తెలంగాణలో జెన్‌జీకి బాగా దగ్గరయ్యే ఒక అవకాశాన్ని బీఆర్‌ఎస్ మిస్ చేసుకుందా? ప్రతిపక్షంగా సకాలంలో స్పందించలేకపోయిందా? యువత మనసులో గట్టి ముద్ర వేయగలిగిన గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకుందా? మిస్సై పోయాం… ఏమీ చేయలేకపోయామంటూ పార్టీలోని ఓ వర్గం ఆక్షేపిస్తోందా? చేజార్చుకున్నామని అంతలా ఫీలవుతున్న ఆ అంశం ఏది? టేకప్ చేసి ఉంటే పార్టీకి ఎలా కలిసి వచ్చేది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన క్రిమినల్ వేస్ట్ వ్యాఖ్యలు పొలిటికల్ కాక రేపుతున్నాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన చాలా మంది విద్యార్థులు కనీసం అప్లికేషన్ ఫామ్స్ కూడా నింప లేకపోతున్నారని, వాళ్లలో సరైన స్కిల్స్ ఉండటం లేదని చెబుతున్న సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారాయన. ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్‌లా తయారవుతోందని చెప్పుకొచ్చారు. ఆ విషయంలో ఆయన ఉద్దేశ్యం ఏదైనాసరే… బయటికి మాత్రం వేరేలా అర్ధమైంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలా ఎలా మాట్లాడతారు? ఆయన విద్యార్థుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారంటూ మండి పడుతున్నారు విపక్ష నాయకులు.
బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు ఈ విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. గులాబీ పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్‌రావు దీనిపై రియాక్ట్ అయ్యారు. అయితే… దీని గురించి పార్టీ వర్గాల్లో మాత్రం కాస్త డిఫరెంట్‌గా చర్చ జరుగుతోందట. యువతకు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన నెగెటివ్ కామెంట్స్‌ని మనోళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, అంది వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకున్నారంటూ బీఆర్‌ఎస్‌లోనే ఓ వర్గం అంటోందట. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కీలక నేతలు మాట్లాడారు తప్ప… కింది స్థాయి నేతలు ఎవరు స్పందించలేదని చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీలో ఉన్న విద్యార్థి విభాగం ఈ విషయాన్ని రచ్చ రచ్చ చేయాల్సి ఉందని, అవకాశం ఉన్నప్పటికీ ఉపయోగించుకోలేదని మాట్లాడుకుంటున్నారు నేతలు. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం జెన్ జీ కీలకంగా మారుతోందని, అలాంటి జెన్ జీకి దగ్గరయ్యే మంచి అవకాశం వచ్చినా పార్టీ సరిగా పట్టించుకోలేదన్న పెదవి విరుపులు ఉన్నాయి. జెన్ జీలో కీలకంగా ఉండే ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాబట్టి… వారిని కలుపుకొని పోయి నిరసనలు, ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుండేదని పార్టీలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారట.
ఇంజనీరింగ్ కాలేజీల వారీగా యూనివర్సిటీల నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి ఉంటే బాగుండేదన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోందట. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కాని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగాకానీ… నిరసన చేయాలంటే పార్టీలోని పెద్ద నేతలు మాత్రమే రంగంలోకి దిగాల్సి వస్తోందని, అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వాళ్ళు ఎవరూ ఇలాంటి వ్యవహారాల్లో చొరవ తీసుకోకపోవడం, నిరసన కార్యక్రమాలకి ముందుకు రాకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీఎం ఆ స్టేట్‌మెంట్ ఇచ్చిన వారం తర్వాత స్పందించి ఒకటి రెండు మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడుతున్నారుగానీ.. ముందే ఒక ఉద్యమం రూపంలో దీనిని తీసుకెళ్తే బాగుండేదన్నది గులాబీ వర్గాల్లో ఉన్న విస్తృతాభిప్రాయం. జులైలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెట్టిన యువ సంగ్రామ సదస్సుతోపాటు ఇందిరాపార్క్ దగ్గర నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యాయని, ఆ ఊపు అలాగే కొనసాగించి ఉంటే బాగుండేది అంటున్నారు గులాబీ లీడర్స్. మరోవైపు… కాంగ్రెస్ నాయకులు మాత్రం తమ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ, ప్రతిపక్షం రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తోందని చెబుతున్నారు. దీంతో ఇది ఇంకా రాజకీయ వివాదంగా మారుతోంది. అయితే ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌లోనే భిన్నమైన చర్చలు కూడా నడుస్తున్నాయి. యువత, విద్యార్థులకు సంబంధించిన ఇలాంటి సున్నితమైన అంశంపై బీఆర్ఎస్ మరింత దూకుడుగా వ్యవహరించి ఉంటే రాజకీయంగా మరింత ప్రయోజనం పొందేదా? లేక పరిస్థితులను బేరీజు వేసుకుని పార్టీ సంయమనంతో ముందుకెళ్లిందా? అన్న కోణంలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా… క్రిమినల్ వేస్టేజ్ మాత్రం బీఆర్‌ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

