OTR : జూబ్లీ హిల్స్ BRSలో మూడు ముక్కలాట! కేటీఆర్‌కే తలనొప్పిగా మారిన హాట్ సీట్?

Brs

Brs

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం అంటే అన్ని పార్టీలు హాట్‌ సీటుగానే భావిస్తాయ్‌. ఆ సెగ్మెంట్‌లో జరిగిన ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. ఇప్పుడు మళ్లీ క్యాడర్‌ను గాడిలో పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. అలాంటి పార్టీ కేవలం సమన్వయ సమావేశం నిర్వహించటానికే నానా తంటాలు ఎందుకు పడుతోంది? గ్రేటర్‌ ఎన్నికలు రాబోతున్న తరుణంలో జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌ స్కెచ్‌ ఏంటి?మూడు ముక్కలాటలో గులాబీ క్యాడర్‌ నలిగిపోతున్నారా?గుంపులు కడుతూ గూడు పుఠాణీలు చేసేదెవరు? తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే దాదాపు 60 నియోజకవర్గాలకు పైగా సమావేశాలు పూర్తయినట్లు సమాచారం. స్వయంగా కేటీఆర్, హరీష్‌రావులు ఈ సమన్వయ సమావేశాలకు హాజరవుతున్నారు. పార్టీ సభ్యత నమోదు…ఎస్ఐఆర్ ప్రక్రియపై కార్యకర్తలకు గైడెన్స్ సైతం ఇస్తున్నారు. ఈ సమావేశాలతో కార్యకర్తలు అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పార్టీ హైకమాండ్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే అధికారంలోకి వచ్చేందుకు ఈ రెండున్నర ఏళ్లు ఏంచేయాలో కార్యకర్తలకు రూట్ మ్యాప్ ఇస్తున్నారని సమాచారం.

ఇక…ఇదే సమయంలో హైదరాబాద్‌లో ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం ఇప్పటి వరకు సమన్వయ సమావేశం నిర్వహించలేదు. గ్రేటర్‌లోని అన్ని నియోజకవర్గాల కంటే ముందుగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుగుతుందని అప్పట్లోనే ప్లాన్ చేసుకున్నారట. కానీ ఆ సమావేశం ఇప్పటి వరకు నిర్వహించనేలేదు. అలా ఒక్కసారి మాత్రమే కాదు దాదాపు మూడుసార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమన్వయ సమావేశం వాయిదా పడుతూ వచ్చినట్లు పార్టీలో చర్చ నడుస్తోందట. ఇలా జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమన్వయ సమావేశం వాయిదా పడటానికి ఓ ప్రధానమైన కారణం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం నియోజకవర్గం నేతలే స్వయంగా ఒప్పుకుంటున్నారట. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముగ్గురు నేతలు పెత్తనం చేయాలని చూస్తున్నారనే టాక్‌ నడుస్తోంది. నియోజకవర్గ సమావేశం జరగకపోవటానికి ఈ మూడు ముక్కలాటే కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరిగిన తర్వాత ఇక్కడి క్యాడర్లో మూడు వర్గాలుగా చీలిక వచ్చిందని తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసిన మాగంటి సునీత ఒక వర్గం అయితే ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన విష్ణువర్ధన్ రెడ్డి మరో వర్గంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. మాగంటి సునీతకు సపోర్ట్ చేసిన కార్పొరేటర్లు ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి వెనక తిరుగుతున్నారని సమాచారం. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వర్గ పోరు జరుగుతుందనే టాక్‌ నడుస్తోంది. విష్ణువర్ధన్ రెడ్డి ఇక్కడ పెత్తనం చేయడం ఏంటి అని మాగంటి సునీత పార్టీ అధిష్టానానికి ఓ దశలో కంప్లైంట్ చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది.

×
×
Ad

మరోవైపు…ఎప్పటినుంచో ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టిన రావుల శ్రీధర్ రెడ్డి కూడా తనకు ఇంచార్జి బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నట్టుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇలా ఈ ముగ్గురు నేతల మధ్య సమన్వయం కుదర్చడంలో అధిష్టానం తలమునకలైందట. అందుకే కార్యకర్తలను సమన్వయం చేసే మీటింగు వాయిదా పడుతూ వస్తోందని తెలుస్తోంది. సభ్యత్వ నమోదుకు సంబంధించిన ఇంఛార్జిగా విష్ణువర్ధన్ రెడ్డిని నియమించింది పార్టీ అధిష్టానం. మిగతా నియోజకవర్గాల్లో కార్యకర్తల సమన్వయ సమావేశానికి అక్కడున్న నేతలందరినీ ముందు సమన్వయం చేసి…ఆ తర్వాతే కార్యకర్తల సమావేశం నిర్వహించారని ఇన్‌సైడ్‌ టాక్‌. ఇక్కడ మాత్రం పెద్ద నేతల మధ్య సమన్వయం కుదర్చడానికే అధిష్టానం నానా తంటాలు పడాల్సి వస్తోందట. అందుకే కార్యకర్తల సమన్వయ సమావేశం వాయిదా పడుతూ వస్తోందని నేతలు చెబుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం బీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాయకులను ఎలా సమన్వయం చేయాలని ఇప్పటినుంచే కసరత్తు చేస్తుందట పార్టీ హైకమాండ్‌. ఈ కార్యకర్తల సమావేశమే వాయిదాలు పడుతూ వస్తూ ఉంటే భవిష్యత్తులో గ్రేటర్ ఎన్నికలకు ఈ నియోజకవర్గంలో ఇంకా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయోనని మాట్లాడుకుంటున్నారు సొంత పార్టీలోని కేడర్‌. ఏది ఏమైనా నేతల మధ్య త్వరలోనే సమన్వయం తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కేటీఆర్‌తో కార్యకర్తల సమన్వయ సమావేశం నిర్వహిస్తామని చెబుతున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. మొత్తానికి…ఈ సమావేశానికి ఇంకెంత టైమ్‌ పడుతుందో చూడాల్సిందే మరి.