ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతోంది ప్రతిపక్షం. దీంతో ప్రతిపక్షానికి గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారట. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా… అవినీతి ఆరోపణలను… అవినీతి ఆరోపణలతోనే తిప్పికొట్టాలని డిసైడ్ అయ్యారట. యాదాద్రి పవర్ ప్లాంట్. సింగరేణి బొగ్గు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ రెండూ బర్నింగ్ టాపిక్స్. సింగరేణి బొగ్గు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రతిపక్షం అవినీతి మరకలు అంటించే పనిలో పడింది. అందుకు కౌంటర్‌గా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కాదు…ఆధారాలు చూపెట్టండి అని సవాల్ విసురుతోంది సర్కార్. తాజాగా యాదాద్రి పవర్ ప్లాంట్ కి విదేశాల నుండి బొగ్గు దిగుమతి అంశంలో రేవంత్ సర్కార్ అవినీతికి పాల్పడుతోంది అంటూ ఆరోపిస్తోంది BRS. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లెటర్ని చూసి వదిలేస్తారు అనుకుంటే… సీఎం రేవంత్ రెడ్డి ఎదురు దాడికే సిద్ధమయ్యారు. ఈ విషయంలో చూస్తూ ఊరుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని సీఎం భావించారట. అందుకే ఓ అడుగు ముందుకు వేసి కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. అసలు గుట్టు బయట పెట్టే ప్రయత్నం చేశారు.
50 శాతం ఇంపోర్టెడ్ బొగ్గు, సింగరేణిలోని జీ9 బొగ్గుతో యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని కేసీఆర్ హయాంలోనే ఎంఎస్పీసీతో 2016లో ఒప్పందం చేసుకున్నారు అని ఒప్పంద పత్రాలు బయటపెట్టారు. యాదాద్రికి కావాల్సిన 14 మిలియన్ టన్నుల బొగ్గులో 7 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతి కోసం 2016 డిసెంబర్ 9న ఒప్పందం చేసుకున్నట్టు స్పష్టం చేశారు. 7 మిలియన్ టన్నుల దిగుమతి బొగ్గు తెస్తున్నామని 2016లో రైల్వే శాఖకి లేఖ కూడా రాసిన విషయం కూడా బయటపెట్టారు. దిగుమతి బొగ్గుపై విచారణ జరిపించాలని కేటీఆర్ లేఖ రాశారు. ఏ విచారణకైనా నేను సిద్ధం.. ఏ విచారణ కావాలో చెప్పు అంటూ కౌంటర్ ఎటాక్ చేశారు సీఎం రేవంత్. నిజాని యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ వాదన వేరుగా ఉంది. నిజానికి ఈ పవర్ ప్లాంట్‌ని మణుగూరు ప్రాంతంలో కట్టి ఉంటే ఖర్చు తగ్గేదట. 4 రూపాయల 62 పైసలతో మణుగూరులో యూనిట్ విద్యుత్ ఉత్పత్తి అవుతోందట. కొత్తగూడెంలో ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి యూనిట్ 3 రూపాయల 94 పైసలు ఖర్చవుతోందట.
అదే సింగరేణి 1, 2లో అయితే యూనిట్ విద్యుత్ తయారీకి 4 రూపాయల 5 పైసలు వ్యయం జరుగుతోందట. కానీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మాత్రం యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి 6 రూపాయల 60పైసలు ఖర్చు అవుతోందని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఒక్కో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే ఒక్కో యూనిట్ విద్యుత్ మీద 2 రూపాయల 20 పైసలు అదనంగా ఖర్చవుతోందని లెక్కలు బయటపెట్టింది ప్రభుత్వం. అంటే ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కారణంగా 50 వేల కోట్ల రూపాయల అదనపు భారం ప్రజలపై పడుతోందట. దీనికి బాధ్యులెవరో చెప్పాలంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక్క యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కారణంగా వచ్చే 25 ఏళ్లలో లక్ష కోట్ల నష్టం జరుగుతుందని లెక్కలు బయటపెట్టారు ముఖ్యమంత్రి. మరోవైపు ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న అసైన్డ్ భూముల గురించి దర్యాప్తు జరుగుతోంది. దీనికి కొనసాగింపుగా పంచపాండవుల చెరువు సంగతి ఏంటి అంటూ చర్చకు తెరలేపారు సీఎం రేవంత్. కొండపోచమ్మ సాగర్ నుంచి పంచపాండవుల చెరువుల్లో నీళ్ళు నింపి… చెరువుల నుంచి నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్‌కు నీటిని తరలించేలా పైప్ లైన్ వేశారు. అది ఎలా వచ్చింది..? ఫామ్‌హౌస్‌కు ప్రత్యేకంగా ఎందుకు పైప్‌లైన్ వేశారని ప్రశ్నించారు సీఎం. నిజనిర్ధారణకు మీడియాను పంపాలా..? లేదంటే కమిటీ వేయాలా చెప్పండంటూ సవాల్ కూడా చేశారు. రాష్ట్రం అంతా ఎల్‌నినో కారణంగా రైతులు ఇబ్బంది పడుతుంటే… కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మాత్రం రిజర్వాయర్ నుంచి నేరుగా నీళ్ళు ఎలా వచ్చాయనే విషయాన్ని ప్రజల్లో చర్చకు పెట్టారు రేవంత్. ఈ రకంగా ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తుంటే… ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కొని ప్రజల్లో దోషిగా నిలబెట్టాలని ఎత్తులు వేస్తున్నారు ముఖ్యమంత్రి.

