OTR : ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఇసుక దుమారం

Congress

Congress

ఇద్దరు మంత్రులు గోదావరి నదిని చెరబట్టారని బీఆర్‌ఎస్‌ ఆరోపణలు. ఏకంగా ఒక జిల్లా పరిధిలో వేల కోట్ల రూపాయల విలువైన ఇసుకను మింగేసే ప్లాన్‌లో ఉన్నారని ప్రచారం. ఆ విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు విపక్షం ప్రయత్నిస్తుంటే…. అధికార పార్టీ వైపు నుంచి ఎందుకు సరైన రియాక్షన్‌ లేదు? ముఖ్యమైన నాయకులు ఎవరూ మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? తప్పు జరగలేదని సొంతపార్టీ వాళ్ళే నమ్మడం లేదా? లేక వేరే కారణాలున్నాయా? వరంగల్‌ జిల్లా పాలిటిక్స్‌లో ఇప్పుడు ఇసుక దుమారం రేగుతోంది. ఇసుక దందాతో ఇద్దరు మంత్రులు వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపిస్తూ… అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నంలో ఉంది బీఆర్ఎస్‌. ములుగు జిల్లాలో ఎప్పుడూ లేనివిధంగా ఇసుక దోపిడీ జరుగుతోందని విపక్షం చేస్తున్న ఆరోపణలు పొలిటికల్‌ మంటలు పుట్టిస్తున్నాయి. దోపిడీకి సంబంధించి మా దగ్గర డ్రోన్ విజువల్స్, ఇతర ఆధారాలు ఉన్నాయంటూ… రోజుకో ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేస్తున్నారు గులాబీ నేతలు. అలాగే… దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో… దీనికి కౌంటర్ ఇవ్వడంలో జిల్లా కాంగ్రెస్‌ నేతలు విఫలమవుతున్నారన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఇద్దరు మంత్రులు అంటూ… బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారంపై కేవలం ములుగు జిల్లా పార్టీ నేతలు మినహా… కాస్తంత హోదా ఉన్న, పెద్ద నాయకులు ఎవరూ ఎందుకు రియాక్ట్‌ అవడం లేదన్న చర్చలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. రాష్ట్ర మంత్రులు ఇద్దరు కలిసి ములుగు జిల్లా పరిధిలోని గోదావరి ఇసుకను మింగేస్తున్నారంటూ డైరెక్ట్‌గా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. సీతమ్మ సాగర్‌లో అక్రమంగా ఇసుక తవ్వి దాదాపు 4 వేల కోట్ల రూపాయలు వెనకేసుకునేందుకు మంత్రులు ఇద్దరూ ప్రయత్నిస్తున్నారన్నది కేటీఆర్‌ ఆరోపణ. ఇసుక మాఫియా సూత్రధారులను బయటకు లాగాలన్నది ఆయన డిమాండ్‌.

దీనికి సంబంధించి ములుగు కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు గులాబీ నేతలు. ఇలా ఇసుక దోపిడీ పేరుతో అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేలా బీఆర్ఎస్‌ నేతలు రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున్నా…. అధికార పక్షం నుంచి గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం మాత్రం జరగడంలేదని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం ములుగు నాయకులు, అందునా ఒక మంత్రి అనుచరగణం తప్ప… ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏ ముఖ్య నేతా ఎందుకు స్పందించలేదన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆ విషయంలో కాంగ్రెస్‌ వాళ్ళు ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటూ ఎవరికి వారు రకరకాల విశ్లేషణల్లో మునిగిపోయారు. ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు అశోక్, జిల్లా పార్టీలోని కొందరు నాయకులు మాత్రమే బీఆర్‌ఎస్‌ ఆరోపణలకు రియాక్ట్‌ అయి నిరూపించమంటూ సవాల్‌ విసిరారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేల సంగతి తర్వాత… కనీసం ఉమ్మడి వరంగల్‌ పరిధిలో ఇప్పుడున్న మిగిలిన ఐదు జిల్లాల డీసీసీ అధ్యక్షులు కూడా మినిస్టర్స్‌ మీద వస్తున్న ఇసుక ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదన్నది ఆలోచించాల్సిన విషయమేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇసుక తవ్వకాలకు సంబంధించిన అనుమతుల విషయంలో ఎక్కడా తప్పు జరగలేదని, మంత్రులు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా వ్యవహరించలేదని కాంగ్రెస్‌ నేతలు గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి.

×
×
Ad

ఇందుకు సమాధానంగా వినిపిస్తున్న కొన్ని మాటలు కాంగ్రెస్‌ పార్టీలోని ప్రస్తుత పరిస్థితి ప్రతిబింబిస్తున్నాయని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. ఏం మాట్లాడితే ఏమవుతుందోనన్న భయంతోనే ఎక్కువ మంది కామ్‌గా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. చేతిలో పూర్తి సమాచారం లేకుండా…. ఏదో, మంత్రుల్ని వెనకేసుకుని రావాలి కాబట్టి నోటికొచ్చింది మాట్లాడేస్తే… రేపు మనం ఇరుక్కుపోతామన్న భయం వాళ్ళలో ఉందట. అందుకే ఇసుక ఆరోపణల విషయంలో మంత్రులు ఇద్దరికీ బాసటగా నిలవలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే…. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రుల నుంచి కూడా…. మనం కరెక్ట్‌గానే ఉన్నాం, మీరు ఖండించండన్న గ్రీన్‌ సిగ్నల్‌ కూడా రాలేదని అంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ అధిష్టానం సైతం ఈ విషయంపై నేతలకు క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల ఇసుక దందా అంశాన్ని పట్టించుకోకుండా ఎవరికి వారు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారట. కానీ… విపక్షం ఆరోపణలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళక ముందే మేలుకుని ప్యాచ్‌వర్క్‌ చేయకుంటే…. నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తాయన్న టెన్షన్‌ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది.