OTR : వ్యూహకర్త విషయంపై బీఆర్ఎస్‌లో భిన్నాభిప్రాయాలు?

Brs

Brs

బీఆర్‌ఎస్‌ కోసం ఎన్నికల వ్యూహకర్తని నియమించుకోవాలన్న ప్రతిపాదన వచ్చిందా? ఆ విషయమై పార్టీలో గట్టి చర్చే జరిగిందా? సీనియర్‌ లీడర్స్‌ ఎలాంటి ప్రతిపాదన చేశారు? అందుకు కేసీఆర్‌ ఏమన్నారు? అందుసు సంబంధించి గులాబీ దళంలో జరుగుతున్న డిస్కషన్స్‌ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో రెండున్నరేళ్ళ సమయం ఉంది. ప్రతిపక్ష పార్టీలు ఇప్పట్నుంచే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎలక్షన్‌ ప్లానింగ్‌ మొదలు పెట్టేశాయి. ఈ సందర్భంగానే ఎన్నికల వ్యూహకర్తల ప్రస్తావన ఆసక్తికరంగా మారింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌లో ఈ విషయమై హాట్‌ హాట్‌ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టు మీదున్న గులాబీ పార్టీ… అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ట్రెండ్‌కు తగ్గట్టు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఒక కీలకమైన వ్యూహకర్తను నియమించుకోవడానికి ప్లాన్ చేశారట సీనియర్స్‌, ముఖ్య నాయకులు అంతా కలిసి.

 

×
×
Ad

ముందు వాళ్ళలో వాళ్లు మాట్లాడుకుని ఒక అవగాహనకు వచ్చి.. ఫైనల్‌గా ఇదే విషయాన్ని అధినేత కేసిఆర్ దృష్టికి తీసుకెళ్ళగా ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్టు తెలుస్తోంది. మనకెందుకు భయ్‌ వ్యూహకర్తలు…? వాళ్ళు మనకు మించిన వ్యూహకర్తలా అని అన్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ నేతల ప్రతిపాదనను కేసీఆర్‌ తిరస్కరించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నట్టు చెబుతున్నారు పార్టీ నేతలు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు పోరాటం చేయడం, ఆ తర్వాత పదేళ్లు అధికారంలో ఉండటంతో పాటు టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి కూడా వెళ్ళేలా ప్లాన్‌ చేశారు కేసీఆర్‌. వివిధ రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడంతోపాటు కేంద్రంలో అధికారం దిశగా పావులు కదిపారాయన. అంత కీలకమైన అలాంటి సమయంలోనే… ఎలాంటి వ్యూహకర్తని పెట్టుకోలేదు, ఇప్పుడు

రాష్ట్రంలో అవసరమా అంటూ అందర్నీ వారించినట్టు తెలిసింది.

అలాగే… మనం వ్యూహకర్తని అంటూ నియమించుకుంటే… ఇక ఏదీ మన చేతిలో ఉండదు, పార్టీ మొత్తం వాళ్ళు చెప్పినట్టే నడవాల్సి ఉంటుంది. పార్టీ చేసే కార్యక్రమాలు, పోరాటాల దగ్గర నుంచి ఎన్నికల ముందు సర్వేలు చేసి టికెట్లు ఇచ్చే వరకు ఏదీ మన చేతిలో ఉండదు. పూర్తి బాధ్యతలు స్ట్రాటజిస్ట్‌కు అప్పచెబితేనే వాళ్లు ఆ పని చేస్తారు. అలా ఏదీ… మన చేతిలో లేనప్పుడు వాళ్లతో మనకు అవసరం లేదని అన్నట్టు తెలుస్తోంది. ఒక్కరితో మొదలైన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసే వరకు పోరాడడం, పదేళ్ల పాటు అధికారంలో ఉండే విధంగా వ్యూహాలు రూపొందించిన తాను కొత్తగా ఎవరో మరో వ్యక్తి వచ్చి చెబితే కార్యక్రమాలు చేయాలా అంటూకేసీఆర్‌ సున్నితంగా తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఇక అధికారంలోకి రావడానికి రెండో అంశాన్ని కూడా కేసీఆర్ నేతలకు వివరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు పవర్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని,ఆ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, తాము అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను గుర్తు చేయడంలాంటి వాటితోనే తేలిగ్గా గెలుస్తామని చెప్పినట్టు తెలిసింది. అయితే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే… ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొన్ని రోజులపాటు సేవలు అందించారు. అప్పుడు పీకే చెప్పిన కార్యక్రమాలు నచ్చకపోవడంతో కేసీఆర్ ఆయన్ని దూరం పెట్టేశారట. అయితే అది బీఆర్ఎస్ అధికారంలో స్వింగ్ లో ఉన్న టైం అని, కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కోవాలంటే వ్యూహకర్త అవసరం అన్న వాదనని సీనియర్ నేతలు కొందరు సమర్ధిస్తున్నారట. మరికొంతమంది మాత్రం కేసీఆర్ లాంటి రాజకీయ ఉద్దండుడు గులాబీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నప్పుడు మరొకరితో పనేముందని క్లారిటీగా చెబుతున్నారట. మొత్తం మీద ఎన్నికల వ్యూహకర్త విషయమై గులాబీ దళంలో గట్టి చర్చే జరుగుతోంది.