ్డాయ్. ఇప్పుడు పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న పుంగనూరు నియోజకవర్గమే అసలు చిత్తూరు జిల్లాలో లేకుండా పోయింది. దాన్ని తీసుకెళ్ళి అన్నమయ్య జిల్లాలో కలిపింది కూటమి ప్రభుత్వం. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సోమల, సదుం, చౌడేపల్లి, పుంగనూరు మండలాలను అన్నమయ్య జిల్లా పరిధిలోకి చేర్చారు.
అదే నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలను మాత్రం చిత్తూరు జిల్లాలోనే ఉంచారు. ఇది నిజంగా పెద్దిరెడ్డికి పెద్ద షాకేనని అంటున్నారు. ఇక ఆయన కుమారుడు, ఎంపీ మిధున్ రెడ్డిది సైతం సేమ్ సీన్. ఒకప్పుడు ఇటు కడప అటు చిత్తూరు జిల్లాలలను కలగలిసిన రాజంపేట ఎంపీ సీటును ఇప్పుడు చిత్తూరులో లేకుండా చేశారు. అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు, తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, రాయచోటితోపాటు తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు , వై యస్ ఆర్ జిల్లా రాజంపేటను కలిపి మిధున్ రెడ్డిని అసలు చిత్తూరు జిల్లాలో లేకుండా చేశారు. ఈ విషయంలో లోకల్ టీడీపీ నాయకులకంటే ఒకరిద్దరు వైసీపీ నేతలే ఎక్కువ హ్యాపీగా ఉన్నారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డివల్ల తాము చాలా ఇబ్బందులు పడ్డామన్నది వాళ్ళ ఫీలింగ్. అయితే టీడీపీ లీడర్స్ మాత్రం మదనపల్లి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఓవరాల్‌గా చూస్తే… పెద్దిరెడ్డి కుటుంబానికి ఇది గడ్డు సమస్యేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
