Site icon NTV Telugu

Off The Record : బైపోల్స్కి బీఆర్ఎస్ రెడీ.. జూబ్లీహిల్స్తో పాటు 10 చోట్ల ఉపఎన్నికలు రానున్నాయా?

Brs

Brs

బీఆర్‌ఎస్‌ బై పోల్‌ మూడ్‌లోకి వచ్చేసిందా? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టిందా? ఎప్పుడు సైరన్‌ మోగినా మేము సై అంటూ సిద్ధమైపోతోందా? అసలిప్పుడు ఎందుకు హడావిడి చేస్తోంది కారు పార్టీ? ఏ ఉప ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. జూబ్లీహిల్స్‌ తప్ప మిగతా చోట్ల ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? గులాబీ లెక్కలేంటి? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బీ ఫామ్‌ మీద గెలిచి… తర్వాత కాంగ్రెస్‌లోకి జంప్‌ అయిపోయారు పది మంది ఎమ్మెల్యేలు. వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్‌ని కోరింది బీఆర్‌ఎస్‌. ఆ పోరాటంలో భాగంగా సుప్రీం కోర్ట్‌ దాకా వెళ్ళింది. తాజాగా వచ్చిన తీర్పు తమకు అనుకూలంగా ఉన్నట్టు భావిస్తున్నారు గులాబీ నేతలు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంగతిని మూడు నెలల్లోగా తేల్చమని స్పీకర్‌కు సూచించింది సుప్రీమ్‌ కోర్ట్‌. అందులో భాగంగా కొందరు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు కూడా ఇచ్చినట్టు చెబుతున్నారు బీఆర్‌ఎస్‌ లీడర్స్‌. మరి కొంత మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా త్వరలో నోటీసులు అందుకోబోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే… వాళ్ళ మీద ఖచ్చితంగా అనర్హత పడుతుందని కారు పార్టీ గట్టిగా నమ్ముతున్నట్టుందని అంటున్నారు పరిశీలకులు. నిజంగానే అనర్హత వేటు పడితే.. ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. అవి కూడా ఎంతో దూరంలో లేవని, జూబ్లీహిల్స్ బైపోల్‌తో పాటే జరుగుతాయని నమ్ముతోందట కారు పార్టీ అధిష్టానం. అందుకే ఆయా నియోజకవర్గాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నట్టు సమాచారం.

పార్టీ మారిపోయిన ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయ నేతల్ని సిద్ధం చేసే కార్యక్రమం మొదలైపోయిందట. అందులో భాగంగానే… గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలైనట్టు తెలిసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గాలి వీచినా…. ఆయా నియోజకవర్గాల్లో తమ పార్టీ గెలిచింది కాబట్టి….ఇప్పుడు ఉప ఎన్నికలంటూ జరిగితే… తిరిగి దతమ ఖాతాలోనే పడిపోతాయన్నది బీఆర్‌ఎస్‌ పెద్దల నమ్మకం అట. ఈసారి టిక్కెట్స్‌ను అధిష్టానానికి దగ్గరగా ఉన్న వాళ్లకి, గెలిచాక కూడా పక్క చూపులు చూడని వాళ్ళకు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. పది నియోజకవర్గాల్లో అలాంటి వాళ్ళు ఎవరున్నారని వెదుకుతున్నారట. శేరిలింగంపల్లిలో ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, పటాన్‌చెరులో ఆదర్శ్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ఖైరతాబాద్ నుంచి మన్నే గోవర్ధన్ రెడ్డి, రాజేంద్రనగర్‌లో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి, జగిత్యాలలోఎమ్మెల్సీ ఎల్ రమణ, బాన్సువాడ నుంచి ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, గద్వాలలో హనుమంతు నాయుడు లేదా కాంగ్రెలో ఉన్న వారిని లాక్కునే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక భద్రాచలంలో రేగా కాంతారావుకు, చేవెళ్ల నుంచి కొత్త వారికి టిక్కెట్‌ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక వీళ్లు మాత్రమే కాకుండా… ఉప ఎన్నికలంటూ జరిగితే ఆ టైంకి కాంగ్రెస్ నుంచి గానీ లేకుంటే వేరే పార్టీల నుంచి బలమైన నాయకులు ఎవరైనా ఆసక్తిగా ఉంటే వాళ్ళనుగాని చేర్చుకుని గెలిపించుకునేలా ప్లాన్‌ చేస్తోందట బీఆర్ఎస్ అధిష్టానం. వాళ్ళు ఊహిస్తున్నట్టుగా…ఒకవేళ ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే మాత్రం… ఆ ఫైట్‌ అసెంబ్లీ సాధారణ ఎన్నికల్ని మించి పోతుంది. అందుకే ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి పెడుతున్నారట. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకుంటూ… అక్కడ ఇన్ఛార్జ్‌లను నియమిస్తూ… క్యాడర్ ను ఉత్తేజపరచాలని చూస్తున్నారట. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకొని వాళ్లపై అనర్హత వేటు వేస్తే… ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి. ముందుగానే అలర్ట్‌ అవుతోందట గులాబీ పార్టీ. ఈ ముందస్తు ఏర్పాట్లు సఫలం అవుతాయో లేదో చూడాలి మరి.

Exit mobile version