ఆ ఉమ్మడి జిల్లాలో గులాబీ వాడుతోందా? బీఆర్‌ఎస్ ఉనికి ప్రశ్నార్ధకమవుతోందా? అధికారంలో ఉన్నప్పుడే అంతంతమాత్రంగా ఉన్న వ్యవహారం ఇప్పుడు మరింత దిగజారిందా? పెద్దోళ్ళు నోళ్ళు విప్పడం లేదు, ఉన్నవాళ్ళ స్థాయి సరిపోక కేడర్ కూడా పక్క చూపులు చూస్తోందా? ఎక్కడ ఉందా పరిస్థితి? ఎందుకలా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ని ఎప్పుడూ నాయకత్వ లోపం వెంటాడుతూనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడు అదే పరిస్థితి. కాకుంటే… చేతిలో పవర్ ఉన్నప్పుడు కవరైన కొన్ని లోపాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. జిల్లాలో కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కూడా విఫలం అవుతున్నారన్న అభిప్రాయం ఉంది. పక్క జిల్లాలో బీఆర్‌ఎస్ నేతలు పోటీ ఇస్తుంటే…. ఇక్కడ మాత్రం పోటీ మాట తర్వాత, కనీసం ఉన్న స్థాయిని నిలుపుకునే ప్రయత్నాలుకూడా జరగడం లేదన్నది కేడర్ టాక్. చివరకు తమ నాయకుడి మీద కుల పరమైన విమర్శలు వచ్చినా కౌంటర్ చేసుకోలేకపోయారన్న అభిప్రాయం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క కొత్తగూడెం సీటును గెలుచుకోగలిగింది బీఆర్‌ఎస్. ఆ తర్వాత ఫిరాయింపులతో బలపడింది. తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి వేర్వేరు పార్టీల నుంచి రావడంతో అప్పట్లో బలంగా కనిపించింది. ఇక 2018 ఎన్నికల్లో కూడా అదే వరస. మొత్తం పది సీట్లకుగాను ఒక్క ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే గెలిచారు. మిగిలిన చోట్ల కాంగ్రెస్, మిత్ర పక్షాలు గెలిస్తే… భట్టి విక్రమార్క, పోదెం వీరయ్య మినహా మిగిలిన వాళ్ళంతా బీఆర్‌ఎస్‌కు జై కొట్టారు. అప్పుడు కూడా అలా బలంగా కనిపించింది.
2023లో ఒక్క భద్రాచలంలో మాత్రమే బీఆర్‌ఎస్ గెలవగా… ప్రభుత్వం మారిన వెంటనే కాంగ్రెస్‌లో చేరిపోయారు భద్రాచలం ఎంఎల్ఎ తెల్లం వెంకట్రావు. అలా మూడు వరుస ఎన్నికల్లో గులాబీ పార్టీని తిరస్కరించారు ఉమ్మడి ఖమ్మం ఓటర్లు. అప్పుడే అలా ఉంటే… ఇప్పుడిక నాయకత్వ సమస్య తీవ్రంగా ఉందని అంటున్నారు. మొత్తం పది స్థానాల్లో ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వమే ఉంది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ముగ్గురు… భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో….బీఆర్‌ఎస్ కనీస పోటీ ఇవ్వగలుగుతుందా అన్న అనుమానం పార్టీ కేడర్‌నే వెంటాడుతోందట. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ బందం శ్రీనివాసరావు గతవారం కారు దిగేసి… కాంగ్రెస్‌లో చేరారు. ఇంకా కొందరు క్యూలో ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, కొత్తగూడెంలో రేగా కాంతారావు మినహా…. జిల్లా నుంచి పార్టీ తరపున వాయిస్ వినిపించేవారు, కౌంటర్ చేసే వాళ్ళు లేకుండా పోయారు. అసలు మాటేలేని చోట ఇక పోరాటం ఏం చేస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి జిల్లా పొలిటికల్ సర్కిల్స్ నుంచి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కమ్మ సామాజికవర్గాన్ని దుర్భాషలాడారంటూ ఆ మధ్య ఓ వివాదం తెర మీదికి రాగా…. పార్టీ తరపున ఆయన్ని సమర్ధించేందుకు జిల్లాకు చెందిన ఆ సామాజికవర్గం నాయకులు ముందుకు రాకపోవడంపై చర్చ జరుగుతోంది జిల్లాలో. మాజీ మంత్రి హోదాలో పువ్వాడ అజయ్ కుమార్ కూడా పార్టీ నాయకత్వానికి మద్దతుగా మాట్లాడలేకపోతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వగలుగుతామా అన్న అనుమానాలు కేడర్‌ని వెంటాడుతున్నాయట.
